
వైపాలెంలో నిర్మాణంలో ఉన్న టీటీడీ కల్యాణ మండపం
యర్రగొండపాలెం: రాష్ట్ర పురపాలక, పట్టణాభివృద్ధి శాఖ మంత్రి డాక్టర్ ఆదిమూలపు సురేష్ వైపాలెం నియోజకవర్గంలో తిరుమల తిరుపతి దేవస్థానం కల్యాణ మండపాల నిర్మాణాలపై ప్రత్యేక చొరవ చూపడంతో రూ 2.60 కోట్ల నిధులు మంజూరు చేస్తూ ఆ దేవస్థానం సీఈ పరిపాలన అనుమతులను జారీ చేసింది. నియోజకవర్గంలో ఆధ్యాత్మిక కేంద్రమైన త్రిపురాంతకంలో నూతనంగా టీటీడీ కల్యాణ మండపాన్ని నిర్మించాల్సిన అవశ్యకత ఉందని మంత్రి కోరడంతో అక్కడ కల్యాణ మండపం నిర్మాణానికి రూ.2 కోట్లు టీటీడీ ఇంజినీరింగ్ శాఖ మంజూరు చేసింది. త్రిపురాంతకంలో ప్రజలకు అందుబాటులో ఉండేలా ఎకరా భూమిని తిరుమల తిరుపతి దేవస్థానానికి అందచేయాల్సి ఉంది. ప్రజల తమ వాటా కింద రూ.40 లక్షలు దేవస్థానానికి జమ చేయాలి. ఈ ప్రక్రియ పూర్తయిన వెంటనే టీటీడీ దేవస్థానం రూ.2 కోట్లతో కల్యాణ మండప నిర్మాణాలను చేపడుతుంది. యర్రగొండపాలెంలో రూ.1 కోటి 74 లక్షలతో నిర్మిస్తున్న టీటీడీ కల్యాణ మండపం దాదాపు పూర్తి కావస్తోంది. అయితే ఈ ప్రాంత ప్రజల కోరిక మేరకు భోజనశాల డిజైన్‌ను పూర్తిగా మార్పుచేయటానికి అదనంగా రూ.60 లక్షలు టీటీడీ మంజూరు చేసింది. గతంలో భోజనశాల కోసం ఫస్ట్ ఫ్లోర్‌లో రేకుల షెడ్డు నిర్మించాల్సిఉంది. అయితే మంజూరైన నిధులతో భోజన శాల స్థానంలో కల్యాణ మండపం పక్కా స్లాబ్‌తో నిర్మాణం చేపడతారు. ఇప్పటికే పూర్తయిన కింది భాగంలో భోజనశాలగా ఏర్పాటు చేయటానికి డిజైన్‌ను మార్పు చేశారు. త్రిపురాంతకంలో టీటీడీ కల్యాణ మండపం నిర్మాణానికి, యర్రగొండపాలెంలో ప్రజల సౌకర్యార్థం టీటీడీ కల్యాణమండపం డిజైన్‌ను మార్చి నిధులు మంజూరు చేయించిన మంత్రి ఆదిమూలపు సురేష్‌కు ఆయా ప్రాంతాల ప్రజలు కృతజ్ఞతలు తెలుపుతున్నారు. యర్రగొండపాలెంలో కల్యాణ మండపం నిర్మాణ పనులు దాదాపు పూర్తయ్యాయని, ప్రస్తుతం చేసిన డిజైన్ మార్పుతో ఫస్ట్ ఫ్లోర్ స్లాబ్ త్వరితగతిన పూర్తిచేసేందుకు చర్యలు తీసుకుంటున్నామని కాంట్రాక్టర్ ఉడుముల కోటిరెడ్డి తెలిపారు.
త్రిపురాంతకంలో నూతన నిర్మాణానికి రూ.2 కోట్లు యర్రగొండపాలెంలో అదనపు నిర్మాణాలకు రూ.60 లక్షలు మంత్రి ఆదిమూలపు సురేష్ చొరవతో లభించిన పరిపాలన అనుమతులు