
సాక్షి, అమరావతి: దళిత మేధావుల పేరుతో కొంతమంది విజయవాడలో ఏర్పాటు చేసిన రౌండ్ టేబుల్ సమావేశానికి జైభీమ్ అనే పేరు కంటే.. జై చంద్రబాబు రౌండ్ టేబుల్ సమావేశం అని పెడితే బాగుండేదని వైఎస్సార్‌సీపీ పార్లమెంటు సభ్యులు నందిగం సురేష్ అన్నారు. ఆ సమావేశంలో చదివిన స్క్రిప్ట్ అంతా చంద్రబాబుదేనని ఆయన మండిపడ్డారు. ఆయన డైరెక్షన్‌లోనే నిర్వాహకులు నడిచారన్నారు. అది చంద్రబాబు భజన కోసం ఏర్పాటు చేసుకున్న కార్యక్రమమే తప్ప దళితులకు మేలు చేసేది కాదన్నారు. తాడేపల్లిలోని వైఎస్సార్‌సీపీ కేంద్ర కార్యాలయంలో సోమవారం ఆయన విలేఖరుల సమావేశంలో మాట్లాడారు. చంద్రబాబు హయాంలో టీడీపీ నాయకులు దళితులపై చేసిన దాడులు, దారుణాలపై మాజీ ఎంపీ హర్ష కుమార్, శ్రావణ్ కుమార్ ఏనాడు స్పందించలేదని మండిపడ్డారు. చంద్రబాబు డైరెక్షన్‌లో కాకుండా, తనకంటూ సొంత అజెండా ఉందని చెప్పే సత్తా హర్షకుమార్‌కు ఉందా అని నిలదీశారు. ఆయన ఇంకా ఏమన్నారంటే..
► 14 ఏళ్ల చంద్రబాబు హయాంలో దళితులకు ఎంత మేలు జరిగిందో, ఏడాదిన్నర సీఎం వైఎస్ జగన్ పాలనలో ఎంత మేలు జరిగిందో చర్చిద్దామా?. దమ్ముంటే డేటు, టైం ఫిక్స్ చేయండి. మీతో పాటు చంద్రబాబు, లోకేష్‌ను కూడా తీసుకురండి. ఎప్పుడైనా, ఎక్కడైనా మేము చర్చకు సిద్ధం.
► సీఎం జగన్ పరిపాలనలో ఎస్టీ, ఎస్సీ, బీసీ, మైనార్టీల మేలుకు చేసే కార్యక్రమాలకు అడ్డుపడకుండా ఆ భగవంతుడు చంద్రబాబుకు మంచి బుద్ధి ప్రసాదించాలి.
► దళితులకు సొంత ఇళ్లు ఉండకూడదు, ఎప్పటికీ బానిసల్లా, పాలేర్లుగా ఉండాలన్నదే బాబు కుట్ర.
► హర్షకుమార్, శ్రావణ్ కుమార్‌లు చంద్రబాబుకు కొమ్ముకాస్తే చరిత్రహీనులుగా మిగులుతారు. మీలానే గతంలో చంద్రబాబు చంకనెక్కి ఆ తర్వాత భూగర్భంలో కలిసిపోయినవారు చాలామంది ఉన్నారు.
► కుళ్లు, కుట్ర, మోసం, వెన్నుపోటు అంటే దేశంలో చంద్రబాబు పేరే చెప్తారు. చంద్రబాబు, లోకేష్ లాంటి వ్యక్తులను నమ్ముకుని దళితుల జీవితాలతో హర్షకుమార్, శ్రావణ్ కుమార్ చెలగాటమాడొద్దు.