
సాక్షి, అమరావతి: స్కిల్ కుంభకోణం నిజమన్నది తెలుగుదేశం పార్టీకి కూడా తెలుసని, అందుకే అసెంబ్లీలో చర్చ జరిగితే నిజాలు బయటపడతాయని కవ్వింపు చర్యలకు పాల్పడుతోందని వైఎస్సార్సీపీపీ నేత, వైఎస్సార్‌సీపీ జాతీయ ప్రధాన కార్యదర్శి విజయసాయిరెడ్డి శనివారం ఒక ప్రకటనలో చెప్పారు. చట్టం ముందు అందరూ సమానమేనని, ఎవ్వరికీ మినహాయింపులు ఉండవని అన్నారు. 74 ఏళ్ల వృద్ధుడిని ఎలా అరెస్ట్ చేస్తారని, ప్రభుత్వంలో ఏదో జరిగితే ఆయనకేం సంబంధమనే వింత వాదనలతో కొందరు న్యాయస్థానం నిర్ణయాన్ని తప్పుబట్టే సాహసం చేస్తున్నారని మండిపడ్డారు.
ఏ నేరం చేయకపోతే నిర్దోషిగా బయటికొస్తారు కదా అని అన్నారు. చంద్రబాబు కేసును తప్పుదోవ పట్టించబోయి మరింత జటిలం చేసుకున్నారని చెప్పారు. ప్రాథమిక ఆధారాలు ఉన్నందునే సీఐడీ కోర్టు రిమాండు విధించిందన్న విషయాన్ని లెక్క చేయకుండా మెయింటెయినబుల్ కాని క్వాష్ పిటిషన్‌తో హైకోర్టులో అక్షింతలు వేయించుకున్నారని తెలిపారు. రాజమండ్రి సెంట్రల్ జైలులో దోమల బెడద లేదని, లార్వా ఆనవాళ్లే లేవని స్వయంగా జైళ్ల డీఐజీనే చెప్పారని తెలిపారు. బహుశా చంద్రబాబు సీఎంగా ఉండగా దోమలపై దండయాత్ర పేరుతో నిధులు మింగేశారన్న కోపంతో దోమలే బయట నుంచి వచ్చి కుట్టేసి పోతున్నాయేమోనని వ్యాఖ్యానించారు.
టీడీపీ రాష్ట్ర అధ్యక్షుడి బెయిల్ పిటిషన్ రద్దయితే లోపలకు వెళ్లి ఇద్దరూ కలిసి జైలులో దోమలపై దండయాత్రలు కొనసాగించవచ్చని ఎద్దేవా చేశారు. సీమెన్స్ కంపెనీ ఒప్పందం ప్రకారం పెట్టుబడి ఎందుకు పెట్టలేదని, ఏ కార్యకలాపాలూ నిర్వహించకపోయినా నిధులెందుకు విడుదల చేశారని ఎల్లో మీడియా చంద్రబాబునే అడగాలన్నారు. వైఎస్సార్‌సీపీ ప్రభుత్వం ఎక్కడా అవినీతికి తావు లేకుండా పని చేస్తోందన్నారు. ఎక్కడ అవకతవకలు జరిగినట్లు తెలిసినా, ఏమాత్రం నిర్లక్ష్యం చూపకుండా చర్యలు తీసుకుంటున్నామని చెప్పారు.