అయోమయంలో బీజేపీ నేతలు
మూడు ఎంపీ, నాలుగు అసెంబ్లీ సీట్లు గ్యారంటీ అంటూ ఎన్నికల సమయంలో ధీమా
పోలింగ్ తర్వాత మారిన బీజేపీ నేతల వైఖరి
బీజేపీ అభ్యర్ధులకి క్రాస్ ఓటింగ్ భయం
టీడీపీ, జనసేన నుంచి సహకారం అందలేదనే భావన
సీనియర్ల నుంచి కూడా అందని సహకారం
ఒక్క సీటు కూడా గెలవలేమనే భావనలో బీజేపీ నేతలు
కూటమిలో చేరి నష్టపోయామంటున్న సీనియర్లు
ఏపీ బీజేపీలో ఓటమి భయం పట్టుకుంది. పోలింగ్ ముందు ఒక లెక్క.. పోలింగ్ తర్వాత మరో లెక్కతో బీజేపీ అంచనాలు పూర్తిగా రివర్స్ అయిపోయాయి. టీడీపీ, జనసేన నుంచి సరైన సహకారం లేకపోవడం, మరోవైపు సొంత పార్టీ సీనియర్ నేతలు దూరంగా ఉండటంతో ఘోర ఓటమి తప్పదనే భావన ఏపీ బీజేపీలో కనిపిస్తోంది.మొత్తంగా కూటమిలో చేరి పూర్తిగా నష్టపోయామనే భావనలో బీజేపీ నేతలు ఉన్నట్టు తెలుస్తోంది. అందుకే కాషాయపార్టీ నేతలెవరూ మీడియా ముందుకు రాలేని పరిస్ధితి. ఈ నేపధ్యంలోనే రాష్ట్ర బీజేపీలో ప్రస్తుతం నిశ్శబ్ధ వాతావరణం కనిపిస్తోంది. పోలింగ్ తర్వాత ఎందుకు బీజేపీ నేతలందరూ సైలెంట్ అయ్యారు.
ఏపీలో పోలింగ్ ముగిసిన తర్వాత వింత పరిస్ఙితి కనిపిస్తోంది. పోలింగ్ ముందు వరకు ఉన్న ఉత్సాహం.. ఆ తర్వాత బీజేపీ నేతలలో కనిపించటం లేదు. కూటమిలో చేరి పూర్తిగా తప్పు చేశామనే భావన కమలనాథుల్లో కనిపిస్తోంది. టీడీపీ, జనసేనతో కూటమిగా జత కట్టిన బీజేపీ ఆరు ఎంపీ స్ధానాలకు, పది అసెంబ్లీ స్ధానాలకు పోటీ చేసింది. వాస్తవానికి కూటమిలో చేరడాన్ని ఏపీకి చెందిన బీజేపీ సీనియర్ల అంతా వ్యతిరేకించారు.
రాష్ట్ర బీజేపీ అధ్యక్షురాలు పురందేశ్వరి కుమ్మక్కు రాజకీయాలతో రాజీ పడాల్సిన దుస్థితి బీజేపీకి ఏర్పడింది. ఈ నేపథ్యంలో తప్పనిసరి పరిస్ధితులలో కూటమిలో చేరిన తర్వాత సీట్లపై మొదట పెద్ద పంచాయితీనే నడిచింది. బీజేపీ పట్టున్న ఎనిమిది ఎంపీ స్ధానాలు, కనీసం 25 అసెంబ్లీ స్దానాలలో పోటీ చేయాలని సీనియర్లు ఒత్తిడి తెచ్చారు. అయితే చంద్రబాబుతో కలిసి కుమ్మక్కు రాజకీయాలు చేసిన పురందేశ్వరి కేవలం ఆరు ఎంపీ, పది ఎమ్మెల్యే స్ధానాలతో సరిపెట్టింది. ఆ తర్వాత టిక్కెట్ల కేటాయింపులలో సీనియర్లకి ప్రాధాన్యత ఇవ్వాలని సీనియర్ నేతలు ఢిల్లీ వరకు వెళ్లారు.
ఇక విశాఖ ఎంపీ స్ధానం కోసం రాజ్యసభ సభ్యులు జీవీఎల్ తీవ్రంగా ప్రయత్నించారు. గత రెండేళ్లగా అధిష్టానం ఆదేశాలతో జీవీఎల్ విశాఖలోనే ఇల్లు కొనుక్కుని అక్కడే ఉంటూ పార్టీ కోసం ఎంతో కృషి చేశారు. ఈ నేపథ్యంలో జీవీఎల్‌కి వెన్నుపోటు పొడుస్తూ తన సోదరుడు బాలకృష్ణ చిన్నల్లుడు భరత్ కోసం పురందేశ్వరి విశాఖ సీటుని వదులుకున్నారు. ఇక విశాఖ దక్కకపోవడంతో కనీసం అనకాపల్లి అయినా దక్కుతుందని జీవీఎల్ భావించినా అక్కడా నిరాశే ఎదురైంది.
