
తాడేపల్లి: తెలంగాణ రాష్ట్రంలో జరిగిన ఫోన్ ట్యాపింగ్ అంశంతో తనకేంటి సంబంధమన్నారు వైఎస్సార్‌సీపీ అధ్యక్షుడు, మాజీ సీఎం వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డి. తన ఫోన్‌ను దగ్గరి వాళ్లు ట్యాపింగ్ చేశారని షర్మిల చేసిన వ్యాఖ్యలపై.. మీడియా అడిగిన ప్రశ్నకు వైఎస్ జగన్ స్పందించారు. పక్క రాష్ట్రంలో జరిగిన ఫోన్ ట్యాపింగ్‌తో తనకు సంబంధమేంటన్నారు వైఎస్ జగన్.
‘ఫోన్ ట్యాపింగ్ ఎవరు చేశారు?, కేసీఆర్ ప్రభుత్వం.. షర్మిలమ్మ ఫోన్ ట్యాప్ చేసిందా?, అప్పట్లో ఆమె తెలంగాణ రాష్ట్రంలో పార్టీ పెట్టింది కాబట్టి చేశారేమో.. చేశారో, లేదో నాకేం తెలుస్తుంది. ఆ ఫోన్ ట్యాపింగ్‌కు నాకు ఏం సంబంధం?’ అని వైఎస్ జగన్ ప్రశ్నించారు. గురువారం తాడేపల్లి వైఎస్సార్‌సీపీ కేంద్ర కార్యాలయంలో జరిగిన మీడియా సమావేశంలో వైఎస్ జగన్ మాట్లాడారు. రాష్ట్రంలో దిగజారిన లాండ్ ఆర్డర్, పాలన వైఫల్యాలు, మోసాల మధ్య చంద్రబాబు పాలన కొనసాగుతోందని మండిపడ్డారు. దీనిలో భాగంగా మీడియా అడిగిన ప్రశ్నకుల సమాధానమిచ్చారు వైఎస్ జగన్.
ఇంకా మీడియా ప్రశ్నలకు సమాధానమిస్తూ..
నేను పరామర్శకు వెళ్లడం తప్పా?
పల్నాడు జిల్లాలో నిన్నటి నా పర్యటన. మా పార్టీకి చెందని ఉప సర్పంచ్ వేధింపులు తాళలేక ఆత్మహత్య చేసుకుంటే, నేను పరామర్శకు వెళ్లాను. దానిపై నాగమల్లేశ్వరరావు కోర్టు నుంచి ఆదేశాలు తెచ్చినా, కేసు నమోదు చేయలేదు. నేను వారిని పరామర్శించడం కోసం వెళ్లడం తప్పా? వారు మా పార్టీ నాయకులు.
నేను అక్కడికి పోకుండా కర్ఫ్యూ పరిస్థితి తీసుకురావడం తప్పు కాదా? నేను వెళ్లిన ఇంటి యజమానిపై కేసు పెట్టడం తప్పు కాదా?
ఇది ప్రజాస్వామ్య స్ఫూర్తికి విఘాతం. ఇంతకన్నా ఘోరం మరొకటి ఉండదు.
ఎవరు ఆ సమస్య సృష్టిస్తున్నారు?
నా పర్యటనలో శాంతి భద్రతల సమస్య ఎవరు సృష్టిస్తున్నారు. రైతుల దగ్గరకు పోయాను. పరామర్శించాను. అందులో తప్పేమిటి?
నన్ను అడ్డుకోవాలని చూడడం ఎందుకు? ఎందరు రావాలో చెప్పడానికి నువ్వు ఎవరు? నన్ను చూడడానికి ప్రజలు రాకుండా అడ్డుకోవడం ఎందుకు? వారికి భోజనం పెడుతున్నావా?
నా అభిమానులు. నా పార్టీ కార్యకర్తలు వస్తే, నీకేం బాధ?
నేను సమస్యలపై పోరాటం మొదలు పెట్టేవరకు ఆయన స్పందించడం లేదు. రైతుల దగ్గరకు నేను వెళ్తేనే కదా, ఆయన స్పందించలేదు. నేను రైతులను పరామర్శిస్తే, మీకేం బాధ?
అసలు నీవు సమస్యలు పరిష్కరిస్తే, నేను వెళ్లాల్సిన అవసరం ఏముంది?
ఆ అబ్బాయి టీడీపీ సభ్యుడు
నిన్నటి పోస్టర్ల ప్రస్తావన. అది పుష్ప సినిమా డైలాగ్. అది పెట్టినా తప్పేనా? ఆ ఫ్లెక్సీ పెట్టిన యువకుడు టీడీపీ సభ్యుడు. ఆయనకు సభ్యత్వం కూడా ఉంది. అంటే, టీడీపీకి చెందిన వ్యక్తి, యువకుడికి కూడా చంద్రబాబుపై కోపం వచ్చింది. అందుకే రప్పా రప్పా కోస్తాను అన్నాడు. ఏ పథకాలు లేవు. అంతా మోసం. అందుకే టీడీపీ వారిపై ఆక్రోషం చూపుతూ ఫోటోలు, ఫ్లెక్సీల ప్రదర్శన. టీడీపీ కార్యకర్త, సభ్యుడు.. మన కార్యక్రమంలో పాల్గొని, టీడీపీ వారినే రప్పా, రప్పా నరుకుతా అన్నాడు’ అని వైఎస్ జగన్ పేర్కొన్నారు.