శివసేన మాదిరిగా దాడులు చేయండి : సుమన్‌

TRS MLA Balka Suman Fires On Bandi Sanjay Kumar - Sakshi

బండి సంజయ్‌పై ఘాటు ‍వ్యాఖ్యలు చేసిన టీఆర్‌ఎస్‌ నేతలు

సాక్షి, మంచిర్యాల ‌: కేవలం ఎన్నికల కోసమే బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్‌ తొండి చేస్తున్నారని, అడ్డందిడ్డం మాట్లాడుతున్న ఆయన నాలుక కోస్తామని రాష్ట్ర అటవీ, దేవాదాయ, న్యాయ, గృహనిర్మాణ శాఖ మంత్రి అల్లోల ఇంద్రకరణ్‌రెడ్డి, పౌరసరఫరాలు, బీసీ సంక్షేమ శాఖ మంత్రి గంగుల కమలాకర్, ప్రభుత్వ విప్, చెన్నూర్‌ ఎమ్మెల్యే బాల్క సుమన్‌ హెచ్చరించారు. రాష్ట్రవ్యాప్తంగా వానకాలంలో సాగైన ధాన్యాన్ని ప్రతిగింజ కొన్నామని గుర్తు చేశారు. రాష్ట్ర ప్రభుత్వం రైతుల సంక్షేమానికి పెద్దపీట వేస్తుంటే.. కేంద్ర ప్రభుత్వం వారిని నట్టేట ముంచే చట్టాలు తీసుకొచ్చిందని విమర్శించారు. బుధవారం మంచిర్యాల జిల్లా కేంద్రంలో స్థానిక వ్యవసాయ మార్కెట్‌కమిటీ పాలకర్గ ప్రమాణ స్వీకార కార్యక్రమానికి మంత్రులు, విప్‌ హాజరయ్యారు. ఢిల్లీలో రైతులు చలికి వణుకుతూ.. చట్టాల రద్దుకోసం దీక్ష చేస్తుంటే కేంద్రం చర్చల పేరిట కాలయాపన చేస్తోందని ఆగ్రహం వ్యక్తం చేశారు. రాష్ట్రప్రభుత్వం రైతుబంధు, రైతుబీమా, 24 గంటల ఉచిత కరెంట్‌ వంటి అనేక సంక్షేమ పథకాలు అమలు చేస్తుంటే.. కేంద్రం మాత్రం కార్పొరేట్‌ శక్తులకు వ్యవసాయాన్ని తాకట్టుపెడుతోందని విమర్శించారు. (పీసీసీ: కలకలం రేపిన రేవంత్‌ వ్యాఖ్యలు)

బండి సంజయ్‌ గుడులు, బడులు, ఇండియా, పాకిస్తాన్‌ పేరుతో యువతను తప్పుదోవ పట్టిస్తున్నారని, ఎన్నికల కోసం ఇష్టమొచ్చినట్లు మాట్లాడితే బట్టలు ఊడదీసి కొడుతామని హెచ్చరించారు. కేసీఆర్‌ ఉద్యమం, రాష్ట్ర ఆవిర్భావం వల్లనే బండికి రాష్ట్ర అధ్యక్ష పదవి వచ్చిన విషయాన్ని గుర్తుంచుకోవాలన్నారు. కరీంనగర్‌కు అప్పటి ఎంపీ వినోద్‌కుమార్‌ త్రిబుల్‌ ఐటీ తీసుకొస్తే.. దానిని కర్ణాటకలోని రాయచూర్‌కు తరలించారని, ఎంపీగా ఉన్న బండి ఎందుకు అడ్డుకోలేకపోయారని ప్రశ్నించారు. కేసీఆర్‌పై లేని పోని ఆరోపణలు చేస్తున్న బీజేపీ నాయకులను మహారాష్ట్రలోని బాల్‌ఠాక్రే శివసేన అనుచరుల శివసేన  తరహ దాడులు  చేయాలని టీఆర్‌ఎస్‌ కార్యకర్తలకు పిలుపునిచ్చారు. ఈ వ్యాఖ్యలు రాష్ట్ర రాజకీయాల్లో కలకలంగా మారాయి. టీఅర్ఎస్ ప్రజాప్రతినిధులు పరుష వ్యాఖ్యలతో  తెలంగాణ  రాజకీయాలలో హీట్ పుట్టించారు. మరి ఈ వ్యాఖ్యలపై బీజేపీ నేతలు ఏలా స్పందిస్తారో చూడాలి. (రేవంత్‌కు షాక్‌.. పీసీసీపై అనూహ్య నిర్ణయం!)
 
