
పెనుగాలుల బీభత్సం
తర్లుపాడు/మార్కాపురం: పెనుగాలులు బొప్పాయి రైతులను అతలాకుతలం చేశాయి. సోమవారం రాత్రి ఉరుములు, మెరుపులతో కూడిన ఈదురు గాలుల ధాటికి తర్లుపాడు మండలంలో 197 ఎకరాల్లో బొప్పాయి తోటలకు నష్టం వాటిల్లింది. రాగసముద్రంలో 15 మంది రైతులకు చెందిన 38 ఎకరాలు, కలుజువ్వలపాడు నలుగురు రైతులకు చెందిన 12 ఎకరాలు, జంగంరెడ్డిపల్లిలో 15 మంది రైతులకు చెందిన 38 ఎకరాలు, కలుజువ్వలపాడులో నలుగురికి చెందిన 12 ఎకరాలు, ఓబాయిపల్లిలో 43 మంది రైతులకు చెందిన 61 ఎకరాల్లో, కొండారెడ్డిపల్లిలో 16 మంది రైతులకు చెందిన 31 ఎకరాలు, లక్ష్మక్కపల్లిలో ఐదుగురు రైతులకు చెందిన 19 ఎకరాల్లో తోటలు దెబ్బతిన్నాయి. ఇప్పటికే టన్ను రూ.20 వేల నుంచి రూ.5 వేలకు పడిపోయి తీవ్ర నష్టాల్లో ఉన్న బొప్పాయి రైతులను పెనుగాలులు తీవ్ర విషాదంలోకి నెట్టాయి. చెట్టునిండా కాయలతో కళకళలాడుతున్న బొప్పాయి నేలకు వాలటంతో రైతులు బోరున విలపించారు. అప్పు చేసి లక్షల రూపాయలు పెట్టుబడి పెట్టిన రైతులు.. పంట చేతికందే సమయంలో నేలకూలడంతో రైతుల నోట మాటరావడం లేదు. మార్కాపురం హార్టికల్చర్ అధికారి రమేష్, ఏఓ వెంకటేశ్వర్లు గ్రామాల్లో నేలకూలిన బొప్పాయి పంటలను పరిశీలించారు.
మార్కాపురం మండలంలోని గజ్జల కొండ పంచాయితీలో సోమవారం సాయంత్రం వీచిన ఈదురు గాలులకు 15 మంది రైతులకు చెందిన 38 ఎకరాల బొప్పాయి తోటలకు నష్టం వాటిల్లిందని మండల ఉద్యాన వనశాఖాధికారి రమేష్ తెలిపారు. దెబ్బతిన్న తోటలను ఆయనతోపాటు ఏఓ శ్రీనివాసులు, వీఆర్‌ఓ సౌజన్య పరిశీలించారు.
తర్లుపాడు మండలంలో 197 ఎకరాలు, మార్కాపురం మండలంలో 38 ఎకరాల్లో బొప్పాయి తోటలకు నష్టం
ప్రభుత్వం ఆదుకోవాలంటూ రైతుల విజ్ఞప్తి

పెనుగాలుల బీభత్సం