
జీవో 77 వెంటనే రద్దు చేయాలి
ఒంగోలు సిటీ: అఖిల భారతీయ విద్యార్థి పరిషత్ ఒంగోలు శాఖ ఆధ్వర్యంలో నగరంలోని లాయర్‌పేటలోని ప్రకాశం పంతులు విగ్రహం వద్ద మంగళవారం జీవో నం.77 ను రద్దు చేయాలని కోరుతూ విద్యాశాఖామంత్రి నారా లోకేష్ దిష్టిబొమ్మ దహనానికి ఏబీవీపీ కార్యకర్తలు ప్రయత్నించగా ఒన్‌టౌన్ పోలీసులు అడ్డుకున్నారు. ఈ సందర్భంగా నెల్లూరు విభాగ్ కన్వీనర్ రాజశేఖర్ మాట్లాడుతూ జీవో నంబర్ 77 రద్దు చేయకుండా బుధవారం ఐసెట్ పరీక్షలు నిర్వహిస్తున్నారన్నారు. ఆ జీఓపై ప్రభుత్వం స్పష్టమైన నిర్ణయం ఇవ్వకపోతే ఐసెట్ పరీక్షలను అడ్డుకుంటామని చెప్పారు. విద్యాశాఖ మంత్రి నారా లోకేష్ యువగళం పాదయాత్రలో ఇచ్చిన మాటను నిలబెట్టుకోకపోవడం ఎంతో సిగ్గు పడాల్సిన విషయమన్నారు. ఎన్నికల ముందు తమ ప్రభుత్వం రాగానే జీవో నంబరు 77 ను రద్దు చేస్తామని చెప్పి ప్రభుత్వం ఏర్పడి నేటికి 327 రోజులవుతున్నా దానిని పట్టించుకోలేదన్నారు. ఏబీవీపీ జిల్లా కన్వీనర్ అంకిరెడ్డి మాట్లాడుతూ విద్యాశాఖ మంత్రి కళ్లు తెరిచి విద్యార్థుల సమస్యలు చూడాలని, పీజీ విద్యార్థుల మెడ మీద కత్తిలా తయారైన జీవో నం.77 ను ఐసెట్ పరీక్షలకు ముందే రద్దు చేయాలని డిమాండ్ చేశారు. కార్యక్రమంలో ఏబీవీపీ కార్యకర్తలు సుదర్శన్, గురునాథ్, శామ్యూల్, అయ్యప్ప, నరేంద్ర, ఈశ్వర్ రెడ్డి, వినయ్ తదితరులు పాల్గొన్నారు.
మంత్రి నారా లోకేష్ దిష్టిబొమ్మ దహనానికి ప్రయత్నించిన ఏబీవీపీ కార్యకర్తలు అడ్డుకున్న పోలీసులు