ఎన్నిక సరే.. మునుగోడుతో ఎన్నో మలుపులు

In Telangana Politics Munugode By Election Was Lesson For Whom - Sakshi

2023కు ముందు టీఆర్ఎస్‌కు ఊరట

కమలం, కాంగ్రెస్‌కు తీవ్ర నిరాశ

తెలంగాణలో అత్యంత ప్రతిష్టాత్మకంగా జరిగిన మునుగోడు శాసనసభ నియోజకవర్గ ఉప ఎన్నికలో అధికార టీఆర్‌ఎస్‌  పార్టీ విజయం సాధించింది. టీఆర్‌ఎస్‌ ,బీజేపీల మద్య హోరాహోరీగా సాగిన ఈ ఎన్నికలో ఎన్నెన్నో ట్విస్టులు, జిమ్మిక్కులు జరిగిన తీరు రాజకీయాలకు అంత వన్నె తెచ్చేవి కావు. కాని గెలుపే లక్ష్యంగా సాగుతున్న ఈ రోజులలో ఈ ప్రమాణాల గురించి పెద్దగా ఆలోచించడం అనవసరమనిపిస్తుంది. రాజకీయంగా చూస్తే టీఆర్‌ఎస్‌ గెలిచిన మాట నిజమేకాని, ఆశించినంత మెజార్టీ రాకపోవడం ఆ పార్టీకి కొంత నిరాశేనని చెప్పకతప్పదు. టీఆర్‌ఎస్‌ అభ్యర్ధి కె.ప్రభాకరరెడ్డి అంత బలమైన అభ్యర్ధి కాదని ప్రచారం జరిగిన నేపధ్యంలో ఈ మాత్రం మెజార్టీ అయినా రావడం  ఆ పార్టీకి ఊరట అని భావించాలి.

భవిష్యత్తుకు సంకేతం.!
ఎలాగైనా గెలిచి సత్తా చాటాలని తద్వారా తెలంగాణలో గట్టి పునాది వేసుకోవాలని విశ్వయత్నం చేసిన బీజేపీకి తీవ్ర ఆశాభంగమే ఎదురైందని చెప్పాలి. కాని రెండో స్థానంలోకి రావడం ద్వారా కాంగ్రెస్‌ను బాగా దెబ్బతీసినట్లయింది. భవిష్యత్తులో తామే టీఆర్‌ఎస్‌ కు ప్రత్యామ్నాయం అని చెప్పుకోవడానికి  అవకాశం వచ్చినందుకు బీజేపీ సంతోషపడుతోంది. అందువల్లే ఓడిపోతే కోమటిరెడ్డి రాజగోపాలరెడ్డి ఖాతాలోకి, గెలిస్తే బీజేపీ ఖాతాలోకి వస్తుందన్న విశ్లేషణలు వచ్చాయి. కాంగ్రెస్ పార్టీ మునుగోడులో తన పట్టు పూర్తిగా కోల్పోకపోయినా, డిపాజిట్ పోవడం , మూడో స్థానానికే పరిమితం కావడం పెద్ద దెబ్బ అని చెప్పాలి. అయినా టీఆర్‌ఎస్‌, బీజేపీల మధ్య సాగిన రాజకీయ యుద్దంలో కాంగ్రెస్ అభ్యర్ధి పాల్వాయి స్రవంతి 23వేల ఓట్లు తెచ్చుకోవడం విశేషమే . ఎందుకంటే ఇంతకు ముందు జరిగిన హుజూరాబాద్ ఉప ఎన్నికలో కాంగ్రెస్ పార్టీ మరీ దారుణంగా మూడువేల లోపు ఓట్లకే పరిమితం అయింది. ఇక్కడ ఆ పరిస్థితి రాలేదు. 

