
వైద్యుల పనితీరుపై పర్యవేక్షణ అవసరం
ఒంగోలు సబర్బన్: వైద్యులు, సిబ్బంది ఆసుపత్రికి హాజరవుతున్న సమయం, వారి పనితీరుపై పటిష్ట పర్యవేక్షణ అవసరమని కలెక్టర్ తమీమ్ అన్సారియా పేర్కొన్నారు. ఆయా ఆస్పత్రుల పర్యవేక్షకులు ఈ విషయాలపై ప్రత్యేక శ్రద్ధ పెట్టాలని ఆదేశించారు. జిల్లాలోని ఏరియా ఆసుపత్రులు, కమ్యూనిటీ ఆసుపత్రుల నిర్వహణపై మంగళవారం ప్రకాశం భవనంలో సంబంధిత శాఖల అధికారులతో సమీక్ష నిర్వహించారు. ఆసుపత్రుల వారీగా సిబ్బంది ఖాళీలు, రోజువారీ కార్యక్రమాలు, అందిస్తున్న సేవలు, లేబొరేటరీ, ఎక్స్ రే, స్కానింగ్, ఈసీజీ, బ్లడ్ బ్యాంక్, డయాలసిస్, విద్యుత్ జనరేటర్ మరమ్మతులు, ఇతర నిర్మాణ పనులు, ఎన్‌టీఆర్ వైద్య సేవ క్లెయిమ్స్ పరిష్కారం తీరు తదితర అంశాలపై ఆరా తీశారు. రోగులకు మెరుగైన సేవలు అందేలా పర్యవేక్షించాల్సిన బాధ్యత సూపరింటెండెంట్లదే అని కలెక్టర్ స్పష్టం చేశారు. పద్ధతి సరిగా లేని సిబ్బందిపై చర్యలు తీసుకోవాలని ఆదేశించారు. ఉన్నతాధికారులనే ధిక్కరించే స్థాయిలో సిబ్బంది ఉంటే మీరేం చేస్తున్నారని ప్రశ్నించారు. ఇలాంటి వారి వల్ల మొత్తం వ్యవస్థ గాడి తప్పే అవకాశం ఉందని పేర్కొన్నారు. ప్రజలకు మెరుగైన వైద్య సేవలు అందించడంలో సిబ్బంది, వైద్యుల నిర్లక్ష్యాన్ని సహించేది లేదన్నారు. సమావేశంలో డీసీహెచ్‌ఎస్ శ్రీనివాస నాయక్, డీఎంహెచ్‌ఓ టి.వెంకటేశ్వర్లు, ఎన్‌టీఆర్ వైద్య సేవ జిల్లా కోఆర్డినేటర్ హేమంత్, ఆయా ఆసుపత్రుల సూపరింటెండెంట్లు, ఇతర అధికారులు పాల్గొన్నారు.
వైద్యశాలల పర్యవేక్షకులు ప్రత్యేక శ్రద్ధ పెట్టాలి
ఏరియా, కమ్యూనిటీ ఆస్పత్రులపై సమీక్షలో కలెక్టర్ తమీమ్ అన్సారియా