రాహుల్‌ గాంధీ షాకింగ్‌ ట్వీట్‌: ట్విటర్‌ దుమారం

Why many dictators names that begin with M : Rahul Gandhi  tweet - Sakshi

నియంతల పేర్లన్నీ ‘ఎం’ లెటర్‌తోనే ఎందుకు స్టార్టవుతాయి : రాహుల్‌ గాంధీ 

రగులుతున్న ట్విటర్‌ 

సాక్షి, న్యూఢిల్లీ : కొత్త వ్యవసాయ చట్టాలను వెనక్కి తీసుకునేదాకా, తమ ఉద్యమాన్ని విరమించే ప్రసక్తే లేదని ఒకవైపు రైతు సంఘ నేతలు తెగేసి చెప్పారు. మరోవైపు రైతుల నిరసనలకు ప్రధాన కేంద్రమైన సింగూతో పాటు, ఖాజీపూర్ సరిహద్దు, తిక్రీ సరిహద్దు వద్ద అసాధారణ భద్రతను విధించడం చర్చకు దారి తీసింది. ఈ పరిణామాల నేపథ్యంలో కాంగ్రెస్ నేత రాహుల్ గాంధీ బీజేపీసర్కార్‌పై మరోసారి సంచలన వ్యాఖ్యలు చేసారు. ప్రధానమంత్రి నరేంద్రమోదీ టార్గెట్‌గా ఆయన చేసిన సోషల్‌ మీడియా పోస్ట్‌ వైరలవుతోంది.  ఇది బీజేపీ, కాంగ్రెస్‌ శ్రేణుల మధ్య ట్విటర్‌ వార్‌కి దారి తీసింది. దాదాపు 8వేల మంది రాహుల్ ‌తాజా ట్వీట్‌ను రీట్వీట్‌ చేయగా,  34వేలకు పైగా లైకులు వచ్చాయి. 

ప్రపంచ నియంతల పేర‍్లన్నీ ‘ఎం’ తోనే ప్రారంభం అవుతాయంటూ ట్వీట్‌ చేసి రాహుల్‌ దుమారాన్ని రేపారు. ఆయా నేతల పేర్లన్నీ 'ఎం' అనే ఆంగ్ల అక్షరంతోనే ఎందుకు మొదలవుతాయంటూ బుధవారం ట్వీట్ చేశారు. మార్కోస్ ముస్సోలినీ, మిలోసెవిక్, ముబారక్, మొబుటు, ముషారఫ్, మికోంబెరో పేర్లను రాహుల్ ఉదహరించారు. కాంగ్రెస్‌ నేత మోతీలాల్‌ నెహ్రూ, మాజీ ప్రధాని మన్మోహన్‌ పేర్లు కూడా 'ఎం' తోనే మొదలవుతాయి కదా అంటూ  కొంతమంది  ప్రతి విమర్శ చేశారు. అలాగే మమతా బెనర్జీ, మాయావతి పేర్లను ప్రస్తావిస్తూ మరొకరు రాహుల్‌కి కౌంటర్‌ వేశారు. అసలు ప్రధాని నరేంద్రమోదీ పేరు ‘ఎన్‌’ తో కదా స్టార్ట్‌ అయ్యేదంటూ మరికొందరు రాహుల్‌పై విరుచుకు పడుతున్నారు. 

కాగా రైతు ఆందోళన నేపథ్యంలో వారికి మద్దతు పలుకుతున్న ట్విటర్‌ ఖాతాలను బ్లాక్ చేసిన అంశంతోపాటు, పోలీసులు ఏర్పాటు చేసిన మేకులు, బారికేడ్లకు సంబంధించి కూడా  కేంద్రంపై  రాహుల్‌ విమర్శలు గుప్పించిన సంగతి తెలిసిందే.

whatsapp channel

Read latest Politics News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top