ఇక, అనకాపల్లి సీటు కోసం ప్రయత్నించిన మాజీ ఎమ్మెల్సీ పీవీఎన్ మాధవ్‌కు చుక్కెదురైంది. అలాగే ఏలూరు సీటు కోసం దశాబ్ధకాలంగా కష్టపడుతున్న తపనా చౌదరి ఎన్నో ఆశలు పెట్టుకుంటే కూటమి తరపున టీడీపీ అభ్యర్ధిగా మాజీ మంత్రి యనమల అల్లుడు పుట్టా మహేష్ యాదవ్ బరిలోకి దిగారు. ఇక రాజమండ్రిలో పుట్టి నాలుగున్నర దశాబ్ధకాలంగా బీజేపీలో ఉన్న ఏపీ మాజీ అధ్యక్షుడు సోము వీర్రాజుని కాదని పురందేశ్వరి రాజమండ్రి నుంచి బరిలోకి దిగారు. అటు, హిందూపూర్ ఎంపీ లేదా కదిరి స్ధానం కోసం ప్రయత్నించిన విష్టు వర్ధన్ రెడ్డి వంటి నేతకు అవకాశాలు దక్కలేదు.
ఇలా సొంత పార్టీని నమ్ముకుని దశాబ్ధాలుగా రాజకీయాల్లో ఉన్న నేతలను కాదనుకుని ఇతర పార్టీల నుంచి వచ్చిన నేతలకి అవకాశం ఇవ్వడం కూడా బీజేపీలోనే అంతర్గత కుమ్ములాటలకి కారణమైంది. అనకాపల్లి ఎంపీ స్ధానాన్ని స్ధానిక నేతలకు కాకుండా టీడీపీ నుంచి గత ఎన్నికల తర్వాత బీజేపీలో చేరిన కడప జిల్లావాసి సీఎం రమేష్‌ను బరిలోకి దింపడం ఆ పార్టీపై తీవ్ర వ్యతిరేకత పెంచిందని భావిస్తున్నారు. ఎన్నికల ముందు వరకు కూడా అనకాపల్లి సీటు తమదేనని డబ్బాలు కొట్టుకున్న నేతలు పోలింగ్ ముగిసిన తర్వాత చడీచప్పుడూ లేకుండా గప్ చుప్ అయ్యారు. లెక్కలు వేసుకున్న తర్వాత సీఎం రమేష్‌ను బరిలోకి దింపి తప్పు చేశామని బీజేపీ నేతలు భావిస్తున్నారట.
అసలు అనకాపల్లి సీటు కాకుండా విశాక సీటు తీసుకుని ఉంటే గెలుపుపై ధీమా ఉండేదని కూడా ఇపుడు గగ్గోలు పెడుతున్నారట. ఇక విజయవాడ వెస్ట్ నుంచి బ్యాంకులని బురిడీ కొట్టించిన సుజన్ చౌదరిని రంగంలోకి దింపడం ప్రజల్లోకి రాంగ్ సిగ్నల్ పంపేలా చేసిందంటున్నారు. ఇక్కడ సుజానా చౌదరి దింపడం వల్లే దెబ్బ పడిందని భావిస్తున్నారట.
ఇక అనపర్తి, బద్వేలు లాంటి చోట్ల రాత్రికి రాత్రి టీడీపీ నేతలను బీజేపీలో చేర్చుకుని టిక్కెట్ ఇవ్వడంపైనా కాషాయ పార్టీ నేతలే అభ్యంతరం వ్యక్తం చేశారు. అనపర్తిలో మొదటగా మాజీ సైనికుడు శివరామకృష్ణంరాజుకి కేటాయించారు. ఆ తర్వాత సీటుని అనపర్తి టీడీపీ ఇన్‌చార్జ్ నల్లమిల్లి రామకృష్ణరెడ్డిని రాత్రికి రాత్రి తన కారులోనే స్వయంగా పురందేశ్వరి విజయవాడ బీజేపీ కార్యాలయానికి తీసుకొచ్చి పార్టీలో చేర్చుకుని అప్పటికపుడు టిక్కెట్ ప్రకటించారు. కేవలం తన గెలుపుకోసమే పురందేశ్వరి ఈ విధంగా చేశారని బీజేపీ సీనియర్లు మండిపడ్డారు. ఇలా చాలా వరకు సీట్ల ఎంపికలో పురందేశ్వరి.. టీడీపీకి సహకరించారు.
