అవన్నీ అబద్ధాలని నిరూపిస్తా రాజీనామా చేస్తావా? | Sakshi
Sakshi News home page

అవన్నీ అబద్ధాలని నిరూపిస్తా రాజీనామా చేస్తావా?

Published Mon, Feb 13 2023 2:08 AM

Hyderabad: Ts Bjp Chief Bandi Sanjay Challenge To Cm Kcr - Sakshi

సాక్షి, హైదరాబాద్‌ : ‘సీఎం కేసీఆర్‌ అసెంబ్లీ సాక్షిగా  చెప్పినవన్నీ అబద్ధాలని నిరూపిస్తా.... మాటకు కట్టుబడి రాజీనామా చేసే దమ్ముందా? డేట్, టైం ఫిక్స్‌ చెయ్‌... బహిరంగ చర్చకు సిద్ధం.. ఆధారాలతో నిరూపిస్తా’ అని బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్‌ కుమార్‌ సవాల్‌ విసిరారు. 24 గంటల కరెంట్‌ గురించి  రైతుల వద్దకు పోయి చెప్పే దమ్ము బీఆర్‌ఎస్‌ నేతలకు ఉందా అని ప్రశ్నించారు.  రైతులంతా వారిని ఉరికించి కొడతారన్నారు. దేశ జీడీపీ గురించి కేసీఆర్‌ చెప్పినవన్నీ అబద్ధాలేనని, ప్రపంచంలోనే 5వ అతిపెద్ద ఆర్థిక వ్యవస్థగా ఎదిగిందని ఐఎంఎఫ్‌ చెప్పిన విషయాన్ని గుర్తు చేశారు.

 ఆదివారం రాత్రి సంజయ్‌ మీడియాతో మాట్లాడారు. ‘కేసీఆర్‌ మాటలు నమ్మడానికి ప్రజలు సిద్ధంగా లేరు. పార్టీ నుంచి తెలంగాణ పదాన్నే తీసేసిన కేసీఆర్‌తో ప్రజలకు బంధం తెగిపోయింది. నువ్వో పెద్ద డిఫాల్టర్‌ సీఎంవి. అసెంబ్లీ సాక్షిగా అసత్యాలు చెప్పినందుకు తెలంగాణ ప్రజలకు క్షమాపణ చెప్పాలి’ అని బండి డిమాండ్‌ చేశారు. ఇచ్చిన హామీల అమలు విషయంలో ప్రజల దృష్టిని మళ్లించేందుకే అసెంబ్లీలో అడ్డగోలుగా అబద్ధాలు చెప్పారని విమర్శించారు. హైకోర్టు చీవాట్లు పెట్టినా 56 వేల జీవోలను వెబ్‌ సైట్లో పెట్టకుండా దాచిన కేసీఆర్‌... కేంద్రంలో నరేంద్ర మోదీ పాలన గురించి మాట్లాడటం సిగ్గు చేటన్నారు. రాష్ట్రంలో గొప్పలు చెప్పి చేసిన సమగ్ర కుటుంబ సర్వే నివేదిక ఏమైందో, ప్రజల ముందు ఎందుకు పెట్టడం లేదో సమాధానం చెప్పాలని నిలదీశారు. అబద్ధాలతో అసెంబ్లీని మలినం చేసిన కేసీఆర్‌ రాష్ట్ర ప్రజలకు క్షమాపణ చెప్పాల్సిందేనన్నారు.

