
ప్రాణ నష్టాన్ని నివారించాలి
ప్రకృతి విపత్తుల్లో
● కలెక్టర్ తమీమ్ అన్సారియా
ఒంగోలు సబర్బన్: ప్రకృతి విపత్తుల సమయంలో ప్రాణ నష్టాన్ని నివారించేందుకు ప్రజలకు అవగాహన కల్పించాలని కలెక్టర్ ఎ.తమీమ్ అన్సారియా పేర్కొన్నారు. జిల్లాలో ఉరుములు మెరుపులతో కూడిన వర్షం, గాలి, దుమారం ఉంటుందని వాతావరణ శాఖ హెచ్చరించిన నేపథ్యంలో జాయింట్ కలెక్టర్ ఆర్.గోపాలకృష్ణతో కలిసి మండల స్థాయి అధికారులతో కలెక్టర్ సోమవారం అత్యవసర వీడియో కాన్ఫరెన్స్ నిర్వహించారు. విపత్తుల సమయంలో గ్రామస్థాయి సిబ్బంది క్షేత్రస్థాయిలో అందుబాటులో ఉండాలని స్పష్టం చేశారు. పిడుగుపాటుకు దారితీసే పరిస్థితులు, ఆయా సమయాల్లో తీసుకోవాల్సిన జాగ్రత్తలపై ప్రజలకు అవగాహన కల్పించాలని చెప్పారు.
డప్పు, చాటింపుతోపాటు ప్రసార మధ్యమాల ద్వారా ప్రజలను అప్రమత్తం చేయాలని అధికారులకు సూచించారు. వాతావరణ మార్పులపై వస్తున్న హెచ్చరికలను ప్రజలకు చేరవేయాలని చెప్పారు. సమావేశంలో డీఆర్‌ఓ ఓబులేసు, అన్ని శాఖల ఉన్నతాధికారులు పాల్గొన్నారు.