కబ్జాచేసి..! | - | Sakshi
Sakshi News home page

కబ్జాచేసి..!

May 6 2025 2:14 AM | Updated on May 6 2025 2:20 AM

కబ్జాచేసి..!

కబ్జాచేసి..!

కంచేసి..
ఖాళీ జాగాలపై వాలిపోతున్న పచ్చదండు

అధికారం అండ.. అధికారుల సహకారం..ఖాళీ జాగా కనిపిస్తే చాలు రాబందుల్లా వాలిపోతున్నారు కూటమి నేతలు. ప్రభుత్వ..ప్రైవేటు భూములు దర్జాగా కబ్జాచేసేస్తున్నారు. ప్రభుత్వ కార్యాలయాల్లో ఉన్న రికార్డులను సైతం తారుమారు చేసేందుకు వెనుకాడడంలేదన్న

ఆరోపణలు వెల్లువెత్తుతున్నాయి.

నిరుపేదల భూముల రికార్డులను తమ పేర్లతో ఆన్‌లైన్‌ చేసుకుంటూ పాగా వేస్తున్నారు. ఇదేమిటని అడిగితే నీకు చేతనైంది చేసుకో అంటూ బెదిరింపులకు దిగుతున్నారు. అక్రమార్కుల చెర నుంచి తమ భూములను కాపాడుకునేందుకు స్థోమత ఉన్నవారైతే కోర్టులను ఆశ్రయిస్తున్నారు. నిరుపేదలు జిల్లా ఉన్నతాధికారుల కార్యాలయాల చుట్టూ తిరుగుతూనే ఉన్నారు. వందలాది ఎకరాలు అన్యాక్రాంతమైపోతున్నా

పట్టించుకునే వారే కరువయ్యారు.

సాక్షి ప్రతినిధి, ఒంగోలు:

రాష్ట్రంలో కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిందే తడవుగా తెలుగుదేశం పార్టీ నాయకులు, కార్యకర్తలు భూ కబ్జాలకు తెరతీశారు. ఇసుక, గ్రావెల్‌, మద్యం దందాలతో సమాంతరంగా భూ ఆక్రమణలకు తెగబడుతున్నారు. ప్రతి సోమవారం కలెక్టర్‌ కార్యాలయంలో నిర్వహించే సమస్యల పరిష్కార వేదికలో వచ్చే ఫిర్యాదుల్లో సింహభాగం భూ వివాదాలే ఉండడం గమనార్హం. జిల్లా కేంద్రం ఒంగోలు మొదలు ఎక్కడ చూసినా అధికార పార్టీ నేతల ఆక్రమణల పర్వాలే కనిపిస్తున్నాయి.

జిల్లా కేంద్రమైన ఒంగోలులో తెలుగు భూచోళ్ల బెడద ఎక్కువైంది. ఇటీవల నగర శివారులోని ముక్తినూతలపాడు సర్వే నంబర్‌ 15లో మొత్తం 21.80 ఎకరాల భూమి ఉంది. దీనిలో 5.6 ఎకరాల భూమిని కబ్జా చేసిన టీడీపీ నాయకులు చుట్టూ ఫెన్సింగ్‌ వేసేశారు. దీని విలువ సుమారు రూ.15 కోట్లపైగానే ఉన్నట్టు తెలుస్తోంది. వీరు అధికార పార్టీ కీలక నాయకుడి అండదండలతోనే కబ్జాకు పాల్పడినట్లు ప్రచారం జరిగింది. ఈ విషయం తెలిసిన వెంటనే వైఎస్సార్‌ కాంగ్రెస్‌ పార్టీ నాయకులు ముక్తినూతలపాడు వెళ్లి కబ్జాకు గురైన భూములను పరిశీలించారు. రెవెన్యూ అధికారులకు ఫిర్యాదు చేశారు. అయినా ఈ కబ్జా గురించి కీలక నాయకుడు నోరు తెరచి మాట్లాడకపోవడం గమనార్హం. ఇటీవల ఒంగోలు నియోజకవర్గంలోని అనేక గ్రామాల్లో భూ కబ్జాలు జరుగుతున్నట్లు ఫిర్యాదులు వస్తున్నాయి. కబ్జాదారులంతా టీడీపీ నాయకులే కావడంతో రెవెన్యూ అధికారులు చోద్యం చూస్తున్నారన్న విమర్శలు వినిపిస్తున్నాయి.