ఉద్యమకారులను గుర్తిస్తున్నాం
ముఖ్యమంత్రి కేసీఆర్‌ తెలంగాణ ఉద్యమకారులను గుర్తిస్తున్నారని, ఆలస్యమైనా ప్రతి ఒక్కరికీ న్యాయం చేస్తారని మంత్రి గంగుల అన్నారు. కేంద్రం తెచ్చిన రైతు వ్యతిరేక చట్టాలతో 1980లో రైతులు ఎదుర్కొన్న నష్టాలు, కష్టాలు పునరావృతం అవుతాయన్నారు. మంత్రి ఐకే.రెడ్డి మాట్లాడుతూ.. కాళేశ్వరం ప్రాజెక్టుతో శ్రీంసాగర్‌కు నీళ్లు వచ్చాయని, ఇప్పుడు లక్షల ఎకరాలకు సాగు నీరు అందుతోందని పేర్కొన్నారు. విప్‌ మాట్లాడుతూ.. రాష్ట్ర అభివృద్ధికి కేంద్ర నుంచి ఎలాంటి నిధులూ అందడం లేదని, కానీ.. బండి సంజయ్‌ మాత్రం కేసీఆర్‌పై అసత్యపు ఆరోపణలు చేస్తూ దొంగే దొంగదొంగ అన్నట్లు వ్యవహరిస్తున్నారని విమర్శించారు. కేసీఆర్‌ను విమర్శిస్తే కరీంనగర్‌ గడ్డపైనే బట్టలు ఊడదీసి కొడుతామని హెచ్చరించారు. అంగీలు మార్చినట్లు రంగు మార్చే నాయకుడు ఒకరు, ప్రజాసమస్యలు, అభివృద్ధి అంటే తెలియకుండా.. వందల కోట్లు సంపాదించుకుని వచ్చిన మరో నాయకుడు రోజుకో ఊరు తిరుగుతున్నారని, ప్రభుత్వంపై విమర్శలు చేస్తున్నారని, వారిని టీఆర్‌ఎస్‌ కార్యకర్తలు, ప్రజలు తరిమికొట్టాలని పిలుపునిచ్చారు.

త్వరలో చెన్నూర్‌ డివిజన్‌ కేంద్రంగా మందమర్రి, భీమారం, జైపూర్‌ మండలాలకు కొత్త వ్యవసాయ మార్కెట్‌యార్డు నిర్మాణం, కమిటీ ఏర్పాటు చేస్తామన్నారు. ఎంపీ వెంకటేష్‌ నేత, ఎమ్మెల్సీ పురాణం సతీష్‌ మాట్లాడుతూ రైతువేదికలు పల్లెప్రగతి, పట్టణ ప్రగతితో రాష్ట్రం బంగారు తెలంగాణ, ప్రాజెక్టులతో జలకసంతరించుకుంటోందని పేర్కొన్నారు. రాష్ట్రం 2014కు ముందు ఎలా ఉందో..? ఇప్పుడు ఎలా ఉందో గ్రహించాలని సూచించారు. ప్రమాణ స్వీకారానికి జెడ్పీ చైర్‌పర్సన్‌ నల్లాల భాగ్యలక్ష్మి, ఎమ్యెల్యేలు దివాకర్‌రావు, దుర్గం చిన్నయ్య హాజరయ్యారు. మార్కెట్‌కమిటీ చైర్మన్‌గా పల్లె భూమేష్, వైస్‌చైర్మన్‌గా గోపతి లస్మయ్య, డైరెక్టర్లుగా అన్కం లక్ష్మి, తోకల సురేష్, తిప్పని తిరుపతి, జి, భీమయ్య, పి. ప్రభకార్, ఎండీ.షాబీర్‌ అలీ, అశోక్‌ కుమార్‌లడ్డా, కే.సురేందర్‌ ప్రమాణ స్వీకారం చేశారు. పాలకవర్గాన్ని డీసీఎంస్‌ చైర్మన్‌ తిప్పని లింగయ్య, రైతు సమన్వయ సమితి జిల్లాఅధ్యక్షులు మోటపలుకుల గురువయ్య, గ్రంథాలయ చైర్మన్‌ రేణుగుంట్ల ప్రవీణ్,  మంచిర్యాల మున్సిపల్‌ చైర్మన్‌ పెంటరాజయ్య, సహకార సంఘం చైర్మన్‌ వెంకటేష్‌ అభినందించారు. 

Read latest Politics News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top