కూటమి నేతలకు రొక్కం.. కూలీలకు దుఃఖం | - | Sakshi
Sakshi News home page

కూటమి నేతలకు రొక్కం.. కూలీలకు దుఃఖం

May 7 2025 1:44 AM | Updated on May 7 2025 1:44 AM

కూటమి

కూటమి నేతలకు రొక్కం.. కూలీలకు దుఃఖం

యర్రగొండపాలెం: ఉపాధి కూలీల కష్టార్జితాన్ని కూటమి నాయకులు, అధికారులు దోచుకుంటున్నారు. ఒక్కొక్క మస్టర్‌కు రూ.300 నుంచి రూ.500 వరకు వసూలు చేసుకుంటున్నారన్న ఆరోపణలు వెల్లువెత్తుతున్నాయి. యర్రగొండపాలెం నియోజకవర్గంలో మొత్తం 89,922 జాబ్‌కార్డులు ఉన్నాయి. అందులో ప్రస్తుతం 53,010 మంది కూలీలు ఉపాధి పనులు చేస్తున్నారు. ఈ సంఖ్య రోజు రోజుకూ పెరుగుతోంది. పనులు చేసే కూలీలు మస్టర్‌ వేయించుకునేందుకు వారానికి రూ.300, పనులు చేయకుండా మస్టర్లు వేయించుకునేవారు రూ.500 ప్రకారం ముందుగానే చెల్లించాలని కూటమి నేతలు స్పష్టం చేయడంపై దుమారం రేగుతోంది. ఎంపీడీవోల కనుసన్నల్లో ఈ అవినీతి భాగోతం జరుగుతోందన్న విమర్శలు వినిపిస్తున్నాయి. ఆయా మండలాల ఏపీవోలు ముఖ్య భాగస్వాములుగా ఉంటున్నారని కూలీలు ఆరోపిస్తున్నారు. కూలీల నుంచి వసూలు చేసిన మొత్తాన్ని మూడు భాగాలుగా విభజిస్తారని, అందులో ఒక భాగం నియోజకవర్గ స్థాయి టీడీపీ నాయకుడికి, రెండో భాగం ఎంపీడీవోకు, మూడో భాగం ఎన్‌ఆర్‌ఈజీఎస్‌ సిబ్బందికి చెందేలా ఒప్పందం కుదుర్చుకున్నట్లు నియోజకవర్గంలో జోరుగా ప్రచారం సాగుతోంది.

వారానికి రూ.150 కోట్లు వసూలు

ప్రస్తుత లెక్కల ప్రకారం వారానికి దాదాపు రూ.1.50 కోట్ల ప్రకారం రెండు వారాలకు కలిపి దాదాపు రూ.3 కోట్లు ఆయా మండలాల్లో పనులు చేసే కూలీల నుంచి వసూలు చేసినట్లు సమాచారం. ఈ విధంగా ఒక్కొక్క కూలీ వంద రోజుల పనిదినాల ప్రకారం 16 వారాల పాటు పనులు చేయాల్సి ఉంటుంది. ప్రస్తుతం జరుగుతున్న పనుల్లో నియోజకవర్గంలోని 5 మండలాల నుంచి వలస వెళ్లినవారు పాల్గొనడం లేదు. ఇతర పనులకు వెళ్లేవారు తమ పనిదినాలు పూర్తి చేసుకోవటానికి ఉపాధి హామీ పనులకు ఆలస్యంగా వస్తున్నారు. వీరిని కూడా కలిపితే దాదాపు లక్ష 60 వేల మంది నియోజకవర్గంలో ఉపాధి పొందే జాబితాలో ఉన్నారు. ఈ లెక్కల ప్రకారం 16 వారాలకు కలిపి రూ.76.80 కోట్లు కూలీల నుంచి వసూలు చేశారన్న ఆరోపణలు బలంగా వినిపిస్తున్నాయి. ఈ దోపిడీని ఎమ్మెల్యే, వైఎస్సార్‌ కాంగ్రెస్‌ పార్టీ రాష్ట్ర అధికార ప్రతినిధి తాటిపర్తి చంద్రశేఖర్‌ ప్రశ్నిస్తారన్న ఉద్దేశంతోనే యర్రగొండపాలెం, పెద్దదోర్నాల మండల పరిషత్‌ సమావేశాలు జరగకుండా ఎంపీడీవోలు, అధికారులు డుమ్మా కొడుతున్నారన్న చర్చ నడుస్తోంది.

కూలీల కష్టార్జితాన్ని పచ్చ దొంగల ముఠా దోచుకుంటోంది

ఉపాధి హామీ నిధులను సైతం టీడీపీ దొంగల ముఠా దోచుకుంటోంది. నియోజకవర్గానికి చెందిన టీడీపీ నాయకుడు ఒక ముఠాను తయారు చేసుకొని కూలీల డబ్బు దోచుకునేలా ప్రోత్సహిస్తున్నారు. దీనికి నియోజకవర్గంలోని 5 మండలాల ఎంపీడీవోలు పూర్తి సహకారం అందిస్తున్నారు. ఒక్కో కూలీ నుంచి రూ.300, పనిచేయకుండా మస్టర్లు వేయించుకునేవారి నుంచి రూ.600 ప్రకారం వసూలు చేసుకుని పంచుకుంటున్నారు. టీడీపీ దొంగల ముఠా, అధికారులు కలిసి వారానికి రూ.3 కోట్లు ప్రకారం వసూలు చేస్తున్నా ప్రభుత్వం పట్టించుకోవడంలేదు. కోట్ల రూపాయల ధనాన్ని అడ్డదారుల్లో పందికొక్కుల్లా మెక్కుతున్న వ్యవహారాన్ని ప్రశ్నించే వారిని, వైఎస్సార్‌ సీపీకి ఓటు వేసిన వారిని పనుల నుంచి తొలగిస్తున్నారు. ఇటీవల యర్రగొండపాలెం మండల పరిషత్‌ సమావేశంలో ప్రశ్నిస్తున్న ఎంపీపీ, జెడ్పీటీసీ, వైస్‌ ఎంపీపీని ఎంపీడీవో అగౌరవపరిచారు. నియోజకవర్గ టీడీపీ ఇన్‌చార్జి ధనదాహంతో అక్రమాలను ప్రోత్సహిస్తున్నారు.

– తాటిపర్తి చంద్రశేఖర్‌, యర్రగొండపాలెం ఎమ్మెల్యే

మస్టర్‌కు రూ.300 వసూలు

అధికారులు, కూటమి నేతలు కలిసి రూ.కోట్లు స్వాహా

చేస్తున్నట్లు ఆరోపణలు

ప్రశ్నిస్తారని సమావేశాలకు డుమ్మా కొడుతున్న అధికారులు

తీవ్ర చర్యగా పరిగణిస్తామన్న ఎమ్మెల్యే తాటిపర్తి చంద్రశేఖర్‌

కూటమి నేతలకు రొక్కం.. కూలీలకు దుఃఖం 1
1/1

కూటమి నేతలకు రొక్కం.. కూలీలకు దుఃఖం

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement