‘మోదీగారు.. వంటగ్యాస్‌ ధర తగ్గించండి’.. సబితా ఇంద్రారెడ్డి గట్టి కౌంటర్‌

Minister Sabitha Indra Reddy Counter To PM Modi Over Gas Prices Hike - Sakshi

చీపుళ్లు తిరగేస్తారనే భయంతోనే బీజేపీ సభకు మహిళల్ని పిలవలేదు

గ్యాస్, ఇంధన ధరలు తగ్గేవరకు బీజేపీ నాయకుల్ని తరిమి కొట్టండి 

టీఆర్‌ఎస్‌ పార్టీ మహాధర్నాలో మంత్రి సబితారెడ్డి  

మీర్‌పేట: ప్లీజ్‌ తెలంగాణలో ఒక్కసారి అధికారం ఇవ్వండని బీజేపీ నాయకుల అభ్యర్థనకు ‘ప్లీజ్‌ మోదీగారు వంటగ్యాస్, ఇంధన ధరలు తగ్గించండి’ అంటూ రాష్ట్ర విద్యాశాఖ మంత్రి సబితా ఇంద్రారెడ్డి గట్టి కౌంటర్‌ ఇచ్చారు. దేశంలో నిత్యం పెరిగిపోతోన్న గ్యాస్‌ ధరలను నిరసిస్తూ ఆదివారం రంగారెడ్డి జిల్లా మీర్‌పేటలో టీఆర్‌ఎస్‌ పార్టీ ఆధ్వర్యంలో మహాధర్నాను నిర్వహించారు. ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ.. చీపుళ్లు తిరగేస్తారనే భయంతోనే తుక్కుగూడలో జరిగిన బీజేపీ సభకు మహిళలను ఆహ్వానించలేదన్నారు.

తెలంగాణ ఏర్పడ్డాక సీఎం కేసీఆర్‌ మంత్రి కేటీఆర్‌ ఒక్కో రంగాన్ని ఎంచుకుని అభివృద్ధి చేస్తున్నారని తెలిపా రు. కల్యాణలక్ష్మి, రైతుబంధు, వృద్ధులు, ఒంటరి మహిళలకు ప్రతి నెలా రూ.2వేల పింఛను ఇస్తుంటే..మరి కేంద్రం గ్యాస్‌ ధరలు ఎందుకు తగ్గించడం లేదని మహిళలు ప్రశ్నిస్తున్నారని పేర్కొన్నారు. బీజేపీ సభలో అమిత్‌షా రాష్ట్రానికి, ప్రజలకు ఉపయోగపడేది ఏ ఒక్కటీ మాట్లాడలేదని.. అసలు సభ ఎందుకు పెట్టినట్లని ఆమె సూటిగా ప్రశ్నించారు. 

బాలాపూర్‌ చౌరస్తాలో టీఆర్‌ఎస్‌ శ్రేణుల మహాధర్నా. (ఇన్‌సెట్‌లో) కట్టెలపొయ్యిపై వంట చేస్తున్న మంత్రి సబిత 
 

రానున్న రోజుల్లో మహిళల ఆగ్రహానికి బీజేపీ గురికాకతప్పదని హెచ్చరించారు. హిందూ, ముస్లింల పేరిట విద్వేషాలు రెచ్చగొట్టడం తప్ప చేసిన అభివృద్ధి ఏమీ లేదన్నారు. బీజేపీ నాయకులు ప్రజల్లోకి వస్తే గ్యాస్, ఇంధన ధరలు తగ్గించేంత వరకు తమ వద్దకు రావద్దని మహిళలే వారిని తరిమి కొట్టాలని మంత్రి పిలుపునిచ్చారు. రాష్ట్రంలో బీజేపీ అధికారంలోకి రాగానే జీవో నంబర్‌ 111ను ఎత్తివేస్తామని బండి సంజయ్‌ చెప్పారని, దానిపై ఆయనకు అవగాహన లేదని, ఓ వైపు 111 జీవోను ఎత్తివేస్తేనే ప్రజలు సంబరాలు చేసుకుంటున్నారని చేవెళ్ల ఎంపీ రంజిత్‌రెడ్డి పేర్కొన్నారు.

రాష్ట్రానికి అన్ని రూ.కోట్లు ఇచ్చామంటూ కిషన్‌రెడ్డి, అమిత్‌షా పచ్చి అబద్ధాలు మాట్లాడారని దుయ్యబట్టారు. సంక్షేమ పథకాలకు డబ్బులు ఇస్తున్నామని చెబుతున్న వారు ఇవే పథకాలను బీజేపీ పాలిత రాష్ట్రాల్లో ఎందుకు అమలు చేయడం లేదని ప్రశ్నించారు. కార్యక్రమంలో రంగారెడ్డి జెడ్పీ చైర్‌పర్సన్‌ తీగల అనితారెడ్డి తదితరులు పాల్గొన్నారు. 

Read latest Politics News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top