ఎన్నికలో ఎవరిది పైచేయి.?
స్థూలంగా చూస్తే తెలంగాణలో బీజేపీ దూకుడుకు టీఆర్‌ఎస్‌ కళ్లెం వేస్తే, ఇంతకాలం తనకు ఎదురులేదనుకున్న టీఆర్‌ఎస్‌ మెజార్టీని తగ్గించడం ద్వారా, రెండో స్థానాన్ని సాధించడం ద్వారా  ఆ పార్టీని బీజేపీ కొంత ఆత్మరక్షణలో పడేసిందని చెప్పాలి. గత సాదారణ ఎన్నికలలో కోమటిరెడ్డి రాజగోపాలరెడ్డి కాంగ్రెస్ పక్షాన 22వేలకుపైగా మెజార్టీతో గెలుపొందారు.

కాంగ్రెస్ అధికారంలోకి రాకపోవడంతో  కోమటిరెడ్డి తన రాజకీయ భవిష్యత్తు పై ఆలోచన చేసి కేంద్రంలో అధికారంలో ఉన్న బీజేపీలోకి వెళ్లాలని ఆలోచించారు. ఆ క్రమంలో ఆయన కొన్నిసార్లు బీజేపీని ప్రశంసించడం, ఆ పార్టీలోకి వెళ్లనున్నట్లు సంకేతాలు ఇవ్వడం, మరికొన్నిసార్లు కాంగ్రెస్‌లోనే కొనసాగుతున్నట్లు చెప్పడం వంటి రాజకీయం నడిపారు. కేంద్రంలోకాని, తెలంగాణలో కాని కాంగ్రెస్ అధికారం రావడం సాద్యం కాదని ఆయన భావించడమే ఇందుకు కారణం.  అదే సమయంలో తన నియోజకవర్గంలోని కాంగ్రెస్ క్యాడర్ తొలుత  ఆయన పార్టీ మారడాన్ని అంగీకరించలేదు. అందుకే ఆయన చాలా సమయం తీసుకున్నారు. అంతేకాదు. ఒక దశలో తన సోదరుడు, ఎంపి అయిన కోమటిరెడ్డి వెంకటరెడ్డికి పీసీసీ అధ్యక్ష పదవి వస్తుందని ఆశించారు. తమకు ఆ బాద్యతలు అప్పగిస్తే పార్టీని తెలంగాణలో అదికారంలోకి తెస్తామని వారు అదిష్టానానికి చెప్పారు. కాని కాంగ్రెస్ అధినాయకత్వం టీడీపీ నుంచి వచ్చిన మల్కాజిగిరి ఎంపీ రేవంత్ రెడ్డికి పీసీసీ బాధ్యత అప్పగించింది. 

కోమటిరెడ్డి కొత్త దారి
రేవంత్ ఎంపిక తర్వాత కోమటిరెడ్డి సోదరులు బాగా హర్ట్ అయ్యారు. అప్పటి నుంచి రాజగోపాలరెడ్డి బీజేపీలోకి వెళ్లాలన్న గట్టి ఆలోచనకు వచ్చారు. ఇందుకోసం ఆయన కేంద్ర హోం మంత్రి అమిత్ షా ను కూడా కలిశారు. బీజేపీ నేతలు కూడా కాంగ్రెస్ నుంచి ఒక గట్టి నేత తమ పార్టీలోకి వస్తే బీజేపీకి మరింత ఊపు వస్తుందని భావించారు. రాజగోపాలరెడ్డి బీజేపీలోకి చేరడానికి ముందుగా నియోజకవర్గం అంతటా పర్యటించి తన మద్దతుదారులను మానసికంగా సిద్దం చేశారు. మెజార్టీ మద్దతుదారులను తనవైపు తిప్పుకున్నా, కాంగ్రెస్ నుంచి బయటకు రావడానికి ఇష్టపడని క్యాడర్ కూడా గణనీయంగానే ఉందని చెప్పాలి. అదే ఇప్పుడు కోమటిరెడ్డిని దెబ్బతీసింది.కాంగ్రెస్ పార్టీకి పది వేల నుంచి పదిహేనువేల ఓట్లు లోపే వస్తాయని వారు అనుకున్నారు. కోమటిరెడ్డి బీజేపీకి పరోక్షంగా మద్దతు ప్రకటించి, ఎమ్మెల్యే పదవికి రాజీనామా చేయకుండా ఉంటే ఈ ఉప ఎన్నిక వచ్చేదికాదు. 

