త్రిష ఆశలు గల్లంతేనా? | Is Trisha Sacrifice For TVK Vijay Govt Formation? Here How It Is? | Sakshi
Sakshi News home page

త్రిష ఆశలు గల్లంతేనా?

May 9 2026 10:51 AM | Updated on May 9 2026 11:14 AM

Is Trisha Sacrifice For TVK Vijay Govt Formation? Here How It Is?

తమిళనాడు ఎన్నికల్లో అత్యధిక స్థానాలు గెల్చుకుని సంచలనానికి తెర తీసినప్పటికీ..  ప్రభుత్వ ఏర్పాటులో మాత్రం టీవీకే అధినేత విజయ్‌కు పూటకో తలనొప్పి ఎదురవుతోంది. ఫలితాలు వెల్లడై ఐదు రోజులు గడుస్తున్నా.. సీఎంగా ప్రమాణం చేయకపోవడంతో ఆయన అభిమానులు నిరాశ చెందుతున్నారు. పూర్తి బలం(118)తో రావాలంటూ గవర్నర్‌ తేల్చి చెప్పేయడంతో మద్దతు కూడగట్టే పనిలో మునిగిపోయారు. ఈలోపు.. మరో ఆసక్తికరమైన చర్చ తెరపైకి వచ్చింది.  

విజయ్‌కు గతంలో పలువురు నటీమణులతో సంబంధాలు ఉన్నట్లు ఉధృతంగా ప్రచారం జరిగింది. అయితే వాటిని ఆయనో, అవతలి తారలో కొట్టిపారేస్తూ వచ్చారు. ఎన్నికలకు కొద్దిరోజులు ముందు.. నటి త్రిషతో ఆయన ప్రైవేట్‌ టిప్‌కు వెళ్లడం.. చిన్న ‘క్లూ’తో ఆ విషయం బయటకు రావడంతో తమిళనాట సంచలన చర్చ నడిచింది. ఈలోపు ఎన్నికలకు కొద్దిరోజుల ముందు విజయ్‌ భార్య సంగీత విడాకుల కోసం కోర్టుకెక్కడంతో ఆ బంధం అఫీషియల్‌గానే బయటపడింది. ఆపై..

విజయ్‌తో కలిసి ఓ వివాహ వేడుకకు త్రిష హాజరు కావడం, అసెంబ్లీ ఎన్నికల ఫలితాల నాడే ఆమె పుట్టినరోజు కావడం.. ఫలితాల్లో విజయ్‌ విక్టరీ.. ఆమె స్వయంగా ఇంటికి వెళ్లి విజయ్‌ను అభినందించడం.. ఇటు త్రిషకు బర్త్‌డే విషెస్‌ చెప్పే క్రమంలో తారాలోకం విజయ్‌ ప్రస్తావన తేవడం.. వెనువెంట చర్చనీయాంశాలుగా మారాయి. ఒకవైపు వీళ్ల వ్యక్తిగత జీవితం గురించి చర్చ నడుస్తున్న వేళ.. అనూహ్యంగా త్రిష రాజకీయ అరంగేట్రం టాపిక్‌ తెరపైకి వచ్చింది.

విజయ్‌ అత్యధిక మెజారిటీతో పెరంబూర్‌లో గెలిచారు. అదే సమయంలో తిరుచ్చి ఈస్ట్‌లోనూ విజయం సాధించారు. రెండింటిలో తిరుచ్చి ఈస్ట్‌కే ఆయన రాజీనామా చేస్తారని టీవీకే వర్గాలు వెల్లడించాయి. అయితే త్రిష టీవీకేలో చేరి రాజకీయ రంగ ప్రవేశం చేస్తారని.. విజయ్‌ ఖాళీ చేసే స్థానంలో నటి త్రిషను పోటీ చేయిస్తారనే ప్రచారం ఊపందుకుంది. ఈ ప్రతిపాదన టీవీకే పార్టీ సమావేశంలోనూ జరిగిందని.. ఆమెకు ఏకంగా డిప్యూటీ సీఎం చేయబోతున్నారనే మరో గాలి వార్త చక్కర్లు కొట్టింది.

అయితే త్రిషకు రాజకీయాలంటే ఇష్టమే. గతంలో ఏకంగా సీఎం అ‍వ్వాలని ఉందంటూ ఓ ఇంటర్వ్యూలో ఆమె ప్రకటించారు. అందుకు సంబంధించిన క్లిప్‌ కూడా సోషల్‌ మీడియాలో విపరీతంగా వైరల్‌​ అయ్యింది. అంతేకాదు.. విజయ్‌ రాజకీయాల్లో అడుగుపెట్టినప్పటి నుంచి ప్రత్యక్షంగా.. పరోక్షంగా.. ఆయనకు మద్దతు ఇస్తూ వస్తున్నారు. వీటికి తోడు నాలుగు పదుల వయసులో ఉన్న త్రిషకు సినిమా అవకాశాలు తగ్గిపోవడంతో ఆమె దాదాపుగా రాజకీయాల వైపు వెళ్లవచ్చని అంతా భావించారు.

కానీ, ఆమెకు నిరాశే ఎదురయ్యే పరిస్థితులు కనిపిస్తున్నాయి. ప్రస్తుతం విజయ్‌ పార్టీకి సంఖ్యా బలం తక్కువగా ఉంది. దీంతో.. చిన్న పార్టీల మద్దతు కోరారు. దళిత వాదంతో పుట్టికొచ్చిన విడుదల చిరుతైగళ్ కట్చి పార్టీ ఈ ఎన్నికల్లో రెండు సీట్లు నెగ్గింది. వామపక్షాలకు దగ్గరగా ఉండడంతో.. ఈ పార్టీ కూడా విజయ్‌కు షరతుల్లేకుండా బయటి నుంచి మద్దతు ఇవ్వొచ్చని అంతా భావించారు. కానీ, ఆఖరి నిమిషంలో వీసీకే పార్టీ అధ్యక్షుడు తిరుమావళవన్ పెద్ద మెలికే పెట్టారు.

తనకు డిప్యూటీ సీఎం పదవి ఇవ్వాలని, తన ఇద్దరు ఎమ్మెల్యేల్లో ఒకరికి మంత్రి పదవి ఇవ్వాలని, దళిత సంక్షేమం కోసం ప్రత్యేక చట్టం తీసుకురావాలని డిమాండ్‌ చేస్తోంది వీసీకే. వీటితో పాటు విజయ్‌ వదిలేసే తిరుచ్చి ఈస్ట్‌ను కూడా తమకే వదిలేయాలని టీవీకే ముందు మొత్తం నాలుగు డిమాండ్లు ఉంచింది. వీటిలో మంత్రి పదవితో పాటు ప్రత్యేక చట్టం డిమాండ్లకు విజయ్‌ ఇప్పటికిప్పుడు సుముఖంగానే ఉన్నట్లు.. మిగతా రెండింటి విషయంలోనే ఆయన తటపటాయిస్తు‍న్నట్లు తెలుస్తోంది. ప్రస్తుతం ఉన్న పరిస్థితుల్లో వీసీకే మద్దతు టీవీకేకు ఎంతో కీలకం.  ఒకవేళ.. మిగతా రెండు డిమాండ్లకు గనుక విజయ్‌ అంగీకరిస్తే త్రిష ఆశలు గల్లంతైనట్లేనన్న చర్చ ఇటు తమిళ రాజకీయాలు, అటు సినీ రంగంలోనూ జోరుగా నడుస్తోంది.

Advertisement
 
Advertisement
Advertisement