ఈ ఏడాదే కేసీఆర్‌ ఖేల్‌ ఖతం కాబోతోంది...
2024లో మోదీ ప్రభుత్వం పనైపోతోందన్న కేసీఆర్‌ వ్యాఖ్యలను ఉటంకిస్తూ... ‘‘ఈ ఏడాదే కేసీఆర్‌ ఖేల్‌ ఖతం కాబోతోంది. ప్రజలు బీఆర్‌ఎస్‌ ను పాతిపెట్టబోతున్నారు’’ అని సంజయ్‌ అన్నారు. మోదీని తిట్టడానికి, కేంద్రాన్ని బదనాం చేసేందుకు తప్ప అసెంబ్లీలో మాట్లాడిందేమీలేదు. బడ్జెట్‌ ప్రస్తావనే లేదు. అని మండిపడ్డారు. పార్లమెంట్‌ లో మోదీ ప్రసంగాన్ని ప్రపంచమంతా మెచ్చుకోవడంతో...ఆయనతో పోల్చుకోవడానికి కేసీఆర్‌ నానా తంటాలు పడ్డారని ఎద్దేవాచేశారు. ‘అసెంబ్లీలో లేని వ్యక్తి గురించి మాట్లాడొచ్చా? గతంలో నేను పార్లమెంట్‌లో మాట్లాడితే నాపై చర్యలు తీసుకోవాలని ఫిర్యాదు చేశారు కదా...ఇవాళ మీరు చేసిందేమిటి? కేసీఆర్‌ ను ఇతర రాష్ట్రాల ప్రజలు, పార్టీలు జోకర్‌ లా చూస్తున్నరు’ అని ఎద్దేవా చేశారు. ‘నీ బిడ్డ లిక్కర్‌ స్కాంపై ఇంతవరకు నోరు మెదపలేదు... ఇవాళ ఎవరో పుస్తకం రాస్తే అసెంబ్లీలో చదివి విన్పించి మోదీని తిడతావా?... నీపై లక్షల పుస్తకాలు రాశారు.  ఎవడి పాలైందరో తెలంగాణ అని పాటలు రాశారు.. అవి అసెంబ్లీలో చదివి విన్పిస్తావా?’ అని ప్రశ్నించారు.

అవి పాకిస్తాన్, చైనా ఇచ్చాయా..?
 ‘కేంద్రం ఒక్క మెడికల్‌ కాలేజీ ఇవ్వలేదా? మరి ఎవరిచ్చారు? పాకిస్తాన్, చైనా ఇచ్చిందా? ప్రతి నియోజకవర్గంలో సూపర్‌ స్పెషాలిటీ ఆసుపత్రి హామీ ఏమైంది? ఆసుపత్రుల్లో కనీస సౌకర్యాల్లేవు. స్టాఫ్‌ నియామకాల్లేవు. నీకు ఇష్టమైన పాకిస్తాన్‌లో పిండికోసం కొట్టుకుని చస్తున్నారు. శ్రీలంక బిచ్చమెత్తుకుంటోంది. చైనా అల్లాడుతోంది’ అని సంజయ్‌ పేర్కొన్నారు.  ‘బీజేపీకి ఓటేసేందుకు ప్రజలు సిద్ధంగా ఉన్నారు. రూ.లక్ష కోట్లతో తెలంగాణలో రోడ్లు వేసినం.. కేంద్రం ఇస్తున్న నిధులవల్లే పంచాయతీలు నడుస్తున్నయ్‌... తెలంగాణకు  కేంద్రం అన్ని విధాలా సహకరిస్తున్నందుకు ప్రజలు ఓట్లేసేందుకు సిద్ధంగా ఉన్నారు’ అని బండి ధీమా వ్యక్తంచేశారు.

తాజ్‌ పోలికలతో సచివాలయాన్ని సమాధి చేస్తారా?
కోరుట్ల: ‘కొత్త సచివాలయం డోమ్‌లతో తాజ్‌మహల్‌ లెక్క ఉందని ఎంఐఎం నేత ఒవైసీ అన్నడు. తాజ్‌మహల్‌ అనేది సమాధి, కొత్త సచివాలయాన్ని సమాధి చేస్తారా? అట్లా జరగనివ్వం. నిజాం వారసత్వ చిహ్నాలు, నెత్తుటి మరకలు తెలంగాణలో ఉండనివ్వం. ఒవైసీ కోసం కడుతున్న డోమ్‌లు కూల్చేస్తం’ అని బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్‌ హెచ్చరించారు. జగిత్యాల జిల్లా కోరుట్లలో ఆదివారం జరిగిన కార్నర్‌ మీటింగ్‌లో సీఎం కేసీఆర్‌ తీరుపై ఆయన మండిపడ్డారు. ఆరువేల మంది ప్రజలను కర్కశంగా పొట్టనబెట్టుకున్న నిజాం పాలనాచిహ్నాలు ఉండనివ్వబోమని సంజయ్‌ స్పష్టం చేశారు. వాటిని తొలగించి మన భారతీయ, తెలంగాణ సంస్కృతి, సంప్రదాయాలు ఉట్టిపడేలా నిర్మిస్తామని అన్నారు.

Advertisement
 
Advertisement