
● స్పెషల్ పార్టీ కానిస్టేబుల్‌కు తీవ్రగాయాలు
● క్షతగాత్రుడిని గుంటూరు తరలించిన పోలీసులు
కంభం: విధులకు హాజరయ్యేందుకు కంభం వెళ్తున్న ఓ కానిస్టేబుల్ బైక్ అదుపుతప్పి తీవ్రంగా గాయపడ్డారు. ఈ సంఘటన సోమవారం తెల్లవారుజామున కంభం మండలంలోని పోరుమామిళ్లపల్లి గ్రామ సమీపంలో చోటుచేసుకుంది. వివరాలు.. స్పెషల్ పార్టీ కానిస్టేబుల్ మాదిరెడ్డి తిరుపతిరెడ్డి సోమవారం ఉదయం కంభం అర్బన్ కాలనీలో కార్డన్ సెర్చ్‌లో పాల్గొనాల్సి ఉంది. ఈ క్రమంలో ఆదివారం రాత్రి తురిమెళ్ల గ్రామంలోని తన అత్తగారింట్లో ఉండి సోమవారం తెల్లవారుజామున బైక్‌పై కంభం బయలుదేరారు. ఈ క్రమంలో పోరుమామిళ్లపల్లి సమీపంలోని మూలమలుపు వద్ద బైక్ అదుపుతప్పి పంట పొలాల్లోకి దూసుకెళ్లింది. ఈ ప్రమాదంలో కానిస్టేబుల్ కుడి చేతి రెండు వేళ్లు విరిగిపోవడంతోపాటు తలకు తీవ్రగాయాలయ్యాయి. అటుగా వెళ్తున్న వారు గమనించి 108 అంబులెన్స్‌కు ఫోన్ చేయగా వాహనం అందుబాటులో లేదు. ప్రమాద సమాచారం అందుకున్న కంభం సీఐ మల్లికార్జున, ఎస్సై నరసింహారావు సంఘటనా స్థలానికి చేరుకుని కానిస్టేబుల్ తిరుపత్తిరెడ్డిని కంభంలో ఓ ప్రైవేట్ ఆస్పత్రికి తరలించారు. ప్రథమ చికిత్స అనంతరం మార్కాపురంలోని ఓ ఆస్పత్రికి, అక్కడి నుంచి గుంటూరులోని ప్రైవేట్ ఆస్పత్రికి తరలించి చికిత్స అందిస్తున్నారు.