వ్యూహాలు - ప్రతి వ్యూహాలు
బీజేపీ తన బలాన్ని పెంచుకోవడానికి , తన పట్టును పరీక్షించుకోవడానికి ఉప ఎన్నిక తీసుకు వచ్చింది. మరో ఏడాదిలో జరగనున్న సాధారణ ఎన్నికలకు ఇది రిహార్సల్ అని, సెమీ ఫైనల్స్ అని ప్రచారం జరిగింది. మునుగోడులో గెలిస్తే ఒక ఊపు వచ్చి తెలంగాణ  అంతటా బీజేపీకి  బలమైన అభ్యర్ధులు దొరికి అధికారం వైపు వెళ్లవచ్చని ఆ పార్టీ నేతలు అనుకున్నారు. కాని వారి లక్ష్యం కొంతమేరే నెరవేరింది. వచ్చే సాధారణ ఎన్నికలలో గెలవాలంటే బీజేపీ ఇంకా చాలా కష్టపడవలసి ఉంటుంది. టీఆర్‌ఎస్‌ వ్యూహాలను పరిశీలిస్తే బీజేపీ ఎత్తుగడలను ముందుగానే ముఖ్యమంత్రి కేసీఆర్‌ పసిగట్టారు. అందులోను హుజూరాబాద్ లో బీజేపీ పక్షాన ఈటెల రాజేందర్ గెలవడంతో టీఆర్‌ఎస్‌ పై ప్రజలలో వచ్చిన అనుమానాలను పోగొట్టాలంటే మునుగోడు ఎట్టి పరిస్థితిలోను గెలిచి తీరాలని ఆయన  అనుకున్నారు.

మిషన్ మునుగోడు
ఎన్నికల రాజకీయాలలో తలపండిన కేసీఆర్‌ ఎన్నికల సంఘం షెడ్యూల్ విడుదల చేయడానికి ముందే ప్రచారం ఆరంభించారు. మంత్రి జగదీష్ రెడ్డికి పూర్తి బాద్యతలు అప్పగించారు. ఆ నియోజకవర్గంలో పలు అభివృద్ది పనులకు శ్రీకారం చుట్టారు. తన రాజీనామా వల్లే టీఆర్‌ఎస్‌ ప్రభుత్వం అభివృద్ది కార్యక్రమాలు చేపడుతోందని కోమటిరెడ్డి ప్రచారం చేసినా, దానిని పట్టించుకోకుండా తమ పని తాము చేసుకుని వెళ్లారు. మొత్తం మంత్రులు,టీఆర్‌ఎస్‌ ఎమ్మెల్యేలు అందరిని మునుగోడులో ప్రచారానికి పంపించారు. తానుకూడా ఒక గ్రామానికి ఇన్ చార్జీగా ఉంటానని చెప్పడం ద్వారా నేతలకు ఈ ఎన్నిక ఎంత ముఖ్యమైనదో ఆయన తెలియచేశారు. 

బీఆర్ఎస్‌కు ఇదే నాంది
జాతీయ పార్టీ బిఆర్ఎస్ కు మునుగోడు గెలుపు ఒక మలుపు అవుతుందని ప్రచారం చేశారు. ఇదే సమయంలో బీజేపీ విధానాలను తప్పుపడుతూ విమర్శలు కురిపించేవారు. ప్రభుత్వాలను కూలగొడుతూ బీజేపీ ప్రజాస్వామ్యాన్ని హరిస్తోందని చెప్పడానికి నలుగురు ఎమ్మెల్యేల కొనుగోలు వ్యవహారాన్ని విజయవంతంగా తెరపైకి తెచ్చారు. దీనిని ఎదుర్కోవడానికి బీజేపీ చాలా కష్టపడవలసి వచ్చింది. వారు ఇదంతా డ్రామా అని ప్రచారం చేసినా, బీజేపీకి కొంత డామేజీ జరిగిందని చెప్పాలి.కోమటిరెడ్డికి కేంద్రం 18వేల కోట్ల కాంట్రాక్ట్ ఇచ్చిందని, అంత మొత్తానికి ఆయన అమ్ముడుపోయారంటూ తీవ్ర ఆరోపణ చేసింది. మొత్తం 18వేల కోట్లు రాజగోపాలరెడ్డి జేబులోకి వచ్చాయేమోనని ప్రజలు అనుమానించే తీరులో ఈ ప్రచారం జరిగింది. దీనిపై బీజేపీ ఎంత వివరణ ఇచ్చినా  పెద్దగా ఉపయోగం జరగలేదు.

