ఇక ‘పంచాయతీ’ సమరం!  | Sakshi
Sakshi News home page

ఇక ‘పంచాయతీ’ సమరం! 

Published Thu, Dec 7 2023 4:46 AM

Telangana Election Commission On Panchayat Elections - Sakshi

సాక్షి, హైదరాబాద్‌: రాష్ట్రంలో అసెంబ్లీ ఎన్నికల సమరం ముగిసింది. గ్రామ పంచాయతీ ఎన్నికలకు రంగం సిద్ధమౌతోంది. ప్రస్తుత గ్రామ పంచాయతీ పాలకమండళ్ల పదవీకాలం ఫిబ్రవరి 1తో ముగియనున్న నేపథ్యంలో.. ఎన్నికల నిర్వహణకు సంబంధించిన సన్నాహాల్లో రాష్ట్ర ఎన్నికల సంఘం (ఎస్‌ఈసీ) నిమగ్నమైంది. రాజ్యాంగం ప్రకారం పంచాయతీరాజ్‌ (పీఆర్‌) సంస్థల ఐదేళ్ల పదవీకాలం ముగియడానికి ముందే, నూతన తెలంగాణ పంచాయతీరాజ్‌ చట్టం ప్రకారం పీఆర్‌ సంస్థల టర్మ్‌ ముగియడానికి మూడు నెలల ముందే ఎన్నికలు పూర్తిచేయాల్సి ఉంటుంది.

దీంతో జనవరిలో లేదా ఫిబ్రవరిలో మూడు దశల్లో పంచాయతీ ఎన్నికల నిర్వహణకు అనుమతినివ్వాల్సిందిగా రాష్ట్ర ప్రభుత్వానికి ఎన్నికల షెడ్యూల్‌తో సహా ప్రతిపాదనలు పంపించనున్నట్టు ఎస్‌ఈసీ వర్గాలు వెల్లడించాయి. దాదాపు నెల రోజుల పాటు ఈ ఎన్నికల ప్రక్రియ సాగనుంది. అయితే వచ్చే మార్చి, ఏప్రిల్‌లలో లోక్‌సభ ఎన్నికలు జరిగే అవకాశాలుండటం, ఆ ఎన్నికలకు సంబంధించిన ఏర్పాట్లు చేయాల్సి ఉన్నందున ఈలోగా రాష్ట్రంలో పంచాయతీ ఎన్నికల నిర్వహణ సాధ్యం కాదనే వాదన కూడా వినిపిస్తోంది.  

కొత్త సర్కార్‌ కుదరదంటుందా? 
పంచాయతీ ఎన్నికల తేదీలపై తుది నిర్ణయం రాష్ట్ర ప్రభుత్వానిది కావడంతో, వెంటనే మరో ఎన్నికల సమరానికి కొత్త ప్రభుత్వం మొగ్గు చూపక పోవచ్చుననే అభిప్రాయాన్ని ఉన్నతాధికారులు వ్యక్తం చేస్తున్నారు. కాంగ్రెస్‌ తన ఎన్నికల ప్రణాళికలో స్థానిక సంస్థల్లో రిజర్వేషన్లను 42 శాతానికి పెంచుతామని, ఉప కులాల వారీగా కూడా రిజర్వేషన్లు ఇస్తామని, ఆరు నెలల్లో దీనికి సంబంధించి బీసీ కమిషన్‌ నివేదిక తెప్పించుకున్నాక తదుపరి చర్యలు చేపడతామని స్పష్టం చేసింది.

ఈ నేపథ్యంలోనే కాంగ్రెస్‌ ప్రభుత్వం పంచాయతీ ఎన్నికలపై ఎలాంటి నిర్ణయం తీసుకుంటుందోనన్న సందేహాలు వ్యక్తమవుతున్నాయి. వకుళాభరణం కృష్ణమోహన్‌ నేతృత్వంలోని బీసీ కమిషన్‌ విచారణ జరిపి ప్రభుత్వానికి నివేదిక ఇవ్వాల్సిఉంది. అయితే ఈ ప్రక్రియ పూర్తవడానికి కొంత సమయం పట్టొచ్చునని అంచనా వేస్తున్నారు. 

వరుసగా జీపీ, ఎంపీపీ, జెడ్పీపీ, మున్సిపల్‌ పోల్స్‌
రాష్ట్రంలో గ్రామీణ, పట్టణ స్థానిక సంస్థల ఎన్నికల్లో భాగంగా తొలుత గ్రామ పంచాయతీ (జీపీ), ఆ తర్వాత కొన్ని నెలలకే మండల, జిల్లా ప్రజా పరిషత్‌ (ఎంపీపీ, జెడ్పీపీ), మరికొన్ని నెలల తర్వాత మున్సిపల్‌ ఎన్నికలు జరగాల్సి ఉంది. జీపీ ఎన్నికల నిర్వహణకు రిటర్నింగ్‌ ఆఫీసర్లు, పోలింగ్‌ సిబ్బంది ఎంపిక, నియామకం అనేది కీలకమైన నేపథ్యంలో ఈ నెల 30 లోగా దీనికి సంబంధించిన కసరత్తు పూర్తి చేయాల్సిందిగా జిల్లా కలెక్టర్లను ఎస్‌ఈసీ ఆదేశించింది.

ఈ ప్రక్రియకు సంబంధించి అనుసరించాల్సిన విధానంపై, ఈ ఎన్నికల నిర్వహణపై శిక్షణ తదితర అంశాలపై జిల్లా కలెక్టర్లకు ఎస్‌ఈసీ కార్యదర్శి ఎం.అశోక్‌కుమార్‌ సర్క్యులర్‌ పంపించారు. పోలింగ్‌ బూత్‌లలో 200 మంది ఓటర్లకు ఒక ప్రిసైడింగ్‌ అధికారి, ఒక పోలింగ్‌ అధికారిని నియమించాలని సూచించారు.

201 నుంచి 400 ఓటర్ల దాకా ఒక ప్రిసైడింగ్‌ అధికారి, ఇద్దరు పోలింగ్‌ అధికారులను, 401 నుంచి 650 వరకు ఓటర్లకు ఒక ప్రిసైడింగ్‌ అధికారి, ముగ్గురు పోలింగ్‌ అధికారులను నియమించాలని తెలిపారు. ఏదైనా వార్డులో ఓటర్ల సంఖ్య 650 దాటితే రెండు పోలింగ్‌ బూత్‌లను ఏర్పాటు చేయాలని స్పష్టం చేశారు. గతంలో మాదిరిగా ప్రతి జిల్లాలో మూడు విడతలుగా ఎన్నికల నిర్వహణకు ఎస్‌ఈసీ ఏర్పాట్లు చేస్తున్నందున, మొదటి దశలో ఎన్నికలు నిర్వహించిన రిటర్నింగ్, ప్రిసైడింగ్, పోలింగ్‌ ఆఫీసర్ల సేవలను మూడో దశ ఎన్నికల నిర్వహణకు ఉపయోగించుకోవాలని సూచించారు.    

Advertisement
 
Advertisement