
మహిళకు సంక్షేమ పథకాల బుక్‌లెట్‌ను అందజేస్తున్న మంత్రి ఆదిమూలపు సురేష్
యర్రగొండపాలెం: ముఖ్యమంత్రి వై.ఎస్.జగన్‌మోహన్‌రెడ్డి పేదల గుండెతడి తెలిసిన వ్యక్తి కావడంతో వారి ఆరోగ్యంపట్ల ఎనలేని శ్రద్ధ చూపుతున్నారని, దేశంలో ఎక్కడా లేని విధంగా ఇంటింటికీ మంచి వైద్యం అందే కార్యక్రమాన్ని చేపడుతున్నారని రాష్ట్ర పురపాలక, పట్టణాభివృద్ధి శాఖ మంత్రి డాక్టర్ ఆదిమూలపు సురేష్ అన్నారు. మండలంలోని నరసాయపాలెం గ్రామంలో శుక్రవారం నిర్వహించిన గడప గడపకు మన ప్రభుత్వం కార్యక్రమంలో ఆయన మాట్లాడారు. చికిత్స కంటే నివారణ చాలాగొప్పదన్న ఉద్దేశంతో రాష్ట్రంలోని ప్రజలందరికీ ఉచితంగా మెరుగైన వైద్యం అందించాలని దేశంలో ఎక్కడా లేని విధంగా ఫ్యామిలీ డాక్టర్ కార్యక్రమాన్ని ప్రారంభించారని, మరింత మెరుగైన వైద్యం అందించేందుకు జగనన్న సురక్ష పథకాన్ని ప్రారంభించారన్నారు. గత చంద్రబాబు ప్రభుత్వ కాలంలో ప్రభుత్వ వైద్యశాలల పట్ల నిర్లక్ష్యం చేశారని విమర్శించారు.
సంక్షేమ పథకాలకు అర్హతే ప్రామాణికం:
ముఖ్యమంత్రి వై.ఎస్.జగన్‌మోహన్‌రెడ్డి పేదల కోసం అమలు చేస్తున్న సంక్షేమ పథకాలు పొందేందుకు తగిన అర్హతలు ఉంటే చాలని, కుల, మత, వర్గాలు, రాజకీయ పార్టీలతో ఎటువంటి సంబంధం ఉండదని అన్నారు. పింఛన్లతోపాటు సంక్షేమ పథకాలు అర్హులైనవారందరికీ ప్రభుత్వం అందజేస్తోందన్నారు.
జగనన్నను మరోసారి సీఎంగా చేసుకోవటానికి రాష్ట్ర ప్రజలు ఎదురు చూస్తున్నారని, ఎప్పుడు ఎన్నికలు వచ్చినా రాష్ట్రంలో ఉన్న 175 అసెంబ్లీ స్థానాలు ఆయనకు బహుమతిగా ఇచ్చేందుకు వారు సిద్ధంగా ఉన్నారని చెప్పారు. ముందుగా రూ.40 లక్షల ఖర్చుతో నిర్మించిన గ్రామ సచివాలయ భవనం, రూ.21.80 లక్షలతో నిర్మించిన రైతు భరోసా కేంద్రాలను మంత్రి ప్రారంభించారు. కార్యక్రమంలో వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ జిల్లా ఉపాధ్యక్షుడు ఒంగోలు మూర్తిరెడ్డి, జెడ్పీటీసీ చేదూరి విజయభాస్కర్, పార్టీ మండల అధ్యక్షుడు కొప్పర్తి ఓబులరెడ్డి, సచివాలయాల మండల కన్వీనర్ సయ్యద్ జబీవుల్లా, ఏఎంసీ డైరెక్టర్ కందుల సత్యనారాయణ, షేక్ కాశింబాష, డీఎల్‌డీవో బి.వి.ఎన్.సాయికుమార్, తహసీల్దార్ కె.రవీంద్రరెడ్డి, డీఆర్‌డీఏ ఏరియా కో ఆర్డినేటర్ కె.లక్ష్మిరెడ్డి, పీఆర్ డీఈ ఎం.సుబ్బారెడ్డి, ఈవోపీఆర్డీ ఈదుల రాజశేఖరరెడ్డి, ఎంఈవో పి.ఆంజనేయులు, ఏడీఏ కె.నీరజ, ఏవో జవహర్‌లాల్ నాయక్, ఏఈలు శ్రీకాంత్, అల్లూరయ్య పాల్గొన్నారు.
విద్య, వైద్యానికి అత్యధిక ప్రాధాన్యత ఇస్తున్న ప్రభుత్వం మెరుగైన వైద్యం అందించేందుకే జగనన్న సురక్ష పథకం రాష్ట్ర పురపాలక శాఖ మంత్రి ఆదిమూలపు సురేష్