Hardik Patel: నన్ను పట్టించుకోకుండా.. కొత్త నేత కోసం వెతుకుతున్నారు

Hardik Patel Hits Out at Congress Party, Senior Leaders of Sidelined Me - Sakshi

సొంత పార్టీపై హార్దిక్ పటేల్ మండిపాటు

తనకు గౌరవం ఇవ్వడం లేదని ఆవేదన 

హార్దిక్ పటేల్‌తో చర్చిస్తామన్న పీసీసీ చీఫ్‌

అహ్మదాబాద్‌: అసెంబ్లీ ఎన్నికలకు సిద్ధమవుతున్న గుజరాత్‌లో కాంగ్రెస్‌ పార్టీకి తలనొప్పులు తప్పడం లేదు. ఈ ఏడాది చివరలో ఎన్నికలు జరగనున్న నేపథ్యంలో కాంగ్రెస్‌ పార్టీలో లుకలుకలు బయటపడుతున్నాయి. గుజరాత్‌ కాంగ్రెస్‌ పార్టీ వర్కింగ్‌ ప్రెసిడెంట్‌ హార్దిక్ పటేల్ బుధవారం సొంత పార్టీ నాయకులపై విరుచుకుపడ్డారు. సీనియర్ నాయకులు తనను పక్కన పెట్టారని, పార్టీ కోసం తన నైపుణ్యాలను ఉపయోగించుకోవడం లేదని ఆరోపించారు. కుటుంబ నియంత్రణ ఆపరేషన్‌ చేయించుకున్న కొత్త పెళ్లికొడుకులా.. పార్టీలో తన పరిస్థితి ఉందని ఆవేదన వ్యక్తం చేశారు. 

పీసీసీ సమావేశాలకు తనను పిలవడం లేదని, పార్టీ నిర్ణయాలు తీసుకునే ముందు సంప్రదించడం లేదని.. అలాంటప్పుడు వర్కింగ్‌ ప్రెసిడింట్‌గా ఉండి ప్రయోజనం ఏంటని అన్నారు. ‘వర్కింగ్ ప్రెసిడెంట్ సహా పంజాబ్ కాంగ్రెస్ నేతల బృందం ఇటీవల సోనియా గాంధీని కలిశారు. గుజరాత్ కాంగ్రెస్‌లో వర్కింగ్ ప్రెసిడెంట్‌కు అలాంటి గౌరవం ఎందుకు లభించద’ని ప్రశ్నించారు. 

కొత్తవారి కోసం పాకులాట
పార్టీలో ముందు నుంచి ఉన్న వారిని వదిలేసి కొత్తవారి కోసం పాకులాడుతున్నారని మండిపడ్డారు. ఖోడల్ధామ్ ట్రస్ట్ అధ్యక్షుడు నరేశ్‌ పటేల్‌ను కాంగ్రెస్‌ పార్టీలో చేర్చుకునేందుకు జరుగుతున్న ప్రయత్నాలను దృష్టిలో పెట్టుకుని ఆయన ఈ వ్యాఖ్యలు చేశారు. ‘2017లో మా వల్ల (పటేల్ సంఘం) కాంగ్రెస్ లాభపడింది. ఇప్పుడు, నేను టెలివిజన్‌లో చూస్తున్నట్లుగా, పార్టీ 2022కి నరేష్ పటేల్‌ను చేర్చుకోవాలని కోరుకుంటోంది. 2027కి కొత్త పటేల్ కోసం వారు వెతకరని నేను ఆశిస్తున్నాను. ఇప్పటికే పార్టీలో ఉన్న నేతలను ఎందుకు ఉపయోగించుకోలేద’ని హార్దిక్ పటేల్ ప్రశ్నించారు. ఒకవేళ నరేశ్‌ పటేల్‌ను పార్టీలో చేర్చుకోవాలనుకుంటే ఆ పని వెంటనే పూర్తి చేయాలని, నాన్చుడు ధోరణి సరికాదన్నారు. (క్లిక్: యూపీ‌లో ఏం జరిగిందో చూశారుగా!: సీఎం యోగి)

హార్దిక్‌తో చర్చిస్తా: ఠాకూర్
2015 అల్లర్ల కేసులో సెషన్స్‌ కోర్టు తనకు విధించిన శిక్షను సుప్రీం కోర్టు  నిలిపివేయడంతో తాజా ఎన్నికల్లో పోటీ చేసేందుకు హార్దిక్ పటేల్ రెడీ అవుతున్నారు. కాగా, పటేల్ వ్యాఖ్యలపై గుజరాత్ కాంగ్రెస్ అధ్యక్షుడు జగదీష్ ఠాకూర్ స్పందించారు. హార్దిక్ లేవనెత్తిన అంశాలపై చర్చించేందుకు సిద్ధమని ప్రకటించారు. కాంగ్రెస్‌ పార్టీలో చేరాలా, వద్దా అనే దానిపై నరేశ్‌ పటేల్‌ నిర్ణయించుకోవాలన్నారు. మంచి నాయకులకు కాంగ్రెస్‌ పార్టీ ఎల్లప్పుడూ స్వాగతం పలుకుతుందని స్పష్టం చేశారు.

Read latest Politics News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top