
● రాష్ట్ర పురపాలక, పట్టణాభివృద్ధి శాఖా మంత్రి ఆదిమూలపు సురేష్
ఒంగోలు టౌన్: తెలుగు భాషను, సంస్కృతిని కాపాడుకోవాల్సిన బాధ్యత ప్రతి ఒక్కరి మీద ఉందని రాష్ట్ర పురపాలక, పట్టణాభివృద్ధి శాఖా మంత్రి ఆదిమూలపు సురేష్ అన్నారు. ఒంగోలులోని పోలీస్ కళ్యాణ మండపంలో బుధవారం నిర్వహించిన శోభకృత్ నామ ఉగాది వేడుకల్లో ఆయన ముఖ్య అతిథిగా హాజరయ్యారు. పంచాంగంలో చెప్పినట్లు నూతన సంవత్సరంలో జిల్లా ప్రజలంతా పాడిపంటలతో, సిరిసంపదలతో, సుఖశాంతులతో గడపాలని ఆకాంక్షించారు. వర్షాలు సమృద్ధిగా కురుస్తాయని పండితులు చెబుతున్న నేపథ్యంలో ఈ ఏడాదే వెలిగొండ ప్రాజెక్టు ద్వారా నీళ్లు అందుతాయని భావిస్తున్నానని చెప్పారు. తెలుగు ప్రజలు ప్రపంచంలో ఎక్కడున్నా భాష, సంస్కృతిని చాటి చెబుతూ జరుపుకునే ఏకై క పండుగ ఉగాది పర్వదినమని రాష్ట్ర ప్రభుత్వ సామాజిక న్యాయ సలహాదారు జూపూడి ప్రభాకర్ రావు అన్నారు. ఈ ఏడాది ప్రజలకు అంతా మంచే జరుగుతుందని జిల్లా పరిషత్ చైర్‌పర్సన్ బూచేపల్లి సుబ్బాయమ్మ చెప్పారు. అన్నీ రంగాల్లో జిల్లా అభివృద్ధి చెందుతుందని ఆమె ప్రజలకు ఉగాది శుభాకాంక్షలు తెలిపారు. జిల్లాలో అనేక మంది కవులు, రచయితలు ఉన్నందున తెలుగు సంప్రదాయం ఉట్టిపడేలా కవి సమ్మేళనం, అష్టావధానం వంటి కార్యక్రమాలు నిర్వహిస్తున్నట్లు కలెక్టర్ ఏఎస్ దినేష్ కుమార్ తెలిపారు. మన సంస్కృతిని కాపాడుకోవాల్సిన అవసరం ప్రతి ఒక్కరిపై ఉందని జాయింట్ కలెక్టర్ అభిషిక్త్ కిషోర్ చెప్పారు. ప్రభుత్వ కార్యక్రమాల్లో వీటికి ప్రాధాన్యత ఇచ్చేలా ప్రత్యేక దృష్టి పెడతామని తెలిపారు. కలెక్టర్ ఏఎస్ దినేష్ కుమార్, బాపట్ల కలెక్టర్ విజయ కృష్ణన్, జేసీ అభిషిక్త్ కిషోర్ లు కుటుంబ సభ్యులతో పాల్గొనడం విశేషం. తొలుత పూజా కార్యక్రమాలు, జ్యోతి ప్రజ్వలనం అనంతరం మఠంపల్లి దక్షిణామూర్తి పంచాంగ పఠనం చేశారు. ఈ ఏడాది సమృద్ధిగా వర్షాలు కురుస్తాయని, పంటలు బాగా పండుతాయని, ప్రజలంతా ఆయురారోగ్యాలతో సుఖసంతోషాలతో ఉంటారని చెప్పారు.
ఆకట్టుకున్న భువన విజయం:
విజయనగర వైభవాన్ని తెలియజేసేలా పాఠశాల విద్యార్థులు ప్రదర్శించిన భువన విజయం నాటిక ఆకట్టుకుంది. కవి సమ్మేళనం ఆద్యంతం ప్రశంసలు పొందింది. మానేపల్లి నాగకుమార్ శర్మ అష్టావధానం అబ్బురపరచింది. ఈ సందర్భంగా పలువురు అర్చకులను ఘనంగా సత్కరించారు. ఈ వేడుకల్లో సూర్య బలిజ కార్పొరేషన్ డైరక్టర్ దాసరి కరుణాకర్, ఆర్యవైశ్య కార్పొరేషన్ చైర్మన్ కుప్పం ప్రసాద్, రాష్ట్ర టైలర్స్ డెవలప్‌మెంట్ కో ఆపరేటివ్ ఫెడరేషన్ చైర్‌పర్సన్ షేక్ సుభాన్ బీ, పీడీసీసీ బ్యాంకు చైర్మన్ మాదాసి వెంకయ్య, దేవదాయ శాఖ సమాయ కమిషనర్ మాధవి, ఒంగోలు ఆర్డీఓ విశ్వేశ్వరరావు, వివిధ శాఖల జిల్లా అధికారులు, ప్రజా ప్రతినిధులు పాల్గొన్నారు.
