
నిలిచిన నీరు!
ఆధిపత్య పోరు..
గ్రామంలో ట్యాంకర్ ద్వారా నీరు సరఫరా చేస్తున్న మాజీ వలంటీర్
సీపీడబ్ల్యూఎస్ స్కీం నుంచి నీటి సరఫరా నిలిచిపోవడంతో కొత్తపాలెంలో అలంకారప్రాయంగా మారిన ఓవర్‌హెడ్ ట్యాంక్
పొన్నలూరు: రాష్ట్రంలో కూటమి ప్రభుత్వం ఏర్పడిన తర్వాత తెలుగు తమ్ముళ్ల పిచ్చి చేష్టలతో గ్రామాల్లోని సామాన్య ప్రజలు అనేక రకాలుగా అవస్థలకు గురవుతున్నారు. అధికార పార్టీ కావడంతో తాము ఏం చేసినా చెల్లుబాటవుతుందనే అహంకారంతో ఇష్టారాజ్యంగా వ్యవహరిస్తూ ప్రజలను ఇబ్బందిపెడుతున్నారు. ఆఖరికి గ్రామాల్లోని స్కీం బావుల నుంచి ప్రజలకు అందించే నీటి విషయంలో కూడా పచ్చనేతలు పెత్తనం చలాయించాలని చూస్తున్నారు. వారి మధ్య ఆధిపత్య పోరుతో ప్రజలకు తాగునీరు, వాడుకనీరు లేకుండా పోయింది. పొన్నలూరు మండలంలోని రాజోలుపాడు పంచాయతీ కొత్తపాలెం గ్రామంలో జరిగిన ఈ సంఘటన వివరాల్లోకెళ్తే..
1995–2000 మధ్య కాలంలో కొత్తపాలెం గ్రామంతో పాటు పొన్నలూరు మండలంలోని మరో ఎనిమిది గ్రామాలకు తాగునీరు, వాడుకనీటి కోసం రూ.1.60 కోట్లతో సీపీడబ్ల్యూఎస్ స్కీం ఏర్పాటు చేశారు. పంచాయతీలతో సంబంధం లేకుండా ఈ స్కీమ్ పనిచేసేందుకు ప్రత్యేకంగా టెండర్ ఏర్పాటు చేసి పర్యవేక్షిస్తున్నారు. పార్టీలకు అతీతంగా నిర్వహించే టెండర్‌లో స్కీంను దక్కించుకున్న వారు కొన్నేళ్లపాటు సీపీడబ్ల్యూఎస్ స్కీం ద్వారా తాగునీరు, వాడుకనీటిని తొమ్మిది గ్రామాల ప్రజలకు అందిస్తున్నారు. ఇటీవల ఈ స్కీమ్‌ను కొనసాగించేందుకు టెండర్ ఏర్పాటు చేయకుండా నిలిపివేశారు. ఆయా పంచాయతీలకు అప్పజెప్పి వదిలేశారు. దీంతో కొత్తపాలెం కాకుండా మిగిలిన ఎనిమిది గ్రామాల ప్రజలకు ఆయా పంచాయతీల్లో ఏర్పాటు చేసిన స్కీం బావుల నుంచి నీరు సరఫరా చేస్తున్నారు.
తెలుగు తమ్ముళ్ల మధ్య ఆధిపత్య పోరుతో అవస్థలు...
