గవర్నర్‌నూ బ్లాక్‌మెయిల్‌ చేస్తున్న నిమ్మగడ్డ

Peddireddy Ramachandra Reddy Comments On Nimmagadda Ramesh - Sakshi

నిమ్మగడ్డ లేఖలన్నీ దమ్మాలపాటి శ్రీనివాస్‌ రాసినవే 

పంచాయతీరాజ్‌శాఖ మంత్రి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి 

సాక్షి, అమరావతి: రాష్ట్ర గవర్నర్‌ను సైతం ఎన్నికల కమిషనర్‌ నిమ్మగడ్డ రమేష్ కుమార్‌ బ్లాక్‌ మెయిల్‌ చేస్తున్నారని పంచాయతీరాజ్‌ శాఖ మంత్రి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి చెప్పారు. తనతో పాటు మంత్రి బొత్స సత్యనారాయణ, వైఎస్సార్‌సీపీ ప్రధాన కార్యదర్శి సజ్జల రామకృష్ణారెడ్డి, ఎంపీ విజయసాయిరెడ్డిపై  చర్యలు తీసుకోవాలంటూ గవర్నర్‌కు నిమ్మగడ్డ లేఖ రాశారని తెలిపారు. దీంతోపాటు ఆయన రాసిన లేఖలన్నీ టీడీపీకి చెందిన దమ్మాలపాటి శ్రీనివాస్‌ రాసినవేనని తమకు కొందరు చెప్పారన్నారు. తన లేఖపై చర్యలు తీసుకోకపోతే కోర్టుకు వెళ్తానంటూ గవర్నర్‌ను సైతం బ్లాక్‌ మెయిల్‌ చేసేలా రాశారని చెప్పారు. లేఖలు ఎవరు రాస్తున్నారనేది ఎస్‌ఈసీ సమాధానం చెప్పాలన్నారు. పెద్దిరెడ్డి శుక్రవారం సాక్షి ప్రతినిధితో మాట్లాడారు. పంచాయతీ ఎన్నికలకు చంద్రబాబు మేనిఫెస్టోను విడుదల చేయడంపై నిమ్మగడ్డ జవాబు చెప్పాలన్నారు.

ఏపీ పంచాయతీరాజ్‌ చట్టం సెక్షన్‌ 202 ప్రకారం పంచాయతీ ఎన్నికలను ఎవరూ పొలిటికల్‌ చేయకూడదని చెప్పారు. మామీద లేఖలు రాసే నిమ్మగడ్డ.. చంద్రబాబు మేనిఫెస్టోపై ఎందుకు స్పందించడం లేదని ప్రశ్నించారు. సంజాయిషీ కూడా తీసుకోలేదన్నారు. రోజూ చంద్రబాబు ఏం మాట్లాడుతున్నాడో అవే అంశాలను లేఖలో ప్రస్తావించి గవర్నర్‌కు పంపారని చెప్పారు. ఇదంతా కుట్రపూరితంగా జరుగుతోందన్నారు. నిమ్మగడ్డ ఎన్నికల అధికారిగా కాకుండా, చంద్రబాబు రుణం తీర్చుకునేందుకే పనిచేస్తున్నాడని విమర్శించారు. రెండు నెలల తర్వాత ఆయన టీడీపీలో చేరి, ఆ పార్టీ తరఫున పోటీచేస్తాడేమో.. ఆ సమయానికి టీడీపీ ఉంటుందో లేదోనని ఎద్దేవా చేశారు. రాష్ట్ర ఎన్నికల అధికారులు ఎవరూ జిల్లాల్లో పర్యటించలేదని, నిమ్మగడ్డ రమేష్‌ జిల్లాల్లో పర్యటిస్తూ అధికారులను భయభ్రాంతులకు గురిచేసే ప్రయత్నం చేస్తున్నాడని చెప్పారు.   

Read latest Politics News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top