ప్రభుత్వాల వైఫల్యాలను యువతే ఎండగట్టాలి

Uttamkumar Reddy in Youth Congress National Working Committee - Sakshi

రెండు కోట్ల ఉద్యోగాలన్న మోదీ ఉన్న ఉపాధిని పోగొడుతున్నారు.. ఇంటికో ఉద్యోగమని చెప్పిన కేసీఆర్‌ యువతను నిర్వీర్యం చేశారు 

యూత్‌ కాంగ్రెస్‌ జాతీయ కార్యవర్గ సమావేశంలో ఉత్తమ్‌ 

హైదరాబాద్‌లో యూత్‌ కాంగ్రెస్‌ జాతీయ సమావేశాలు 

సాక్షి, హైదరాబాద్‌: కేంద్రంలో అధికారంలో ఉన్న బీజేపీ, రాష్ట్రంలో అధికారంలో ఉన్న బీఆర్‌ఎస్‌లు యువతకు ద్రోహం చేశాయని, కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాల వైఫల్యాలను ప్రజల్లోకి విస్తృతంగా తీసుకెళ్లే బాధ్యత యువజన కాంగ్రెస్‌ నాయకులపై ఉందని నల్లగొండ ఎంపీ, టీపీసీసీ మాజీ అధ్యక్షుడు కెప్టెన్‌ ఎన్‌.ఉత్తమ్‌కుమార్‌రెడ్డి వ్యాఖ్యానించారు. అఖిల భారత యువజన కాంగ్రెస్‌ (ఏఐవైసీ) జాతీయ కార్యవర్గ సమావేశాలు బుధవారం హైదరాబాద్‌లో ప్రారంభమయ్యాయి.

మూడు రోజుల పాటు జరగనున్న ఈ సమావేశాల ప్రారంభ కార్యక్రమంలో ముఖ్య అతిథిగా ఉత్తమ్‌ మాట్లాడుతూ ఇంటికో ఉద్యోగం ఇస్తామని చెప్పి రెండుసార్లు అధికారం చేపట్టిన తర్వాత కూడా రాష్ట్రంలో ఖాళీగా ఉన్న ప్రభుత్వ ఉద్యోగాలను భర్తీ చేయడంలో సీఎం కేసీఆర్‌ విఫలమయ్యారని, బీఆర్‌ఎస్‌ పాలనలో యువత  నిర్వీర్యం అయిందని ఆవేదన వ్యక్తం చేశారు.

ఏడాదికి రెండు కోట్ల ఉద్యోగాలిస్తామని అధికారంలోకి వచ్చిన మోదీ ఉన్న ఉపాధిని పోగొడుతున్నారని, దశాబ్దాలుగా కాంగ్రెస్‌ పార్టీ ఏర్పాటు చేసి కాపాడుకుంటూ వస్తున్న ప్రభుత్వ రంగ సంస్థలను మూసివేయడం ద్వారా ఉపాధిపై దొంగదెబ్బ కొడుతున్నారని విమర్శించారు. ఈ రెండు పార్టీలకు బుద్ధి చెప్పేలా యూత్‌ కాంగ్రెస్‌ ప్రజల్లోకి వెళ్లి పనిచేయాలని, యువతను జాగృతం చేయడం ద్వారా దేశ భవిష్యత్తును కాపాడాలని కోరారు.

యూత్‌కాంగ్రెస్‌ జాతీయ కార్యవర్గ సమావేశాల ప్రారంభం సందర్భంగా ఒడిశా రైలు ప్రమాద మృతులకు రెండు నిమిషాల పాటు మౌనం పాటించి సంతాపం వ్యక్తం చేశారు. తొలి రోజు సమావేశాల్లో ఏఐసీసీ కార్యదర్శి వంశీచందర్‌రెడ్డి, టీపీసీసీ వర్కింగ్‌ ప్రెసిడెంట్‌ బి. మహేశ్‌కుమార్‌గౌడ్, యూత్‌కాంగ్రెస్‌ జాతీయ అధ్యక్షుడు బి.వి.శ్రీనివాస్, రాష్ట్ర ఇంచార్జి కృష్ణ, తెలంగాణ యూత్‌ కాంగ్రెస్‌ అధ్యక్షుడు శివసేనారెడ్డితో పాటు దేశంలోని పలు రాష్ట్రాల నుంచి వచ్చిన యూత్‌ కాంగ్రెస్‌ ప్రతినిధులు పాల్గొన్నారు. సమావేశాల ప్రారంభసూచికగా జాతీయ జెండాను ఆవిష్కరించారు. 
 
5 రాష్ట్రాల ఎన్నికలపై చర్చిస్తాం: యూత్‌ కాంగ్రెస్‌ రాష్ట్ర అధ్యక్షుడు శివసేనారెడ్డి 
జాతీయ కార్యవర్గ సమావేశాల సందర్భంగా తెలంగాణ యూత్‌ కాంగ్రెస్‌ అధ్యక్షుడు శివసేనారెడ్డి మాట్లాడుతూ తొలిసారిగా యూత్‌కాంగ్రెస్‌ జాతీయ స్థాయి సమావేశాలను హైదరాబాద్‌లో నిర్వహిస్తున్నామని చెప్పారు. మూడు రోజుల పాటు జరిగే ఈ సమావేశాల్లో త్వరలో జరగబోయే 5 రాష్ట్రాల ఎన్నికల్లో యూత్‌ కాంగ్రెస్‌ పాత్ర, యూత్‌ కాంగ్రెస్‌ నేతలకు టికెట్ల కేటాయింపు లాంటి అంశాలపై చర్చిస్తామని ఆయన వెల్లడించారు. 
 
ప్రజల్లోకి ’యూత్‌ డిక్లరేషన్‌’... గజ్వేల్‌ నుంచి బస్సు యాత్ర  
ఎన్నికలు సమీపిస్తున్న నేపథ్యంలో కాంగ్రెస్‌ పార్టీ చేసిన ‘యూత్‌ డిక్లరేషన్‌’ను విస్తృతంగా ప్రజల్లోకి తీసుకెళ్లాలని యువజన కాంగ్రెస్‌ నిర్ణయించింది. ఇందుకోసం బస్సుయాత్ర చేపట్టనుంది. గజ్వేల్‌ నియోజకవర్గం నుంచి ప్రారంభం కానున్న ఈ యాత్ర రాష్ట్ర వ్యాప్తంగా జరగనుంది. అయితే, ఇందుకు సంబంధించిన తేదీలను ఖరారు చేయాల్సి ఉంది.

ఈ యాత్రలో భాగంగా రాష్ట్రంలోని నిరుద్యోగ యువతకు ఉపాధి కల్పన, జాబ్‌ కేలండర్, టీఎస్‌పీఎస్సీ ప్రక్షాళన, కొత్త యూనివర్శిటీల ఏర్పాటు, విద్యార్థులు ఫీజు రీయింబర్స్‌మెంట్‌ చెల్లింపు, యూత్‌ కమిషన్‌ ఏర్పాటు ద్వారా నిరుద్యోగుల స్వయం ఉపాధికి రూ.10లక్షల రుణం లాంటి అంశాలను ప్రజల్లోకి తీసుకెళ్లి వారిలో భరోసా కల్పించనున్నారు. తీవ్ర నైరాశ్యంలో ఉన్న యువతను ఈ యాత్ర ద్వారా జాగృతం చేస్తామని, కాంగ్రెస్‌ పార్టీ విజయం కోసం కృషి చేసేలా యువతను సిద్ధం చేస్తామని యూత్‌ కాంగ్రెస్‌ నేతలు చెబుతున్నారు.   

Read latest Politics News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top