టీడీపీ నిర్వాకంవల్లే జరిమానాలు

Minister Anil Kumar Counter To Polavaram Trolls - Sakshi

అనుమతులు తీసుకోకపోవడంవల్లే ఈ దుస్థితి

చంద్రబాబు అప్పట్లో సక్రమంగా చేసి ఉంటే సకాలంలో పూర్తిచేసే వాళ్లం

2018లోనే పూర్తిచేస్తానన్న ఉమా మాటలు రాయరే?

మంత్రి అనిల్‌కుమార్‌ మండిపాటు

సాక్షి ప్రతినిధి, నెల్లూరు/గూడూరు: తెలుగుదేశం పార్టీ నిర్వాకంవల్లే పోలవరం సహా పలు ప్రాజెక్టులకు నేషనల్‌ గ్రీన్‌ ట్రిబ్యునల్‌ (ఎన్జీటీ) జరిమానాలు విధించిందని రాష్ట్ర జలవనరుల శాఖా మంత్రి అనిల్‌కుమార్‌ యాదవ్‌ మండిపడ్డారు. శ్రీ పొట్టి శ్రీరాములు నెల్లూరు జిల్లా గూడూరు సమీపంలోని ఆదిశంకర కళాశాల వద్ద జాతీయ రహదారిపై గత కొద్దిరోజులుగా వరద నీరు పారుతున్న ప్రాంతాన్ని గురువారం పరిశీలించాక.. అనంతరం నెల్లూరు నగరంలో ఆయన మీడియాతో మాట్లాడారు. టీడీపీ ప్రభుత్వం ప్రాజెక్టుల నిర్మాణంకంటే ప్రచార ఆర్భాటానికే ఎక్కువ ప్రాధాన్యతనిచ్చిందని ఆరోపించారు. నిర్ధిష్టమైన విధానంలో కాకుండా ఇష్టానుసారం వ్యవహరించిందని తెలిపారు. అందుకే పర్యావరణ అనుమతులు తీసుకోకుండా నిర్మించడంవల్లే పురుషోత్తపట్నం, పట్టిసీమ ప్రాజెక్టులపై కూడా గ్రీన్‌ ట్రిబ్యునల్‌ జరిమానా విధించిందన్నారు.

పోలవరం స్పిల్‌వే పూర్తిచేసి డయాఫ్రమ్‌ వాల్‌ నిర్మించాల్సి ఉంటే, అందుకు భిన్నంగా ముందుగా డయాఫ్రమ్‌ వాల్‌ కట్టడంవల్లే కొట్టుకుపోయిందని తెలిపారు. అప్పట్లో చంద్రబాబు సక్రమంగా నిర్మాణం చేపట్టి.. చెప్పిన మాటకు కట్టుబడి ఉంటే కచ్చితంగా చెప్పిన సమయానికే పూర్తిచేసి ఉండే వారమని మంత్రి స్పష్టంచేశారు. అయినప్పటికీ సీఎం వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి చేతుల మీదుగానే ప్రారంభిస్తాం కానీ.. ఎవరికీ ఆ అవకాశం ఇవ్వబోమని మంత్రి అనిల్‌ స్పష్టంచేశారు. ఇక ఈ విషయంలో ట్రోల్‌ చేసిన వారు ‘నెట్‌’జనులు కాదు పచ్చ జనులన్న విషయం అందరికీ తెలుసని ఎద్దేవా చేశారు. అయినా.. రాసే వారు పూర్తి వివరాలను రాయాలేగానీ ఇలా అరకొరగా రాయడం ఏమిటంటూ ఆంధ్రజ్యోతి పత్రికపై మంత్రి అనిల్‌ మండిపడ్డారు. 

ఉమా నోరు జాగ్రత్త
మాజీమంత్రి దేవినేని ఉమామహేశ్వరరావు నోరు అదుపులో పెట్టుకోవాలని మంత్రి హెచ్చరించారు. ఇప్పటికి ఒక్కమారు కూడా తాను బూతులు మాట్లాడలేదని.. గట్టిగా మాట్లాడాను కానీ అసభ్య పదజాలం వాడలేదని ఆయన స్పష్టంచేశారు. 2018లోనే పోలవరం పూర్తిచేస్తామని.. ‘సాక్షి’లో రాసి పెట్టుకో జగన్‌మోహన్‌రెడ్డి అన్నారుగా.. మరి చేశారా? అని ఉమాను ప్రశ్నించారు. ఇంకోసారి సీఎం వైఎస్‌ జగన్‌ గురించిగానీ, తన గురించి గానీ నోరు పారేసుకుంటే మీకంటే ఎక్కువ బూతులు మాట్లాడాల్సి వస్తుందని అనిల్‌ హెచ్చరించారు. 
చదవండి: ఉత్తరాంధ్రకు తుపాను గండం.. సీఎం జగన్‌ సమీక్ష

Read latest Politics News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top