కొడుకు డాడీ డాడీ.. తండ్రి ప్యాడీ ప్యాడీ

Telangana: Bandi Sanjay Comments On CM KCR And Minister KTR - Sakshi

సీఎం సీటు కోసం కేటీఆర్, ప్రజల దృష్టి మళ్లించేందుకు కేసీఆర్‌ డ్రామాలు

భిక్షమయ్యగౌడ్‌ చేరిక కార్యక్రమంలో బండి సంజయ్‌ ఎద్దేవా

సాక్షి, న్యూఢిల్లీ: రాష్ట్రంలో సీఎం కేసీఆర్‌ కుటుంబ అవినీతి, అరాచక పాలనతో ప్రజలు విసిగి పోయారని బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు, ఎంపీ బండి సంజయ్‌కుమార్‌ అన్నారు. సీఎం సీటు కోసం కొడుకు డాడీ, డాడీ అంటుంటే.... సీఎం కేసీఆర్‌ ప్యాడీ, ప్యాడీ అంటూ ప్రజల దృష్టి మళ్లించేందుకు ధాన్యం పేరుతో డ్రామాలాడుతున్నారని ఎద్దేవా చేశారు. ప్రజల పక్షాన వారి సమస్యల పరిష్కారం కోసం పోరాడుతూ రాష్ట్రంలో టీఆర్‌ఎస్‌కు బీజేపీ ప్రత్యామ్నాయంగా ఎదిగిందన్నారు.

రాష్ట్రంలో టీఆర్‌ఎస్‌ పాలనను అంతం చేసేందుకు ఇదే ఆఖరి పోరాటం కావాలని, అందుకోసం బీజేపీ పోరాటానికి ప్రజలంతా అండగా నిలవాలన్నారు. ఈ క్రమంలోనే టీఆర్‌ఎస్‌ పాలనను వ్యతిరేకించే ఇతర పార్టీల నేతలంతా కేసీఆర్‌ను ఓడించాలనే లక్ష్యంతోపాటు బీజేపీ గెలుపు కోసం కృషి చేయాలనే సంకల్పంతో పార్టీలోకి వస్తున్నారని సంజయ్‌ చెప్పారు.

ఆలేరు మాజీ ఎమ్మెల్యే, టీఆర్‌ఎస్‌ నేత బూడిద భిక్షమయ్య గౌడ్‌ సహా ఆయన అనుచరులు మంగళవారం ఢిల్లీలో పార్టీ రాష్ట్ర వ్యవహారాల ఇన్‌చార్జి తరుణ్‌ చుగ్, బండి సంజయ్‌ సమక్షంలో బీజేపీలో చేరారు. భిక్షమయ్యకు తరుణ్‌ చుగ్‌ కండువా కప్పి పార్టీ సభ్యత్వం అందించారు. సంజయ్‌ మాట్లాడుతూ రాష్ట్రాన్ని కేసీఆర్‌ సర్వనాశనం చేశారని, ఇచ్చిన ఏ ఒక్క హామీ అమలు చేయలేదని దుయ్యబట్టారు. కేసీఆర్‌ వల్ల రైతులు ఇబ్బంది పడుతున్నారని విమర్శించారు. ధాన్యం కొనేందుకు కేంద్ర ప్రభుత్వం సిద్ధంగా ఉన్నా, కొనుగోలు కేం ద్రాలు ఏర్పాటు చేయాలని చెబుతున్నా వినకుండా సీఎం రాజకీయం చేస్తున్నారని మండిపడ్డారు. 

ఆత్మగౌరవం లేకుండా చేశారు..
తెలంగాణ ఆత్మగౌరవానికి ప్రతీకగా ఉంటుందనే ఉద్దేశంతో 2018లో టీఆర్‌ఎస్‌లో తాను చేరగా ఆ పార్టీ అగ్రనేతలు బడుగు, బలహీనవర్గాలకు ఆత్మ గౌరవం లేకుండా చేశారని భిక్షమయ్య గౌడ్‌ ఆరోపించారు. బలమైన నేతలను బలహీనపర్చి వాళ్ల కాళ్లకు బంధాలు వేస్తున్నారని దుయ్యబట్టారు. రెం డున్నరేళ్లుగా టీఆర్‌ఎస్‌లో అనేక ఇబ్బందులు అనుభవించానని, రాష్ట్రంలోనూ బీజేపీ అధికారంలోకి రావాలని ప్రజలు కోరుకుంటున్నారని తెలిపారు.

బీజేపీ గెలుపులో భాగస్వాములం కావాలనే ఉద్దేశంతోనే పార్టీలో చేరినట్లు చెప్పారు. తరుణ్‌ చుగ్‌ నివాసంలో జరిగిన ఈ కార్యక్రమంలో పార్టీ రాష్ట్ర కోశాధికారి శాంతికుమార్, పార్టీ ఉమ్మడి నల్లగొండ జిల్లా నేతలు సంకినేని వెంకటేశ్వర్‌రావు, శ్యాంసుందర్, దాసరి మల్లేశం తదితరులు హాజరయ్యారు.   

Read latest Politics News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top