
ప్రజల పక్షాన పోరాడతాం
ఒంగోలు సిటీ: జిల్లాలో పార్టీని గ్రామస్థాయి నుంచి బలోపేతం చేసి, ప్రజల పక్షాన పోరాడతామని వైఎస్సార్ సీపీ జిల్లా రీజినల్ కోఆర్డినేటర్ కారుమూరి నాగేశ్వరరావు, ఒంగోలు పార్లమెంట్ ఇన్‌చార్జి చెవిరెడ్డి భాస్కరరెడ్డి, పార్టీ జిల్లా అధ్యక్షుడు, దర్శి ఎమ్మెల్యే బూచేపల్లి శివప్రసాద్‌రెడ్డి తెలిపారు. ఒంగోలులోని పార్టీ కార్యాలయంలో సోమవారం జిల్లాలోని అన్ని నియోజకవర్గాల వైఎస్సార్‌సీపీ ఇన్‌చార్జులతో వారు సమావేశమయ్యారు. అనంతరం విలేకర్లతో మాట్లాడారు. తొలుత ఒంగోలు పార్లమెంట్ ఇన్‌చార్జి చెవిరెడ్డి భాస్కరరెడ్డి మాట్లాడుతూ అందరం ఐక్యంగా ఉండి గ్రామస్థాయి నుంచి పార్టీని బలోపేతం చేస్తామన్నారు. పార్టీ అధినేత వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డి ఆదేశాల మేరకు జిల్లా, మండల స్థాయి కమిటీలను పూర్తి చేసుకున్నామన్నారు. త్వరలో గ్రామస్థాయి, వివిధ అనుబంధ సంఘాల కమిటీలను సైతం ఏర్పాటు చేసుకుంటామని చెప్పారు.
రెడ్‌బుక్ సిద్ధాంతంతో పావులుగా మారొద్దు: కారుమూరి
పార్టీని కింది స్థాయి నుంచి బలోపేతం చేసి, పార్టీ పునర్నిర్మాణం చేసే విషయంలో జిల్లా నాయకులు ముందున్నారని మాజీ మంత్రి, రీజినల్ కోఆర్డినేటర్ కారుమూరి నాగేశ్వరరావు అభినందించారు. ‘కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత రెడ్‌బుక్ సిద్ధాంతం నడుస్తోంది. పోలీసులు అదే దారిలో నడుస్తుండడం సరికాదు. అకారణంగా అరెస్టులు చేయడం, పోలీస్ స్టేషన్లు తిప్పుతూ కొడుతున్నారు. ఇది మంచి పద్ధతి కాదు. ఇది ఇలాగే కొనసాగితే పెద్ద ఎత్తున ఉద్యమం చేస్తాం. ప్రభుత్వాలు మారుతుంటాయి, పోలీసులు మాత్రం ప్రజల పక్షాన నిలిచి అండగా నిలవాలి’ అని ఆయన సూచించారు. 70 శాతం మంది టీడీపీ కార్యకర్తలు కూడా ఆ పార్టీని వ్యతిరేకిస్తున్నారన్నారు. వలంటీరు వ్యవస్థను నిర్వీర్యం చేశారని విమర్శించారు. పింఛన్లలో భారీ కోత పెట్టి నెలనెలా ఆ కార్యక్రమాన్ని ఆయన ఒక ఫార్సులా మార్చేశారన్నారు. ప్రతి నెలా ఒక కులానికి చెందిన దుకాణదారుడికి ఇచ్చి రాష్ట్రమంతా ఆ కులస్తులకు ఇచ్చినట్టు షో చేస్తున్నారని దుయ్యబట్టారు. ఎన్నికలప్పుడు ఇచ్చిన సూపర్ సిక్స్ హామీలు అమలు చేయాల్సిన బాధ్యత రాష్ట్ర ప్రభుత్వంపై ఉందన్నారు. అన్ని రకాల రైతులు మద్దతు ధర లభించక అవస్థలు పడుతున్నారన్నారు. రైతులకు కనీసం గోతాము ఇవ్వలేని దుస్థితిలో మన సివిల్ సప్లయీస్ మంత్రి ఉన్నారని ధ్వజమెత్తారు. వైఎస్సార్ సీపీ ప్రభుత్వ హయాంలో రూ.3 వేల కోట్లతో స్థిరీకరణ నిధి ఏర్పాటు చేసి రైతులను ఆదుకున్నారని చెప్పారు. అమరావతి పేరుతో భారీగా దోపిడీ చేస్తున్నారని విమర్శించారు.
