నేతలకు కిక్కిస్తూ!
ఊళ్లు ఊగిపోతూ..
ఒంగోలు టౌన్: జిల్లాలో 188 మద్యం దుకాణాలు ఏర్పాటు చేయాలని అధికారులు ప్రతిపాదనలు సిద్ధం చేశారు. అందులో భాగంగా తొలి విడతగా 171, ఆ తరువాత గీత కార్మికులకు మరో 10 శాతం అంటే 17 దుకాణాలను కేటాయించింది. వీటన్నింటినీ అధికార పార్టీ నేతలు సిండికేట్‌గా ఏర్పాటై వీటిని దక్కించుకున్నారు. అధికారాన్ని అడ్డంపెట్టుకుని మద్యం వ్యాపారులు రెచ్చిపోతున్నారు. అధికారులు చూసీచూడనట్టు వ్యవహరిస్తుడడంతో వీటికి అనుబంధంగా 2 వేలకుపైగా బెల్టు షాపులు వెలిశాయి. ఊరూరుకి మద్యం సరఫరా చేస్తూ ఇంటింటికీ మద్యం డెలివరీ చేస్తున్నారు. ఇప్పుడు జిల్లాలో మంచినీరు దొరకని గ్రామాలు అనేకం ఉన్నాయి. కానీ మద్యం లభించని గ్రామం ఒక్కటంటే ఒక్కటి కూడా ఉండదంటే అతిశయోక్తి కాదు. ఒక్క ఫోన్ కొడితే చాలు క్షణాల్లో మద్యం ఇంటి ముందు ప్రత్యక్షమవుతోంది.
ఐదున్నర నెలల్లోనే రూ.1100 కోట్ల అమ్మకాలు
గత ఏడాది అక్టోబర్ 16వ తేది నుంచి ప్రైవేటు దుకాణాలను తెరచి మద్యం విక్రయాలను ప్రారంభించారు. అంతకుముందు ప్రభుత్వ మద్యం దుకాణాలు ఉన్నప్పుడు జరిగిన వ్యాపారం కంటే ఇప్పుడు 20 నుంచి 30 శాతానికి పైగా మద్యం విక్రయాలు పెరిగాయి. జిల్లాలో ఒంగోలు, మార్కాపురంలలో లిక్కర్ డిపో ఉన్నాయి. ఒంగోలు డిపో పరిధిలో ఒంగోలు, సింగరాయకొండ, చీరాల, పర్చూరు, అద్దంకి, కందుకూరు సర్కిళ్లు ఉన్నాయి. మార్కాపురం డిపో పరిధిలో మార్కాపురం, యర్రగొండపాలెం, పొదిలి, దర్శి, గిద్దలూరు సర్కిళ్లు ఉన్నాయి. ఒంగోలు డిపో పరిధిలో గత ఏడాది అక్టోబర్ 16వ తేదీ నుంచి మార్చి నెలాఖరు వరకూ మద్యం దుకాణాలు, బార్ అండ్ రెస్టారెంట్ల ద్వారా లిక్కర్, బీర్ల అమ్మకాలు దాదాపు రూ.550 కోట్లు జరిగాయి. మార్కాపురం డిపో పరిధిలో సైతం రూ.550 కోట్ల అమ్మకాలు జరిగాయని అధికారులు చెబుతున్నారు. మొత్తం మీద ఐదున్నర నెలల్లో సుమారు రూ.1100 కోట్ల విక్రయాలు జరిగాయి.
2 వేలకు పైగా బెల్టు షాపులు:
జిల్లాలో 188 మద్యం దుకాణాలు ఉండగా 2 వేలకు పైగా బెల్టుషాపులు ఉన్నాయి. జిల్లాలోని ప్రతి పల్లెల్లోనూ మద్యం ఏరులై పారుతోంది. ఒంగోలు నగరంలోని అన్నీ శివారు ప్రాంతాల్లో బెల్టుషాపులు నిర్వహిస్తున్నారు. నగరంలోని ఎఫ్‌సీఐ గోడౌన్ ఎదురుగా, కొప్పోలు, దశరాజుపల్లి, కరవది, పేర్నమిట్ట, ఉలిచి, వెంగముక్కలపాలెం తదితర గ్రామాల్లో బెల్టుషాపులు నిర్వహిస్తున్నారు. ఒక్కో గ్రామంలో రెండు మూడు బెల్టు షాపులు నిర్వహిస్తున్నట్లు సమాచారం. ఒంగోలు, ఎస్‌ఎన్‌పాడు, మార్కాపురం, యర్రగొండపాలెం, గిద్దలూరు, కనిగిరి, దర్శి, కొండపి నియోజకవర్గాల పరిధిలోని అన్నీ గ్రామాల్లో బెల్టుషాపులు నడుస్తున్నాయి. జిల్లాలో మద్యం విక్రయాలు అధికార తెలుగుదేశం పార్టీ ప్రజాప్రతినిధులు, వారి బినామీల పేర్లతో నిర్వహిస్తున్నట్లు జోరుగా ప్రచారం జరుగుతోంది. ఈ నేపథ్యంలో ఎకై ్సజ్ అధికారులు బెల్టు షాపుల వైపు కన్నెత్తి చూడడం లేదు. పక్కా సమాచారం ఉన్నా పట్టించుకోవడం లేదు. జిల్లాలో బెల్టు షాపులు నిర్వహిస్తున్న తెలుగుదేశం నేతలు సైతం అధికారులను లెక్క చేయడం లేదు. ఎవరైనా ప్రశ్నిస్తే మా ప్రభుత్వం అధికారంలో ఉంది. మమ్మల్నెవరు ఆపేదంటూ ఎదురు తిరుగుతున్నారు.
మొబైల్ ఫోన్ల ద్వారా అమ్మకాలు...
మొబైల్ ఫోన్లో బుక్ చేస్తే చాలు ఇంటికే మద్యం డెలివరీ చేస్తున్నట్లు సమాచారం. జిల్లాలోని పశ్చిమ ప్రకాశంలో ఒక పట్టణంలో ఆటో ద్వారా ఇంటింటికీ మద్యం సరఫరా చేస్తున్నట్లు సమాచారం. జిల్లాలో పట్టణ ప్రాంతాల్లో మాత్రమే మద్యం దుకాణలు ఉండగా పల్లెల్లో బెల్టు షాపులు ఉన్నాయి. మద్యం దుకాణాల కంటే బెల్టు షాపులే ఎక్కువగా ఉండడంతో పచ్చని పల్లెలు నిషాతో తూగుతున్నాయి. పల్లెలు, పట్టణాల తేడా లేకుండా యువకులు, రైతు కూలీలు, రోజువారి కూలీలు నిత్యం మందు తాగి పనులకు వెళ్లకుండా తిరుగుతున్నారని, దాంతో సామాన్య ప్రజల కుటుంబాలు ఆకలితో అల్లాడుతున్నాయని మహిళలు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. నిన్న మొన్నటి వరకు కుటుంబాన్ని పోషించిన వ్యక్తి నేడు మందుకు అలవాటు పడిపోయి తిరుగుతుంటే పిల్లాపాపలు చదువు మానుకొని పనులకు వెళుతున్నారని వాపోతున్నారు. కూటమి ప్రభుత్వం మీద మహిళలు మండిపడుతున్నారు.
ఊరూరా బెల్టు దుకాణాలు.. మోటారు సైకిళ్లు, ఆటోల్లో ఇంటింటికీ మద్యం మంచినీరు దొరకని గ్రామాల్లో సైతం కావాల్సినంత మందు ప్రభుత్వ పాలసీతో భారీగా పెరిగిన మందుబాబులు ఒంగోలు, మార్కాపురం డిపోల పరిధిలో రూ.1100 కోట్ల అమ్మకాలు అధికారులకు నెలనెలా మామూళ్లు ఇవ్వాల్సిందే..
మద్యాన్ని ఆదాయ వనరుగా చూడటం సిగ్గుచేటు
మద్యాన్ని రాష్ట్ర ప్రభుత్వం ఆదాయ వనరుగా భావించడం సిగ్గుచేటు. 2024–25 ఆర్థిక సంవత్సరంలో రూ.30 వేల కోట్ల అమ్మకాలు జరగడం పరిస్థితిని తెలుపుతోంది. మద్యాన్ని నియంత్రించి నిరుపేద సామాన్యుల కుటుంబాలకు అండగా నిలబడాల్సిన ప్రభుత్వమే మద్యం వ్యాపారాన్ని ప్రోత్సహించడం బాధాకరం. మహిళలపై దాడులకు, అత్యాచారాలకు కారణమవుతున్న మద్యాన్ని నిషేధించాలి.
– కంకణాల రమాదేవి, ఐద్వా జిల్లా కార్యదర్శి.
విచ్చలవిడి బెల్ట్‌షాపులపై చర్యలేవీ..
మద్యం షాపుల్లో వసూలు చేస్తున్న అధిక ధరలను, గ్రామాల్లో బెల్టు షాపులను పూర్తిగా అరికడతామని సీఎం చంద్రబాబు తెలిపారు. బెల్టుషాపు నిర్వహిస్తూ పట్టుబడితే రూ.5 లక్షల వరకు జరిమానా విధిస్తామని ప్రగల్భాలు పలికినా క్షేత్ర స్థాయిలో అవేవీ అమలు కావడం లేదు. ప్రతి లైసెన్సు షాపు నుంచి నెలనెలా వచ్చే మామూళ్లను నొక్కేస్తూ ఎకై ్సజ్ అధికారులు పట్టీ పట్లనట్లు ఉండటంతో గ్రామాల్లో విచ్చలవిడిగా బెల్టు షాపులు వెలుస్తున్నాయి. గత ప్రభుత్వంలో మద్యం షాపులు ఊరికి చివరిలో మాత్రమే ఉండేవి. నేడు ఆ పరిస్థితి లేదు.
– పల్లపోలు బాలకోటిరెడ్డి, మాజీ సర్పంచ్, శింగరబొట్లపాలెం
ఎకై ్సజ్ అధికారులు కన్నెత్తి చూడటం లేదు
మా పంచాయతీలోని బసిరెడ్డిపల్లె గ్రామంలో చీప్‌లిక్కర్ అధిక ధరలకు అమ్ముతున్నారు. మందుబాబులు విచ్చలవిడిగా తాగి రాత్రి, పగలు తేడా లేకుండా బజారుల్లో తిరుగుతున్నారు. ఎకై ్సజ్ అధికారులు మాత్రం ఇటువైపు కన్నెత్తి కూడా చూడటం లేదు.
– చీరాల ఇజ్రాయేలు, కొచ్చర్లకోట, దొనకొండ మండలం
నేతలకు కిక్కిస్తూ!
నేతలకు కిక్కిస్తూ!


