
సాక్షి, హైదరాబాద్: చేవెళ్ల సభలో ఏఐసీసీ అధ్యక్షుడు మల్లిఖార్జున ఖర్గే పచ్చి అబద్ధాలతో రాష్ట్ర ప్రజలను మభ్యపెట్టేందుకు విఫలయత్నం చేశారని కేంద్ర మంత్రి, బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు జి.కిషన్‌రెడ్డి విమర్శించారు. బీఆర్‌ఎస్, బీజేపీల మధ్య అంతర్గత స్నేహం కుదిరిందని, అందువల్లే పరస్పర విమర్శలు మానేశారని ఖర్గే చేసిన వ్యాఖ్యలను ఆదివారం ఒక ప్రకటనలో తప్పుబట్టారు.
కాంగ్రెస్‌కు ఓటేస్తే బీఆర్‌ఎస్‌కు ఓటేసినట్టేనని ప్రజలకు అర్థం కావడంతో నష్ట నివారణ చర్యల్లో భాగంగా ఖర్గే పూర్తి అబద్ధాలు మాట్లాడారని పేర్కొన్నారు. కాంగ్రెస్‌కు బీఆర్‌ఎస్‌తో దోస్తీ లేదనే విషయాన్ని ఖర్గే నిరూపించాలనుకుంటే తన ప్రశ్నలకు సమాధానమిచ్చి బీజేపీకి క్షమాపణలు చెప్పాలని డిమాండ్ చేశారు. సమాధానం ఇవ్వకపోతే రాష్ట్రంలో వారి మధ్య పొత్తుందని అంగీకరించేనట్లేనని అన్నారు.
చదవండి: Hyderabad Marathon: లింగం.. మారథాన్ సింగం! హార్ట్ పేషెంట్ అయినా..
కిషన్‌రెడ్డి సంధించిన 8 ప్రశ్నలివీ.
1. పేద ప్రజలకు డబుల్ బెడ్ రూమ్ ఇళ్ల నిర్మాణా నికి భూమి లేదని బుకాయిస్తున్న బీఆర్‌ఎస్ ప్రభుత్వం.. కాంగ్రెస్‌కు హైదరాబాద్‌లో ఎకరం భూమి కేవలం రూ.2 లక్షల చొప్పున పది ఎకరాలు కట్టబెట్టడం వాస్తవం కాదా? దీని వెనుక ఎలాంటి డీల్ లేదని ఖర్గే చెప్పగలరా?
2. కేటీఆర్ ఇటీవల బీజేపీ ఓటమికి గాను బీజేపీ వ్యతిరేక కూటమితో కలిసి పోరాడతామని, సంకీర్ణ ప్రభుత్వంలో కీలక పాత్ర పోషిస్తామని చెప్పడం మీ రెండు పార్టీల మధ్య ఉన్న అవగాహనకు ఒక ఉదాహరణ కాదా?
3. తెలంగాణలో చేతి గుర్తుమీద గెలిచిన చాలామంది కాంగ్రెస్ ఎమ్మెల్యేలు పార్టీకి రాజీనామా చేయకుండానే బీఆర్‌ఎస్ ఎమ్మెల్యేలుగా కొనసాగుతున్నారు. వారిపై పార్టీ ఫిరాయింపుల చట్టం కింద మీరు చర్యలు తీసుకోకపోవడం మీ రెండు పార్టీల మధ్య ఉన్న సత్సంబంధాలకు నిదర్శనం కాదా?
4. రాష్ట్రపతి ఎన్నికల్లో కాంగ్రెస్ అభ్యర్థికి మద్దతు తెలపడంతో పాటు ఎన్నికల ప్రచారాన్ని తెలంగాణలో కేసీఆర్ ముందుండి నడపడం నిజం కాదా?
5. శాసనమండలిలో కాంగ్రెస్‌ను పూర్తిగా బీఆర్‌ఎస్ లో విలీనం చేసినపుడు స్పందించకపోవడం మీ మధ్య దోస్తీకి పరాకాష్ట కాదా?
6. బీఆర్‌ఎస్, మజ్లిస్‌తో కలిసి మీ పార్టీ ఉమ్మడి పౌరస్మృతిని వ్యతిరేకిస్తున్నది నిజం కాదా?
7. కేంద్ర ప్రభుత్వంపై ఇటీవలి అవిశ్వాస తీర్మానానికి మీ రెండు పార్టీలూ అనుకూలంగా ఓటు వేసిన విషయం వాస్తవం కాదా?
8. కాంగ్రెస్ నేతృత్వంలోని యూపీఏ ప్రభుత్వంలో కేసీఆర్ కేంద్ర మంత్రిగా పని చేశారు. బీఆర్‌ఎస్ నాయకులు కాంగ్రెస్ అధికారంలో ఉన్నప్పుడు రాష్ట్ర మంత్రులుగా అధికారాన్ని అనుభవించలేదా? అప్పటినుంచే మీ స్నేహం కొనసాగుతున్నది నిజం కాదా?