బీజేపీ రాజకీయ వ్యభిచారానికి దిగుతోంది

Minister Vellampalli Srinivas Fires On BJP - Sakshi

మంత్రి వెల్లంపల్లి శ్రీనివాస్‌

సాక్షి, తాడేపల్లి : గత 2,3 రోజుల నుంచి తిరుపతి ఎన్నికల్లో లబ్ది పొందాలని బీజేపీ పగటి కలలు కంటోందని, రాజకీయ వ్యభిచారానికి దిగుతోందని మంత్రి వెల్లంపల్లి శ్రీనివాస్‌ మండిపడ్డారు. చాలా మంది నాయకులు ప్రభుత్వంపై, తనపై విమర్శలకు దిగుతున్నారన్నారు. బుధవారం ఆయన మీడియాతో మాట్లాడుతూ.. ‘‘ ఈ రోజు మీరు ధర్నా చేసిన దేవాలయాలు కూల్చినప్పుడు ఎవరు మంత్రిగా ఉన్నారు. ఆ రోజు మీరు టీడీపీతో అంటకాగి.. పుష్కరాల పేరుతో దేవాలయాలను కూల్చిన దుర్మార్గం మీది కాదా?. ఆ రోజు దేవాలయాల కూల్చివేతను అడ్డుకునేందుకు బంద్‌కి పిలుపునిస్తే మీరు ముఖం చాటేశారు. ఆ దేవాలయాలను నిర్మించడానికి ఈ రాష్ట్ర ప్రభుత్వం ఆదేశాలు ఇచ్చింది.

 రాష్ట్ర ప్రభుత్వానికి ఎక్కడ పేరు వస్తుందో అని ఈ రోజు ధర్నా చేశారు. దేవాదాయ భూములు అన్యాక్రాంతం అయ్యాయని అంటున్నారు. వైఎస్ జగన్ సీఎం అయ్యాక ఏ ఒక్క ఎకరం అయినా అన్యాక్రాంతం అయ్యిందా?. మీరు టీడీపీతో అంటకాగుతున్నపుడు దుర్గ గుడి భూములను సిద్ధార్థ కాలేజీ వారికి కట్టబెట్టలేదా?. మంత్రాలయంలో 200 ఎకరాలు అమ్ముకోవచ్చు అని ఆదేశాలు ఇచ్చింది ఆనాటి మంత్రి మాణిక్యాలరావు కాదా?. సదావర్తి భూములు 83 ఎకరాలు అమ్మకానికి పెట్టింది వాస్తవం కాదా?. అమరావతి అమరేశ్వరుని భూములను అమ్ముకోవాలని చూసింది మీరు కాదా?. జేసీ దివాకర్ రెడ్డి వ్యవసాయ కళాశాలకు దేవాదాయ భూములు కట్టబెట్టింది మీరు కాదా?. ఇన్ని చేసి ఈ ప్రభుత్వాన్ని హిందూ వ్యతిరేక ప్రభుత్వం అని చూపాలని మీరు ప్రయత్నం చేస్తున్నారు. చర్చికి, మసీదుకు డబ్బులిచ్చారు అంటున్నారు. ( వీడియోలో అడ్డంగా దొరికిపోయిన చంద్రబాబు!)

దుర్గ గుడి అభివృద్ధికి ఇచ్చిన 70 కోట్ల రూపాయల నిధులు మీకు కనిపించడం లేదా?. జై శ్రీరాం అనేది మీ ఒక్కరిదేనా ఏమిటి?. ఆ రోజు నేను ధర్నా చేస్తే ఏ ఒక్కరూ సపోర్ట్ చేయలేదు. మీరు టీడీపీతో కలిసి నాతో రాకపోతేనే కదా నేను బీజేపీని వీడింది. గోశాలను 70 లక్షలతో మా ప్రభుత్వం అభివృద్ధి చేస్తోంది. ఇవన్నీ చేస్తున్నందుకు నేను రాజీనామా చేయాలా?. మీరెప్పుడన్నా ప్రజా క్షేత్రంలో గెలిచారా?. నేను హిందూ మతాన్ని ఆచరిస్తాను.. ఇతర మతాలను గౌరవిస్తా.. మీరెవరు నేను దర్గాకు వెళితే ప్రశ్నించడానికి? ఈ రోజు దేవాలయాలపై దాడులు కేవలం ప్రతిపక్షం పనే. హిందూ దేవాలయాల గురించి మాట్లాడే అర్హత బీజేపీ, టీడీపీ, జనసేనలకు లేద’’ని అన్నారు.

Read latest Politics News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top