ఇదిలా ఉండగా, రాష్ట్రంలో కూటమి ప్రభుత్వం ఏర్పడిన తర్వాత కొత్తపాలెం గ్రామంలో సీపీడబ్ల్యూఎస్ స్కీం ద్వారా నీళ్లు వదిలే పనిని స్థానిక తెలుగు తమ్ముళ్లు తీసుకున్నారు. గత మార్చి వరకు సక్రమంగానే పనిచేసి గ్రామస్తులకు నీళ్లు సరఫరా చేశారు. అయితే, రెండు నెలలుగా సీపీడబ్ల్యూఎస్ స్కీం ద్వారా నీళ్లు వదిలే విషయంలో స్థానిక తెలుగు తమ్ముళ్ల మధ్య ఆధిపత్య పోరు మొదలైంది. నీళ్లు వదిలే దగ్గర మేమంటే మేము పనిచేస్తామంటూ ఆధిపత్య పోరుతో రెండు నెలలుగా గ్రామస్తులకు తాగునీరు, వాడుకనీటిని సక్రమంగా అందించడం లేదు. ప్రతిరోజూ నీరివ్వాల్సి ఉండగా, అరకొరగా రోజు మార్చి రోజు నీళ్లు సరఫరా చేస్తుండటంతో గ్రామస్తులు చేసేదేమీ లేక సర్దుకునిపోతున్నారు. అయితే, నీళ్లు వదిలే దగ్గర తెలుగు తమ్ముళ్ల మధ్య ఆధిపత్య పోరు ముదరడంతో గత నాలుగు రోజుల నుంచి సీపీడబ్ల్యూఎస్ స్కీం ద్వారా గ్రామస్తులకు నీటి సరఫరా నిలిచిపోయింది. దీంతో గ్రామస్తులు నీటి కోసం తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు.
ట్యాంకర్‌తో నీరందించిన మాజీ వలంటీర్...
కొత్తపాలెం గ్రామంలో తెలుగు తమ్ముళ్ల మధ్య ఆధిపత్యపోరుతో సీపీడబ్ల్యూఎస్ స్కీం నుంచి గత నాలుగు రోజులుగా నీటి సరఫరా నిలిచిపోయి గ్రామస్తులు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్న నేపథ్యంలో.. స్థానిక మాజీ వలంటీర్ చావకూరి రాజా స్థానిక సర్పంచ్ మార్తాల వెంకటేశ్వరరెడ్డి సహకారంతో గ్రామంలో సొంతంగా వాటర్ ట్యాంకర్ ఏర్పాటు చేశారు. దాని ద్వారా గ్రామస్తులకు ఇంటింటికి తిరిగి నీరు సరఫరా చేస్తున్నారు. కాగా, తెలుగు తమ్ముళ్ల నిర్వాకంతో నాలుగు రోజులుగా గ్రామంలో నీటి కోసం ప్రజలు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నప్పటికీ ఆధికారులు పట్టించుకోకపోవడం గమనార్హం.
కొత్తపాలెంలో సీపీడబ్ల్యూఎస్ స్కీంపై పెత్తనం కోసం తెలుగు తమ్ముళ్ల మధ్య పోటీ టీడీపీ నేతల తీరుతో మూడు రోజులుగా నిలిచిన నీటి సరఫరా వేసవి కావడంతో నీటి కోసం గ్రామస్తులకు ఇబ్బందులు
నీళ్లు వదిలే వ్యక్తి రావడం లేదు
కొత్తపాలెం గ్రామంలో సీపీడబ్ల్యూఎస్ స్కీం నుంచి నీళ్లు వదిలే వ్యక్తి రాకపోవడంతో నీటి సరఫరా నిలిచిపోయింది. గతంలో సీపీడబ్ల్యూఎస్ స్కీం పర్యవేక్షణకు టెండర్ ద్వారా నిధులు కేటాయించేవారు. కొన్నేళ్లుగా టెండర్ ప్రక్రియ నిలిపివేశారు. దీంతో స్కీం పర్యవేక్షణకు డబ్బుల్లేవు. సీపీడబ్ల్యూఎస్ స్కీంను స్థానికంగా పంచాయతీలో కలిపి దాని ద్వారా గ్రామస్తులకు నీరు సరఫరా చేస్తాం. గ్రామస్తులు నీటి కోసం ఇబ్బందులు పడకుండా తాత్కాలికంగా వ్యక్తిని ఏర్పాటు చేసి నీటి సమస్యను పరిష్కరిస్తాం.
– మహీంద్రరెడ్డి, ఆర్‌డబ్ల్యూఎస్ ఏఈ

నిలిచిన నీరు!