ఇంత చేసినా పది వేలే.!
మామూలుగా ఎన్నికల్లో పది వేల మెజార్టీ మంచి మెజార్టీనే అవుతుంది. కాని టీఆర్‌ఎస్‌ గతంలో సాధించిన విజయాలు,మునుగోడులో కేంద్రీకరించిన తీరు, సర్వేలలో పదినుంచి పదిహేను శాతం ఆదిక్యతతో గెలుస్తుందని వచ్చిన అంచనాలు ..వీటన్నిటిని గమనంలోకి తీసుకుంటే ఇది గొప్ప మెజార్టీ కాదన్న అభిప్రాయం ఏర్పడింది. టీఆర్‌ఎస్‌ కు, బీజేపీకి మద్య నాలుగుశాతం ఓట్ల తేడానే ఉంది. ఈ రెండు పార్టీలు కూడా పోటాపోటీగా వ్యయం చేశాయన్నది వాస్తవం. టీఆర్‌ఎస్‌ నాలుగువేల చొప్పున, బీజేపీ మూడువేల చొప్పున, కాంగ్రెస్ వెయ్యి రూపాయల చొప్పున  డబ్బు పంపిణీ చేశాయని చెబుతున్నారు.ఇవి కాకుండా స్థానిక నేతలను లక్షలు పెట్టి కొనుగోలు చేశారు. 

స్టేట్ పోలీస్ x సెంట్రల్ ఫోర్సెస్
రోజూ ఓటర్లకు మద్యం , చికెన్ వంటివి సరఫరా చేశారు.కాగా బీజేపీ డబ్బును పట్టుకోవడానికి రాష్ట్ర పోలీసులను టీఆర్‌ఎస్‌ వాడుకుంటే, ఆదాయపన్ను శాఖ అదికారులను బీజేపీ వాడుకుంది.  ఈ విషయంలో టీఆర్‌ఎస్‌ బాగా సఫలం అయిందని చెప్పాలి. పట్టుబడిన డబ్బులో అత్యధికం బీజేపీకి చెందినవారిదే కావడమే ఇందుకు ఉదాహరణ. ఆదాయపన్ను అదికారులు మంత్రి జగదీష్ రెడ్డి పిఎ ఇంటిలోకాని, మరికొన్ని చోట్ల కాని దాడులు చేసినా, అంతంతమాత్రంగానే డబ్బు పట్టుబడిందని చెబుతున్నారు.సిబిఐ, ఈడి వంటి సంస్థలను వాడుకుని ప్రత్యర్ధి పార్టీలను బీజేపీ ఇబ్బంది పెడుతోందన్న ప్రచారాన్ని కూడా టీఆర్‌ఎస్‌ విజయవంతంగా తీసుకు వెళ్లింది. డిల్లీ లిక్కర్ స్కామ్ లో కేసీఆర్‌ కుటుంబ సభ్యులు ఉన్నారని బీజేపీ ప్రచారం చేసినా, టీఆర్‌ఎస్‌ ఆరోపణల ముందు ఇది ఆగలేదనిపిస్తుంది. ఏతావాతా చెప్పాలంటే టీఆర్‌ఎస్‌ ఈ ఉప ఎన్నికలో గెలిచినప్పటికీ, వచ్చే సాధారణ ఎన్నికలలో పరిస్థితి అంత తేలికగా ఉండదన్న సంకేతం వచ్చింది. 

