మరోసారి బయటపడ్డ లోకేష్‌ బండారం

Nara Lokesh Wrong Tweets On YSRCP Leaders - Sakshi

సాక్షి​, చిత్తూరు : గత అసెంబ్లీ ఎన్నికల్లో దారుణ ఓటమికి గురైన టీడీపీ అధ్యక్షుడు నారా చంద్రబాబు నాయుడు, కుమారుడు నారా లోకేష్‌ ట్విటర్‌ వేదికగా రాజకీయాలు చేస్తూ అసత్యాలు ప్రచారం చేస్తున్నారు. వాస్తవాలు తెలుసుకోకుండా హైదరాబాద్‌లో కూర్చుని చేతికొచ్చింది రాసుకుంటూ సోషల్‌ మీడియాలో అబాసుపాలవుతున్నారు. గతంలోనూ ఇలాంటి చర్యలకు పాల్పడ్డ లోకేష్‌కు గత ఎన్నికల్లో మంగళగిరి ప్రజలు తగిన బుద్ధి చెప్పినప్పటికీ తీరు మార్చుకోవడంలేదు. తాజాగా మరోసారి ట్విటర్‌ వేదికగా ప్రజలను తప్పుదోవ పట్టించే విధంగా అసత్య పోస్టింగులు పెట్టి విమర్శలను ఎదుర్కొంటున్నారు. (లోకేష్‌కు లీగల్‌ నోటీసులు)

చిత్తూరు జిల్లాలకు చెందిన  ఆంధ్రప్రభ విలేఖరి వెంకటనారాయణ విషయంపై ఇటీవల లోకేష్‌ ఓ ట్వీట్‌ చేశారు.  విలేఖరిపై కొందరు వ్యక్తులు దాడి చేస్తున్న వీడియోను పోస్ట్‌ చేస్తూ.. అధికార వైఎస్సార్‌సీపీకి చెందిన వ్యక్తులే ఈ దాడికి పాల్పడ్డారంటూ ఆరోపించారు. దీనిపై దర్యాప్తు చేపట్టిన చిత్తూరు ఎస్పీ వాస్తవాలను రాబట్టారు. లోకేష్‌ చేసినవి అబద్దపు ట్వీట్లని మరోసారి అసత్య ప్రచారాన్ని బయటపెట్టారు. ఈ మేరకు ఎస్పీ ట్వీట్‌ ద్వారా అసలు విషయాన్ని తెలిపారు.

ఎస్పీ సమాచారం ప్రకారం.. బాలికపై హెచ్ఎం లైంగిక వేధింపుల కేసులో విలేఖరి వెంకట నారాయణ జోక్యం చేసుకుంటున్నాడు. తనకున్న పరిచయాలతో ఆయన్ని కేసు నుంచి తప్పించేందుకు ప్రయత్నిస్తున్నాడు. ఈ నేపథ్యంలో నారాయణపై ఆగ్రహంతో బాలిక తండ్రి, మరికొందరు వ్యక్తులు దాడికి పాల్పడ్డారు. పోలీసుల రంగ ప్రవేశంతో ఘటనలో ముగ్గురి వ్యక్తులపై సోమల పోలీస్టేషన్‌లో కేసు నమోదు చేసి.. తక్షణమే ముద్దాయిలను అరెస్ట్ చేశారు. దీంతో లోకేష్ బండారం బయటపడింది. (మండలిలో గూండాగిరి)

తండ్రీ కొడుకులిద్దరికీ ప్రజలు బడితె పూజ..
తాజా వివాదంపై మంత్రి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. చిన్నారిపై లైంగిక వేధింపులను లోకేష్‌ సమర్థిస్తున్నారా? అని ప్రశ్నించారు.  ఈ మేరకు సోమవారం పత్రికా ప్రకటన విడుదల చేశారు. ‘చంద్రబాబు చదువుకున్న రాజకీయ స్కూల్‌లోనే లోకేష్‌కూడా చదువుకున్నారు. అందువల్ల ఉదాత్తమైన రాజకీయాలు లోకేష్‌చేస్తాడని ఎవ్వరూ అనుకోరు అబద్ధాలు, విషప్రచారాలు, ఆధారాల్లేని ఆరోపణలతో రాజకీయంగా ఎదిగిన చంద్రబాబు, తన కొడుకును కూడా అదే దారిలో నడిపిస్తున్నారు. వీరిద్దరి వ్యవహార శైలి ఈ రాష్ట్రానికి శాపం. చిత్తూరులో ఒకరి ఇంటిపై కొందరు వ్యక్తులు దాడిచేసిన ఘటనను నాపై రుద్దే ప్రయత్నం చేస్తున్నారు. చంద్రబాబే కాదు.. లోకేష్‌బుర్ర కూడా విషంతో నిండిపోయింది.

ఒక చిన్నారిని లైంగికంగా వేధించిన కేసులో ఒక హెడ్‌మాస్టర్‌పై చట్టప్రకారం చర్య తీసుకున్నారు. ఈ వ్యవహారంలో సంబంధిత పత్రికా విలేఖరి వ్యవహారం నడపాలని చూస్తే ఆ చిన్నారి తల్లిదండ్రులు ఆగ్రహించి దాడికి దిగారు. పోలీసులు చర్య తీసుకుని, దాడికి దిగిన వారిపై చట్టప్రకారం చర్యలు తీసుకున్నారు. ఈ వ్యవహారాన్ని నాపై రుద్దడం అవివేకం. పరనిందలు, ఆధారాల్లేని ఆరోపణలతో ట్వీట్లు మీద ట్వీట్లు పెట్టే మీ శైలేంటో ప్రజలకు మీరే చెప్పుకుంటున్నారు. ఇలాంటి విష రాజకీయాలు చేస్తే ప్రజలు చెప్పులతో కొట్టే రోజు వస్తుంది. నిర్మాణాత్మక విమర్శలు చేయండి, స్వాగతిస్తాం. ఆధారాల్లేని ఆరోపణలు చేస్తే.. తండ్రీ కొడుకులిద్దరికీ ప్రజలు బడితె పూజ చేస్తారు.’ అని ఘాటు వ్యాఖ్యలు చేశారు.

 

Read latest Politics News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top