
పులి..!
బాబోయ్..
అర్థవీడు: అటవీ ప్రాంతానికి సమీపంలో ఉన్న మండలంలోని పలు గ్రామాల్లో తరచూ పెద్దపులి, చిరుత పులులు సంచరిస్తున్నాయి. మండలంలోని లక్ష్మీపురం, మాగుటూరు, కాకర్ల, వెలగలపాయ, మోహిద్దీన్ పురం, అచ్చంపేట, దొనకొండ, తాండ గ్రామాలకు తరుచూ పులులు వచ్చి వెళుతున్నాయి. తాజాగా రెండు రోజుల క్రితం మిట్టమీదపల్లి రహదారి పై రాత్రివేళ ఆర్టీసీ బస్సుకు అడ్డంగా పులిరావడంతో స్థానికులు భయాందోళనకు గురవుతున్నారు.
ప్రజలకు అవగాహన కల్పిస్తున్న అధికారులు:
పులుల సంచారం నేపథ్యంలో అటవీశాఖ అధికారులు అప్రమత్తంగా ఉంటున్నారు. ఎప్పటికప్పుడు అటవీ ప్రాంతంలో పర్యటిస్తూ అవసరమైన చోట ట్రాప్ కెమెరాలను అమర్చి పులుల జాడలను పసిగడుతున్నారు. గ్రామాల్లో ప్రజలకు అవగాహన కల్పిస్తున్నారు. అవి ఎక్కువగా రాత్రి పూట తిరుగుతుంటాయని రైతులెవరూ రాత్రిపూట అటవీ ప్రాంతంలోకి వెళ్లకూడదని, అదే విధంగా పొలాలకు వెళ్లే రైతులు జాగ్రత్తగా ఉండాలని సూచిస్తున్నారు.
ఆహారం కోసం తిరిగే క్రమంలో..
నాగార్జునసాగర్ టైగర్ జోన్ పరిధిలో పులుల సంరక్షణకు చర్యలు తీసుకోవడంతో పెద్దపులల సంతతి పెరిగింది. అవి ఆహారం వేటలో భాగంగా, ఒక చోట నుంచి మరోచోటుకు వెళ్తున్న క్రమంలో ఎద్దులపై, గేదెలపై, ఇతర పశువులపై దాడి చేస్తున్నాయని వాటి వల్ల మనుషులకు ఎటువంటి ఇబ్బంది కలగలేదని అధికారులు చెబుతున్నారు. పులులు ఎక్కువగా రాత్రి పూట, తెల్లవారుజామున మాత్రమే తిరుగుతుంటాయని అటవీశాఖ అధికారులు చెబుతున్నారు. ఇటీవల పులి సంచరించిన ఘటనలివీ..
● వెలగలపాయకొండ పెద్దపులి దాడి చేయడంతో ఓ ఎద్దు మృతి చెందింది.
● వెలగలపాయకొండ సమీపంలో ఎద్దులను మేతకు తీసుకెళ్లగా ఎద్దుపై పెద్దపులి దాడి చేస్తున్న సమయంలో చూసిన రైతు కేకలు వేయడంతో పులి పారిపోయింది.
● లక్ష్మీపురం, మాగుటూరు గ్రామాల సమీపంలో ఉన్న కోమటికుంట వద్దకు పెద్దపులి వచ్చి నీళ్లు తాగి వెళ్తున్నట్లు స్థానికులు గుర్తించి ఫారెస్టు అధికారులకు సమాచారం అందించారు.
● ఐదు నెలల క్రితం మండలంలోని మొహిద్దీన్‌పురం వద్ద రాత్రి పూట కారులో వెళ్తున్న వారికి చిరుతపులి రోడ్డు దాటుతూ కనిపించిందని స్థానికులకు సమాచారం ఇచ్చారు.
● కొన్ని రోజుల తర్వాత అచ్చంపేట గ్రామ సమీపంలోని నల్లమల అటవీ ప్రాంతంలో మేత కోసం వెళ్లిన ఎద్దుపై పెద్దపులి దాడి చేసి చంపేసింది. నాలుగు రోజుల క్రితం మండలంలోని దొనకొండ, తాండ గ్రామాల్లో రెండు గేదెలను పెద్దపులి దాడి చేసి చంపగా ఫారెస్టు అధికారులు రైతులకు నష్టపరిహారం అందించారు.
అర్థవీడు మండలంలో తరచూ సంచారం పశువులపై దాడి చేసి చంపితింటున్న పులులు ఆందోళనలో రైతులు, ప్రజలు భయపడాల్సిన పనిలేదంటున్న ఫారెస్టు అధికారులు అటవీ ప్రాంతంలో ట్రాప్‌కెమెరాలు అమర్చుతున్న అధికారులు

పులి..!