కారు కళ్లు తెరుస్తుందా?
ఈ ఎన్నిక ద్వారా ఒక విషయం అర్థమయింది. టీఆర్‌ఎస్‌ పూర్తి అప్రమత్తం కావాల్సిన తరుణం అని చెప్పాలి. అలాగే బీజేపీకి తెలంగాణలో అదికారం వచ్చేంత సీన్ ఇప్పటికైతే రాలేదన్న సంగతి కూడా అర్ధం అవుతుంది. ఇక కాంగ్రెస్ పార్టీ పరిస్థితి చూస్తే ఈ రెండు పార్టీల మధ్య బకరా అయిపోయింది. అక్కడికి సీనియర్ నేత, దివంగత పాల్వాయి గోవర్ధనరెడ్డి కి ఉన్న పలుకుబడి ఆయన కుమార్తెగా కాంగ్రెస్ అభ్యర్ధి స్రవంతికి కొంత ప్రయోజనం కలిగించింది. అయినా అది సరిపోలేదు.కాంగ్రెస్ అగ్రనేత రాహుల్ గాంధీ ఈ ఉప ఎన్నిక సమయంలోనే తెలంగాణ లో పాదయాత్ర చేసినా, దాని ప్రభావం పడకపోవడం పార్టీకి కొంత నష్టమే అని చెప్పాలి.  

దీని ప్రభావం పీసీసీ అద్యక్షుడు రేవంత్ రెడ్డిపై పడుతుంది. ఆయనకు వ్యతిరేకంగా పార్టీలోని కొన్ని గ్రూపులు పనిచేస్తున్నాయి. వారు మరింత క్రియాశీలకం అయి అదిష్టానానికి పిర్యాదులు చేయవచ్చు. ఈయన పీసీసీ అద్యక్షుడు అయ్యాక జరిగిన రెండు ఉప ఎన్నికలలో కాంగ్రెస్ కు డిపాజిట్ పోవడం రేవంత్ కు అప్రతిష్ట తెచ్చే అంశమే అవుతుంది.బీజేపీ అభ్యర్ది సోదరుడు, భువనగిరి కాంగ్రెస్ ఎమ్.పి  కోమటిరెడ్డి వెంకటరెడ్డి తీరు కూడా చర్చనీయాంశం అయింది. ఆయన తన సోదరుడికి అనుకూలంగా పరోక్షంగా ప్రచారం చేశారన్న ఆరోపణలు వచ్చాయి. ఆయనకు క్రమశిక్షణ సంఘం నోటీసు కూడా ఇచ్చింది.ఈ పరిణామం  కూడా కాంగ్రెస్కు నష్టం చేసింది. వెంకటరెడ్డి కాంగ్రెస్ లో కొనసాగుతారా?లేక బీజేపీలోకి వెళతారా అన్నది తేలవలసి ఉంది.

ఎన్నో గుణపాఠాలు
కాంగ్రెస్ అభ్యర్ధికి ఆర్దిక బలం అంతంత మాత్రమే ఉంది. కాంగ్రెస్ ఎక్కువ ఓట్లు చీల్చకపోతే తమకు నష్టం వాటిల్లుతుందని టీఆర్‌ఎస్‌ ఈమెకు ఆర్దిక సాయం చేశారన్న ఆరోపణలను బీజేపీ గుప్పిస్తోంది. అందులో కొంత వాస్తవం ఉండవచ్చన్న అభిప్రాయం ఉంది. ఒకప్పుడు అత్యంత బలమైన పార్టీగా ఉన్న కాంగ్రెస్ , తెలంగాణ ఆవిర్భావం తర్వాత కోలుకోలేని విధంగా మారింది.ల పెద్దగా ఉనికి లేని బీజేపీ రెండో స్థానంలోకి వచ్చి టీఆర్‌ఎస్‌ కు సవాలు విసురుతూ కాంగ్రెస్ ను వెనక్కి నెడుతోంది. తెలంగాణలో ఇప్పటికీ కాంగ్రెస్ కే క్యాడర్ అదికంగా ఉంది. అది బీజేపీ వైపు వెళ్లకుండా చూసుకోవడం కూడా కాంగ్రెస్‌కు సవాలే. మొత్తం మీద మూడు పార్టీలకు మునుగోడు ఉప ఎన్నిక కొత్త గుణపాఠాలను నేర్పిందని అనుకోవచ్చు. 
- పొలిటికల్ ఎడిటర్, సాక్షి డిజిటల్
feedback@sakshi.com

Read latest Politics News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top