Etela Rajender: పార్టీలో చేరికలపై ఈటల రాజేందర్‌ కీలక వ్యాఖ్యలు

Etela Rajender: Leaders Who Joining In BJP From TRS Congress - Sakshi

సాక్షి, హైదరాబాద్‌: ప్రస్తుతం అందరి చూపు బీజేపీ వైపే ఉందని బీజేపీ చేరికల కమిటీ చైర్మన్, ఎమ్మెల్యే ఈటల రాజేందర్‌ అన్నారు. కాంగ్రెస్‌ ను వీడిన కోమటిరెడ్డి రాజగోపాలరెడ్డి ఈ నెల 21న కేంద్ర హోంమంత్రి అమిత్‌షా సమక్షంలో బీజేపీలో చేరనున్నారని ఆయన తెలిపారు. కాంగ్రెస్‌ సీనియర్‌ నేత దాసోజు శ్రవణ్, నర్సాపూర్‌ మున్సిపల్‌ చైర్మన్‌ మురళి యాదవ్, ఎర్రబెల్లి ప్రదీప్‌రావు వంటి నాయకులూ కాషాయకండువా కప్పుకోనున్నట్లు చెప్పా రు. 

బీజేపీ రాష్ట్ర కార్యాలయంలో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో ఈటల రాజేందర్‌ మాట్లాడుతూ, పార్టీలోకి వచ్చే వారందరికీ ఆహ్వానం పలుకుతున్నట్లు తెలిపారు. 21వ తేదీ నాటికి పలువురు రిటైర్డ్‌ ఐఏఎస్‌లు, ఐపీఎస్‌లు, వ్యాపారులతో పాటు ఇతర పార్టీల నాయకులు 10 నుంచి 15 మంది తమ పార్టీలో చేరనున్నారని వెల్లడించారు. 

హాస్టళ్లలో కనీస వసతులు లేవు..
బాసర ట్రిపుల్‌ఐటీ, ఉస్మానియా, కాకతీయ వర్సిటీలు, బీసీ, ఎస్సీ, ఎస్టీ సంక్షేమ హాస్టళ్లలో చదువుతున్న విద్యార్థులకు రాష్ట్ర ప్రభుత్వం ఆహారంతో పాటు కనీస వసతులు కల్పించడం లేదని ఈటల విమర్శించారు. ‘సీఎం మనుమడు ఏం తింటున్నారో అదే బువ్వ పెడుతున్నాం అనే మాటలు నిజమే అయితే .. నాలుగు రోజుల పాటు మీ మనుమడిని సంక్షేమ హాస్టల్‌కి పంపు.. అప్పుడు వారి బాధ మీకు తెలుస్తుంది’ అని అన్నారు. ఈ సమా వేశంలో మాజీ ఎంపీ కొండా విశ్వేశ్వర్‌ రెడ్డి, మాజీ ఎమ్మెల్యేలు ఏనుగు రవీందర్‌ రెడ్డి, ఎన్‌వీఎస్‌ఎస్‌ ప్రభాకర్‌ తదితరులు పాల్గొన్నారు. 
చదవండి: మునుగోడుపై ఫోకస్‌.. రివర్స్‌ గేర్‌లో ‘కారు’ రూట్‌ మార్చిన కేసీఆర్‌!

Read latest Politics News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top