
సాక్షి, హైదరాబాద్: కొత్త ఏడాదిలో దూకుడు ప్రదర్శించేందుకు బీజేపీ సిద్ధమవుతోంది. అసెంబ్లీ ఎన్నికలకు మరో రెండేళ్ల సమయం ఉన్నప్పటికీ సీఎం కేసీఆర్ ఒకవేళ ముందస్తు ఎన్నికలకు సిద్ధపడితే వాటిని ఎదుర్కొనేందుకు వీలుగా ఇప్పటి నుంచే సన్నద్ధంగా ఉండేలా కార్యాచరణ రూపొందించుకుంటోంది. టీఆర్‌ఎస్‌కు ప్రత్యామ్నాయం బీజేపీయే అనే అభిప్రాయం ప్రజల్లో ఏర్పడేందుకు వివిధ కార్యక్రమాలతో ముందుకెళ్లాలని నిర్ణయించింది. ప్రజల్లో బీజేపీపట్ల మరింత మద్దతు కూడగట్టేందుకు కేంద్ర హోంమంత్రి అమిత్ షా త్వరలోనే రెండురోజుల రాష్ట్ర పర్యటనకు రానున్నారు.
వైఫల్యాలను ఎండగట్టేలా...
రాష్ట్రంలో వివిధ వర్గాల ప్రజలు ఎదుర్కొంటున్న సమస్యలపై రాజీలేని పోరాటం చేసేందుకు బీజేపీ కసరత్తు చేస్తోంది. ఉద్యోగ నోటిఫికేషన్ల కోసం, నిరుద్యోగ భృతి చెల్లింపు, ఉద్యోగులు, రైతులు, ఎస్సీ, ఎస్టీల సమస్యలపై నిరసనలను చేపట్టనుంది. రాష్ట్రంలోని మూడున్నర లక్షల మంది ప్రభుత్వ ఉద్యోగులు, వారి కుటుంబాలతో ముడిపడిన ఉద్యోగుల విభజన, బదిలీలు, నియామకాల అంశం ప్రస్తుతం హాట్‌టాపిక్‌గా మారడం తెలిసిందే.
ఈ ప్రక్రియను ప్రభుత్వం హడావుడిగా రాష్ట్రపతి ఉత్తర్వుల స్ఫూర్తికి భిన్నంగా చేస్తోందనే వాదనను బలంగా ప్రజల్లోకి తీసుకెళ్లేందుకు బీజేపీ ప్రయత్నిస్తోంది. ఇప్పటికే ఈ విషయంలో రాష్ట్ర ప్రభుత్వ తీరుపై గవర్నర్‌కు ఫిర్యాదు చేసింది. వానాకాలం ధాన్యం కొనుగోలు, పూరిస్థాయిలో దళితబంధు అమలు, ఎస్టీలకు రిజర్వేషన్ల పెంపు, ఉద్యోగ నోటిఫికేషన్ల జారీ, నిరుద్యోగ భృతి వంటి వాటిపై మళ్లీ పెద్ద ఎత్తున ఆందోళనలు చేపట్టాలని బీజేపీ నాయకత్వం నిర్ణయించింది.
త్వరలో రెండో విడత పాదయాత్ర...
బండి సంజయ్ చేపట్టిన తొలివిడత పాదయాత్ర ద్వారా టీఆర్‌ఎస్ ప్రభుత్వ ఏకపక్ష విధానాలు, నిర్ణయాలతో జరుగుతున్న నష్టాన్ని ప్రజల్లోకి బాగా తీసుకెళ్లగలిగినట్లు పార్టీ రాష్ట్ర నాయకత్వం అంచనా వేస్తోంది. రాష్ట్ర ప్రభుత్వం, టీఆర్‌ఎస్ పార్టీపై ప్రజల్లో వ్యక్తమవుతున్న వ్యతిరేకతకు పాదయాత్ర అద్దం పట్టిందనే అభి›ప్రాయంతో ఉంది. స్థానిక ఎమ్మెల్సీ ఎన్నికలు, ఇతర కారణాలతో వాయిదా పడిన రెండోవిడత యాత్రను త్వరలోనే మొదలుపెట్టాలని నిర్ణయించింది.
ఈ ఏడాది చివరకల్లా అన్ని అసెంబ్లీ నియోజకవర్గాల్లో పాదయాత్రను ముగించేలా కార్యాచరణ సిద్ధం చేస్తోంది. మరోవైపు భవిష్యత్ ఉద్యమాల కార్యాచరణ ప్రణాళికపై చర్చించేందుకు ఈ నెల 8న హైదరాబాద్‌లో అన్ని మోర్చాలతో రాష్ట్ర కార్యవర్గ సమావేశం జరగనుంది. అలాగే సంక్రాంతి తర్వాత పార్లమెంటరీ నియోజకవర్గాలవారీగా బీజేపీ సమావేశాలు నిర్వహించనుంది.