
సాక్షి, హైదరాబాద్: రాజ్యాంగ స్ఫూర్తికి భిన్నంగా టీఆర్‌ఎస్ ప్రభుత్వం సర్పంచ్‌ల అధికారాలకు కత్తెర వేసి, గ్రామ స్వరాజ్యం లక్ష్యాలను నీరు గారుస్తోందని బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్ ధ్వజమెత్తారు. గ్రామీణాభివృద్ధికి కేంద్రం అత్యధిక నిధులు కేటాయిస్తే, రాష్ట్ర సర్కార్ అందుకు భిన్నంగా స్థానిక సంస్థలను నిర్వీర్యం చేస్తోందని మండిపడ్డారు. 2014 టీఆర్‌ఎస్ ఎన్నికల మేనిఫెస్టోలో ‘గ్రామీణాభివృద్ధి, పంచాయతీరాజ్ వ్యవస్థ’ అంశంపై స్థానిక సంస్థలకు అధికారాలు బదలాయిస్తామని పేర్కొందని గుర్తు చేశారు.
మేనిఫెస్టోలో ఇచ్చిన హామీలు నీటి మీద రాతలుగానే మిగిలిపోయాయని, పంచాయతీరాజ్‌ను ఒక విభాగంగా మార్చి పీఆర్ వ్యవస్థను సమీకృత అభివృద్ధి వైపు నడిపించడంలో సర్కార్ విఫలమైందని ఆరోపించారు. రాష్ట్రంలోని సర్పంచులు, స్థానిక సంస్థల ప్రతినిధుల హక్కుల పరిరక్షణకు బీజేపీ రాష్ట్ర నాయకత్వం త్వరలో మౌనదీక్ష చేపడుతోందని, దీనికి సర్పంచ్‌లు పూర్తి మద్దతును ఇవ్వాలని సంజయ్ లేఖలో కోరారు.