
రోడ్డు ప్రమాదంలో మహిళ మృతి
పెద్దారవీడు: రోడ్డు దాటేందుకు పక్కన వేచిఉన్న మహిళను వేగంగా వెళ్తున్న బైక్ ఢీకొట్టడంతో అక్కడికక్కడే మృతి చెందింది. ఈ సంఘటన పెద్దారవీడు మండలంలోని బోడిరెడ్డిపల్లి ఎంపీపీ పాఠశాల వద్ద సోమవారం రాత్రి చోటుచేసుకుంది. స్థానికుల కథనం ప్రకారం.. గ్రామానికి చెందిన గంజి నారాయణమ్మ వీరభద్రస్వామి గుడిలో ఉత్సవానికి వెళ్లేందుకు ఇంటి నుంచి బయటకొచ్చింది. అదే సమయంలో హనుమాన్‌జంక్షన్ కుంట వైపు నుంచి లారీ వస్తుండటంతో రోడ్డు దాటకుండా పక్కన వేచిఉంది. జాతీయ రహదారిపై ఎంపీపీ పాఠశాల దగ్గర ఒక లారీకి రూ.50 రుసుం వసూలు చేసేందుకు ప్రభుత్వం చెక్ పోస్టు ఏర్పాటు చేసింది. అయితే చెక్‌పోస్టు వద్ద లారీ ఆపకుండా డ్రైవర్ వెళ్లిపోతుండటంతో అక్కడ విధులు నిర్వహిస్తున్న వ్యక్తి బైక్‌కు లైట్లు వేయకుండా లారీని వెంబడించాడు. ఈ క్రమంలో రోడ్డు పక్కన వేచి ఉన్న గంజి నారాయణమ్మ(50)ను బైక్ ఢీకొట్టడంతో అక్కడికక్కడే మృతి చెందింది. మృతురాలికి భర్త నారాయణరెడ్డి, ఇద్దరు పిల్లలు ఉన్నారు. నారయణమ్మ మృతితో కుటుంబ సభ్యులు, బంధువులు కన్నీరుమున్నీరయ్యారు. మృతురాలి భర్త ఫిర్యాదు మేరకు కేసు దర్యాప్తు చేస్తున్నట్లు పోలీసులు తెలిపారు.