కార్యకర్తల్ని వేధిస్తే ఊరుకోం: బూచేపల్లి..
జిల్లాలో పోలీసులు వైఎస్సార్ సీపీ కార్యకర్తలను వేధిస్తున్నారని పార్టీ జిల్లా అధ్యక్షుడు బూచేపల్లి శివప్రసాద్‌రెడ్డి ఆరోపించారు. పోలీసులు విచక్షణారహితంగా వ్యవహరిస్తున్నారన్నారు. ఇదే విషయాన్ని ఎస్పీ దృష్టికి తీసుకెళ్లామని చెప్పారు. వారికి న్యాయం చేసేందుకు ముందుంటామన్నారు. దర్శిలో వైఎస్సార్ సీపీ కార్యకర్త సురేష్ డీఎస్పీ కార్యాలయం పక్కనే దుకాణాన్ని పెట్టుకుంటే ఓర్వలేక సదరు డీఎస్పీ ఒక సీఐని, నలుగురు ఎస్‌ఐలను, కానిస్టేబుళ్లను పంపి కూల్చివేయించారన్నారు. ‘‘మీరు 60 ఏళ్ల పాటు ఉద్యోగం చేయాలి.. ఐదేళ్ల పాటు ఉండే వారి పక్షాన పనిచేస్తే సరికాదు.. రానున్న రోజుల్లో మా ప్రభుత్వం వస్తుంది..మాకు పదవులూ వస్తాయి.. అది గుర్తుంచుకోవాలి. మీరు ప్రజల పక్షాన నిలిచి వారికి న్యాయం చేయాలి’’ అని బూచేపల్లి అన్నారు. వైఎస్సార్ సీపీ కార్యకర్తలను కొట్టే లా అండ్ ఆర్డర్ కింద పోలీసు వ్యవస్థ నడుస్తోందని విమర్శించారు. కార్యకర్తలను కాపాడుకునేందుకు ఉద్యమం చేస్తామని హెచ్చరించారు. పొగాకు, పత్తి, మిర్చి, వరి తదితర పంటలు సాగుచేసిన వారికి కనీస గిట్టుబాటు ధర లభించక అప్పుల పాలవుతున్నారన్నారు. పొగాకు రైతుకు మద్దతుగా నిలుస్తామన్నారు. అవసరమైతే పార్టీ అధ్యక్షుడు వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డిని తీసుకొచ్చి పెద్ద ఎత్తున ఆందోళన చేస్తామని అన్నారు. సమావేశంలో జెడ్పీ చైర్‌పర్సన్ బూచేపల్లి వెంకాయమ్మ, యర్రగొండపాలెం ఎమ్మెల్యే తాటిపర్తి చంద్రశేఖర్, మాజీ మంత్రి, సంతనూతలపాడు నియోజకవర్గ ఇన్‌చార్జ్ మేరుగు నాగార్జున, మాజీ ఎమ్మెల్యే, మార్కాపురం నియోజకవర్గ ఇన్‌చార్జ్ అన్నా రాంబాబు, ఒంగోలు పార్లమెంట్ నియోజకవర్గ పరిశీలకుడు బత్తుల బ్రహ్మానందరెడ్డి, ఒంగోలు నియోజకవర్గ ఇన్‌చార్జ్ చుండూరు రవిబాబు, కనిగిరి నియోజకవర్గ ఇన్‌చార్జ్ దద్దాల నారాయణ యాదవ్, తదితరులు పాల్గొన్నారు.
ఐక్యంగా పార్టీని గ్రామస్థాయి నుంచి బలోపేతం చేస్తాం
త్వరలో గ్రామ, బూత్ స్థాయి కమిటీలు
రాష్ట్రంలో రెడ్‌బుక్ రాజ్యాంగం నడుస్తోంది
వైఎస్సార్‌సీపీ కార్యకర్తలను వేధిస్తే ఊరుకోం
మద్దతు ధరలు లభించక అల్లాడుతున్న రైతులు
విలేకర్ల సమావేశంలో చెవిరెడ్డి, కారుమూరి, బూచేపల్లి