ఇక, అనపర్తి అభ్యర్ధిగా బరిలోకి దిగిన టీడీపీ నేత నల్లమిల్లి కనీసం బీజేపీ కండువా కప్పుకోవడానికి కూడా ఇష్టపడకుండా పలుసార్లు ప్రచారం చేయడం కూడా బీజేపీని అయోమయానికి గురిచేసింది. ఇదే సమయంలో కమలదల సీనియర్లు జీవీఎల్, సోము వీర్రాజు, విష్ధువర్ధన్ రెడ్డి లాంటి వాళ్లు ఎక్కడా ప్రచారంలో కనిపించలేదు. సీనియర్ నేతలంతా కూడా జరుగుతున్న పరిణామాలపై తీవ్ర అసంతృప్తితోనే ఎన్నికల ప్రచారంలో పాల్గొలేదని తెలుస్తోంది. ఇక ప్రధాని మోదీ, హోమంత్రి అమిత్ షా, నడ్డా లాంటి అగ్రనేతలు ప్రచారం చేసినపుడు మాత్రం సభలలో కనిపించి సీనియర్లు మమా అనిపించారు. దీంతో, బీజేపీ పూర్తిగా ఆత్మ రక్షణలో పడింది. ఇలా వరుస తప్పిదాలతో అవకాశాలున్న చోట కూడా బీజేపీ విజయావకాశాలను జార విడుచుకుందని రాజకీయ విశ్లేషకులు చెబుతున్నారు. ఇక, కొన్ని స్థానాల్లో బీజేసీకి క్రాస్ ఓటింగ్ భయం కూడా పట్టుకుంది.
దీనికి తోడు బీజేపీ పోటీ చేసిన చోట టీడీపీ, జనసేన ఓటు పూర్తిగా బదిలీ కాకపోవడం కూడా కొంపముంచిందంటున్నారు. తమకు టికెట్ ఇవ్వకుండా ఇతర పార్టీల నుంచి వచ్చిన వారికి టికెట్ ఇవ్వడాన్ని వారు జీర్ణించుకోలేకపోయారు. దీంతో, ఎన్నికలపై కమలనాథులు ఎవరూ మనస్పూర్తిగా పనిచేయలేదు. అంతేకాకుండా చంద్రబాబు అబద్దపు అలవుకాని హామీలతో రిలీజ్ చేసిన మేనిఫెస్టో కూడా కొంత కొంప ముంచిందంటున్నారు. ఈ మేనిఫెస్టోతో తమకు సంబంధం లేదని బీజేపీ నేతలు ప్రచారం చేసినా ఓటర్లని ఆకట్టుకోలేకపోయామంటున్నారు. ఆఖరికి మేనిఫెస్టో విడుదల సమయంలో చంద్రబాబు ఇస్తున్న మేనిఫెస్టోని పట్టుకోవడానికి బీజేపీ ఇన్‌చార్జ్ ఇష్టపడలేదు.
ఇదిలాఉండగా.. ఎన్నికల ప్రచార సమయంలో అనకాపల్లి, రాజమండ్రి, నరసాపురం ఎంపీ స్ధానాలతో పాటు మరో మూడు, నాలుగు అసెంబ్లీ స్ధానాలు తమకు గ్యారంటీ అని భావించినా పోలింగ్ ముగిసిన తర్వాత మాత్రం తగిన అంచనాలకు రాలేకపోతున్నారు. అధికార పార్టీపై ఆశించిన స్ధాయిలో వ్యతిరేకత కనిపించకపోవడం, మహిళా ఓటర్లు పెద్ద సంఖ్యలో వచ్చి ఓట్లు వేయడంతో బీజేపీని ఓటమి భయం వెంటాడుతోంది. పోలింగ్ ముగిసి లెక్కలు వేసుకున్న తర్వాత కనీసం ఒక్క సీటు కూడా రాదేమోననే ఆందోళన కాషాయ పార్టీ నేతలలో కనిపిస్తోంది. ఈ క్రమంలో ఒక్క నాయకుడు కూడా మీడియా ముందుకు వచ్చి తాము గెలుస్తామని చెప్పలేకపోతున్నారనే టాక్ నడుస్తోంది.
Comments
Please login to add a commentAdd a comment