
కూటమి ప్రభుత్వంలో అరాచక పాలన
పొన్నలూరు: రాష్ట్రంలో కూటమి ప్రభుత్వం ఏర్పడిన తర్వాత సామాన్య ప్రజలు, వైఎస్సార్ సీపీ నాయకులు, కార్యకర్తలపై అక్రమ కేసులు పెడుతూ అరాచక పాలన కొనసాగిస్తున్నారని వైఎస్సార్ సీపీ పీఏసీ సభ్యుడు, మాజీ మంత్రి డాక్టర్ ఆదిమూలపు సురేష్ ధ్వజమెత్తారు. పొన్నలూరు మండలంలోని మాలపాడు గ్రామంలో వీరబ్రహ్మేంద్రస్వామి ఆరాధన ఉత్సవాల్లో భాగంగా బుధవారం రాత్రి స్వామివారిని దర్శించుకుని ప్రత్యేక పూజలు చేశారు. అనంతరం స్థానిక వైఎస్సార్ సీపీ నాయకులు ఏర్పాటు చేసిన విద్యుత్ ప్రభపై ఆదిమూలపు సురేష్ మాట్లాడారు. చంద్రబాబు ప్రజలకు ఇచ్చిన హామీలను తుంగలో తొక్కి ఎప్పటికప్పుడు మాటలు మారుస్తూ మాటల మాంత్రికుడిగా వ్యవహరిస్తున్నారని విమర్శించారు. చంద్రబాబు ఇచ్చిన హామీలు అమలు చేయకుండా, ప్రశ్నించిన వారిపై అక్రమ కేసులు పెడుతూ రాష్ట్ర ప్రజలను భయబ్రాంతులకు గురిచేస్తున్నారని మండిపడ్డారు. టీడీపీ నాయకులు, కార్యకర్తలు గ్రామస్థాయి నుంచే ప్రతి విషయంలో అవినీతికి పాల్పడుతూ దర్జాగా ప్రజల సొమ్ము దోచుకుంటున్నారని ఆరోపించారు. తొలి నుంచి యూటర్న్ బాబుగా పేరుపొందిన చంద్రబాబు ఏడాదిగా రాష్ట్ర ప్రజలకు చేసిన మేలు శూన్యమన్నారు. గ్రామానికి రెండు నుంచి మూడు బెల్ట్ షాపులు ఏర్పాటు చేసి అమాయక పేద ప్రజలను మద్యానికి బానిసలుగా తయారు చేయడం నీచమన్నారు. చంద్రబాబు చేస్తున్న అరాచక పాలనను ప్రజలు, ఉద్యోగులు, రైతులు, నిరుద్యోగులు, మేధావులు గమనిస్తున్నారని రానున్న రోజుల్లో తప్పకుండా బుద్ధి చెబుతారన్నారు. రాష్ట్రంలో మళ్లీ రాజన్న రాజ్యం రావాలంటే జగనన్నని మరోసారి ముఖ్యమంత్రిని చేసుకోవాల్సిన అవసరం ఉందన్నారు. కార్యక్రమంలో జెడ్పీటీసీ బెజవాడ వెంకటేశ్వర్లు, ఎంపీపీ కొండాబత్తిన మాధవరావు, వైఎస్సార్ సీపీ మండల కన్వీనర్ దుద్దుగుంట మల్లికార్జునరెడ్డి, వైఎస్సార్ సీపీ రాష్ట్ర వాణిజ్య విభాగం కార్యదర్శి సిరిగిరి గోపాల్ రెడ్డి, పిల్లి తిరుపతిరెడ్డి, సర్పంచ్ అనుమోలు ప్రసాద్, నవులూరి మధు, కొండపి, జరుగుమల్లి మండలాల కన్వీనర్లు బచ్చల కోటేశ్వరరావు, పిన్నికి శ్రీనివాసరావు తదితరులు పాల్గొన్నారు.
మాటల మాంత్రికుడిలా సీఎం
చంద్రబాబు తీరు
పేదలను మద్యానికి బానిసలు చేయడం నీచం
ఏడాది పాలనలో ప్రజలకు చేసిన
మేలేమిటో చెప్పాలి
మాజీ మంత్రి ఆదిమూలపు సురేష్ ధ్వజం