కురిచేడులో వేయి ఎకరాలు హాంఫట్‌

కురిచేడు మండలంలోని పొట్లపాడు గ్రామంలో 80 ఎకరాల ప్రభుత్వ భూమిని కబ్జా చేసినట్లు సమాచారం. దర్శి నియోజకవర్గ టీడీపీ కీలక నాయకురాలిచేత తహశీల్దారుకు ఫోన్‌ చేసి లైన్‌ క్లియర్‌ చేసుకున్న స్థానిక టీడీపీ నాయకులు ఇతర జిల్లాలకు చెందిన టీడీపీ నాయకులకు బేరం పెట్టినట్లు ప్రచారం జరుగుతోంది. దీనికి సమీపంలో బయో గ్యాస్‌ ప్లాంట్‌ మంజూరు కావడంతో ఎకరా రూ.10 లక్షల వరకు పలుకుతోంది. అంటే రూ.8 కోట్లకు విక్రయించేందుకు ఒప్పందాలు జరిగినట్లు సమాచారం. పడమర వీరాయపాలెం గ్రామంలో సర్వే నంబర్‌ 8లో ఏకంగా 528 ఎకరాల భూమిని కబ్జా చేసేందుకు పచ్చ దండు ప్రయత్నాలు చేస్తున్నట్లు స్థానికులు ఆరోపిస్తున్నారు. రూ.60 కోట్ల విలువైన ఈ భూమిని ఇప్పటికే క్రయవిక్రయాలు సాగిస్తున్నట్లు తెలుస్తోంది. కల్లూరు గ్రామంలో సుమారు 200 ఎకరాల భూమిని సాగుదారుల నుంచి టీడీపీ నాయకులు బలవంతంగా లాక్కోవడంతో న్యాయం కోసం బాధితులు కోర్టుకు వెళ్లారు. దీని విలువ ప్రస్తుతం రూ.20 కోట్ల వరకు ఉంది. మండలంలోని పెద్దవరం గ్రామంలో తెలుగు తమ్ముళ్లు 150 ఎకరాల భూమిని కబ్జా చేసినట్లు సమాచారం. దీని విలువ ఎకరా రూ.6 నుంచి రూ.7 లక్షల వరకు ఉన్నట్లు స్థానికులు చెబుతున్నారు. ఈ భూముల్లోకి ప్రవేశించకూడదంటూ రెవెన్యూ అధికారులు హెచ్చరిక బోర్డు పెట్టినా వాటిని లెక్క చేయకుండా పచ్చ నేతలు కబ్జాకు పాల్పడ్డారు.

కొండపి, కనిగిరిల్లో కబ్జాల పర్వం...

ప్రభుత్వం వచ్చీరాగానే కొండపి మండలం పెట్లూరు గ్రామంలో రూ.6 కోట్ల విలువైన సుమారు 4.4 ఎకరాల భూమిని కొందరు టీడీపీ నాయకులు కబ్జా చేశారు. సదరు భూమిలో ఇళ్ల నిర్మాణాలు కూడా మొదలు పెట్టారు. బాధితులు కోర్టుకు పోవడంతో ప్రస్తుతం కబ్జా కథకు బ్రేక్‌ పడింది. కనిగిరి నియోజకవర్గంలోని పీసీపల్లి మండలంలోని పెద ఇర్లపాడు గ్రామంలో సర్వే నంబర్‌ 870లో 9.82 ఎకరాల భూమిని కబ్జా చేశారు. ఇక్కడ ఎకరా రూ.30 నుంచి రూ.40 లక్షల వరకు ఉంది. సుమారు రూ.4 కోట్ల విలువ చేసే భూమిని కాజేయడానికి టీడీపీ నాయకులు స్కెచ్‌ వేశారని సమాచారం. బాధితులు కోర్టుకు వెళ్లడంతో ప్రస్తుతం ఆ భూమిలో రెవెన్యూ అధికారులు హెచ్చరిక బోర్డు పెట్టారు. అయినా పచ్చదండు తమవంతు ప్రయత్నాలు చేస్తున్నట్లు సమాచారం.

గ్రీవెన్స్‌లో భూములపైనే ఫిర్యాదులు...

ప్రజల సమస్యల పరిష్కారం కోసం రాష్ట్ర ప్రభుత్వం ప్రతి సోమవారం కలెక్టర్‌, ఎస్పీ కార్యాలయాల్లో ప్రజా సమస్యల పరిష్కార వేదిక నిర్వహిస్తోంది. ఉన్నతాధికారులందరూ ఉంటారు కనుక వివిధ సమస్యలపై జిల్లా నలుమూలల నుంచి బాధితులు ఇక్కడకు వస్తుంటారు. వందలాది మంది ఫిర్యాదులు చేస్తుంటారు. ఈ ఫిర్యాదుల్లో సింహభాగం భూ వివాదాలు ఉంటున్నాయని అధికారులు చెబుతున్నారు. తమ భూములను కబ్జా చేస్తున్నారని ఫిర్యాదు చేసినా పెద్దగా ప్రయోజనం ఉండడంలేదని బాధితులు వాపోతున్నారు. రాజకీయ నాయకులు, ఎమ్మెల్యేల అండదండలుండడంతో ఎవరూ చర్యలు తీసుకోవడంలేదని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.

కురిచేడులో దాదాపుగా వెయ్యి ఎకరాల ఆక్రమణ ఒంగోలులో 5.6 ఎకరాల భూమి కబ్జాకు యత్నం మరో 2 ఎకరాలు కాజేసే పనిలో టీడీపీ నేతలు కనిగిరిలో 10 ఎకరాల గ్రామకంఠం భూమి స్వాహా కొండపిలో కోర్టుకు వెళ్లి భూములను కాపాడుకున్న వైనం అధికారుల అండదండలతో కబ్జాలపర్వానికి తెరదీసిన తమ్ముళ్లు

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement