బాలికలకు కేజీబీవీల పిలుపు
మార్కాపురం/పామూరు: గ్రామీణ ప్రాంతాలకు చెంది బడిఈడు పిల్లలు, బడి మానేసిన బాలికలకు విద్యనందించాలనే లక్ష్యంతో కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు కస్తూర్బా గాంధీ గురుకుల విద్యాలయాలను ఏర్పాటు చేశాయి. జిల్లాలో బాలికల అక్షరాస్యతా శాతం తక్కువగా ఉన్న మండలాలను గుర్తించిన ప్రభుత్వం 28 కస్తూర్బా పాఠశాలలు ఏర్పాటు చేసింది. వాటిలో 6వ తరగతి ప్రవేశానికి, ఇంటర్ మొదటి సంవత్సరంతో పాటు 7, 8, 9 తరగతుల్లో ఖాళీగా ఉన్న సీట్లు భర్తీ చేసేందుకు మార్చి 22వ తేదీ నుంచి ఏప్రిల్ 11 వరకూ దరఖాస్తులు స్వీకరిస్తున్నారు. ఒక్కొక్క పాఠశాలలో 40 సీట్లు ఉన్నాయి. 2025–26 విద్యాసంవత్సరానికి 6వ తరగతిలో 1120 మంది బాలికల ప్రవేశానికి నోటిఫికేషన్ జారీచేసింది. బడి మానేసిన, బడి ఈడు పిల్లలను ఉపాధ్యాయులు సర్వే నిర్వహించి గుర్తిస్తుంటారు. వారిలో బాలికలను సమీప గురుకుల విద్యాలయాల్లో చేర్పించాలని ప్రత్యేక అధికారులకు సర్వే నివేదికలు అందాయి.
పాఠశాల ప్రత్యేకతలు..
కస్తూరిబాగాంధీ గురుకుల విద్యాలయాల్లో బాలికలకు ఉచిత విద్యతో పాటు, ఉచిత వసతి అందిస్తారు. పాఠ్య పుస్తకాలు, నోట్ పుస్తకాలు, దుస్తులు, ట్రంకు పెట్టెలు ఉచితంగా అందజేస్తారు. అలాగే కాస్మోటిక్ కిట్లను అందజేస్తారు. రోజూ ఉదయం పాలతో పాటు టిఫిన్, సాయంత్రం చిరుతిళ్లు, గురు, శనివారాల్లో స్వీట్స్, శని, ఆదివారాలు మినహా మిగతా రోజుల్లో కోడిగుడ్డుతో తయారు చేసిన కర్రీ ఇస్తారు. వారంలో 7 రోజులు 7 రకాల మెనూలను విద్యార్థులకు అందిస్తున్నారు. ప్రత్యేక అధికారి నుంచి టీచర్లు, వాచ్‌మెన్, స్వీపర్ వరకు అందరూ మహిళలే ఉంటారు. కార్పొరేట్ పాఠశాలలకు దీటుగా బోధన సాగుతుంది.
జిల్లాలో ఉన్న ఇంటర్మీడియెట్‌కు సంబంధించి కేజీబీవీల్లో ఎంపీసీ, బైపీసీ, హెచ్‌ఈసీ గ్రూపులు ఉన్నాయి. మూడు కళాశాలల్లో ఒకేషనల్ కోర్సులు ఉన్నాయి. విద్యార్థులకు నైట్ స్టడీ అవర్స్‌తోపాటు కెరీర్ గైడెన్స్‌పై కూడా ప్రత్యేక శిక్షణ ఇస్తున్నారు. ప్రస్తుతం 6వ తరగతిలో ప్రవేశం పొందితే పదో తరగతితో పాటు ఇంటర్మీడియెట్ వరకు చదువుకోవచ్చు. ఒకవేళ ఇంటర్‌లో చేరితే రెండేళ్ల పాటు చదువుకోవచ్చు.
ప్రాధాన్యత ప్రకారం ఎంపిక..
కస్తూరిబాగాంధీ గురుకుల విద్యాలయాల్లో ప్రవేశాలకు మొదట బడిమానేసిన పిల్లలు, తల్లిదండ్రులు లేని చిన్నారులు, ఎస్సీ, ఎస్టీ వారికి ప్రాధాన్యత ఇస్తారు. పాఠశాలలో చేరేందుకు ఆన్‌లైన్ ద్వారా దరఖాస్తు చేసుకుంటారు.
అర్హతలు ఇలా....
కేజీబీవీల్లో ప్రవేశాల్లో అనాథలు, బడిబయట పిల్లలు, డ్రాపౌట్స్ (బడిమానేసినవారు) పేద, ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనారిటీ, బీపీఎల్ బాలికలు మాత్రమే తొలి ప్రాధాన్యతగా సీట్లు కేటాయిస్తారు. ఆన్‌లైన్ ద్వారా వచ్చిన దరఖాస్తులను మాత్రమే అడ్మిషన్ కోసం పరిగణిస్తారు. విద్యార్థినులు తమ దరఖాస్తును వెబ్‌సైట్ ‘ఏపీకేజీబీవీ.ఏపీసీఎఫ్‌ఎస్‌ఎస్.ఐఎన్’ లో పొంది దరఖాస్తు చేసుకోవాలి. ఎంపికై న బాలికలకు ఫోన్ మెసేజ్ ద్వారా సమాచారం అందుతుంది.
ప్రారంభమైన దరఖాస్తుల ప్రక్రియ జిల్లాలో 28 కస్తూర్బా పాఠశాలలు 6వ తరగతిలో 1120 సీట్లకు, 11వ తరగతిలో 1120 సీట్లకు దరఖాస్తుల ఆహ్వానం 7, 8, 9, 10, 12 తరగతుల్లో మిగులు సీట్ల భర్తీ ఏప్రిల్ 11వ తేదీ వరకు ఆన్‌లైన్‌లో దరఖాస్తులకు అవకాశం
గ్రూపుల వారీగా ఇంటర్మీడియెట్ కోర్సులు నిర్వహిస్తున్న కేజీబీవీలు
ఎంపీసీ : అర్థవీడు, బీ.వీ.పేట, దర్శి, దొనకొండ, కనిగిరి (ఎంఐఎన్), కొనకనమిట్ల, కొమరోలు, ముండ్లమూరు, పెద్దారవీడు, పెద్దదోర్నాల, పామూరు, పొన్నలూరు, రాచర్ల, త్రిపురాంతకం, వెలిగండ్ల, జరుగుమల్లి.
బైపీసీ: సీఎస్‌పురం, కొత్తపట్నం, మర్రిపూడి, పీ.సీ.పల్లి, పుల్లలచెరువు, తాళ్లూరు, తర్లుపాడు, వై.పాలెం
ఎంఈసీ : పొదిలి (ఎంఐఎన్)
సీఎస్‌ఈ : హెచ్‌ఎంపాడు
ఏఅండ్‌టీ : మార్కాపురం
ఎంఎల్‌టీ : కురిచేడు


