మండుటెండలో అభిమాన సంద్రం  | Sakshi
Sakshi News home page

మండుటెండలో అభిమాన సంద్రం 

Published Thu, Apr 11 2024 5:26 AM

Day 12th bus trip in Palnadu district - Sakshi

‘మేమంతా సిద్ధం’ బస్సు యాత్ర వెంట పల్నాటి జన సైన్యం 

విశ్వసనీయతే తమ వీరత్వమంటూ గర్జించిన అభిమాన జనం 

ధర్మాన్ని గెలిపిస్తామంటూ దిక్కులు పిక్కటిల్లేలా నినాదం 

పింఛన్‌ ఇంటికి పంపిన జగన్‌ కోసం తరలివచ్చిన అవ్వాతాతలు 

సీఎం జగన్‌ సంక్షేమాభివృద్ధికి జైకొట్టిన ప్రజానీకం  

రొంపిచర్ల వద్ద 87 ఏళ్ల అవ్వ రాధమ్మ మిట్ట మధ్యాహ్నం రోడ్డుపై ఆశగా ఎదురు చూస్తోంది. వచ్చిపోయే వాళ్లను జగన్‌ ఎక్కడి వరకు వచ్చాడయ్యా? అని ఆరా తీస్తోంది. ఇంత ఎండలో ఎందుకొచ్చారని ప్రశ్నిస్తే ‘జగన్‌ నాకు ఎంతో మంచి చేశాడు. ఇంటికే పింఛన్‌ పంపించాడు. నాలాంటోళ్లకి ఆ బిడ్డ కావాలి. అందుకు ఒక్కసారి చూసిపోదామని వచ్చాన’నని బదులిచ్చింది. 

మేమంతా సిద్ధం బస్సు యాత్ర నుంచి సాక్షి ప్రత్యేక ప్రతినిధి :  ‘మేమంతా సిద్ధం’ బస్సు యాత్ర బుధవారం 40 డిగ్రీల ఎండలోనూ జన జాతరను తలపించింది. వైఎస్సార్‌సీపీ అధినేత, ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డిపై అభిమానం వేసవి తాపాన్ని ఎదురించింది. గొంతెండే వేడిమిలోనూ ‘నువ్వే కావాలి జగన్‌’ అంటూ నినదించింది. ధర్మాన్ని గెలిపించే యుద్ధంలో పల్నాట సైన్యమై ముందుకు కదిలింది. పౌరుషాల పురిటిగడ్డ సాక్షిగా విశ్వసనీయతే తమ వీరత్వమంటూ గర్జించింది. పల్లెపల్లె నుంచి పిడికిలి బిగించి సార్వత్రిక ఎన్నికల్లో వైఎస్సార్‌సీపీ విజయానికి తామంతా సిద్ధమంటూ నినదించింది.

12వ రోజు మేమంతా సిద్ధం బస్సు యాత్ర పల్నాడు జిల్లాలోని గంటావారిపాలెం రాత్రి బస శిబిరం నుంచి ఉదయం 10.15 గంటలకు ప్రారంభమైంది. అంతకుముందు సీఎం జగన్‌ సమక్షంలో టీడీపీ, జనసేన నుంచి మాజీ ఎమ్మెల్యేలు, కీలక నేతలు పార్టీలో చేరారు. తమ అభిమాన నాయకుడిని చూసేందుకు ఉదయం 6.30 గంటల నుంచే శిబిరం వద్ద మహిళలు, దివ్యాంగులు, అనారోగ్య బాధితులు తరలివచ్చారు.

ముఖ్యమంత్రి కాన్వాయ్‌ శిబిరం నుంచి రోడ్డుపైకి రాగానే జైజగన్‌ నినాదాలతో గళమెత్తారు. సాయం కోరి వచ్చిన బాధితులను ఆప్యాయంగా పలకరిస్తూ సమస్య పరిష్కారానికి సీఎం అధికారులను ఆదేశించారు. కామేపల్లికి సమీపంలోని గ్రానైట్‌ కటింగ్‌ మహిళా కూలీలు రోడ్లపై వేచి చూడటాన్ని గమనించిన సీఎం జగన్‌.. కాన్వాయ్‌లో నుంచి కిందకి దిగి వచ్చి ప్రభుత్వ పనితీరుపై ముచ్చటించారు.

వినుకొండ–కర్నూలు జాతీయ రహదారిపై ప్రజలతో మమేకమవుతూ ముందుకు సాగారు. ఆ తర్వాత పల్నాడు జిల్లా వినుకొండ నియోజకవర్గం నుంచి బాపట్ల జిల్లా సంతమాగులూరు క్రాస్‌ మీదుగా నరసారావుపేట నియోజకవర్గం అన్నవరప్పాడులోకి బస్సు యాత్ర ప్రవేశించింది. 

జాతీయ రహదారిపై జన ప్రవాహం
నార్కెట్‌పల్లి జాతీయ రహదారిపై సంతమాగులూరు జంక్షన్‌లో పెద్ద జన ప్రవాహమే కనిపించింది. పెద్ద ఎత్తున తరలివచ్చిన అభిమానులు తమ ఆత్మీయ నాయకుడికి ఘన స్వాగతం పలికారు. రోడ్డుకు ఇరువైపులా భారీ సంఖ్యలో మహిళలు తరలివచ్చి పూలతో నీరాజనం పలికారు.

వ్యవసాయ మహిళా కూలీలు తమపాలిట రైతు బాంధవుడిని చూసేందుకు పొలాల్లో నుంచి రోడ్లపైకి పరుగులు తీశారు. రొంపిచర్లలో యువత ఉత్సాహంగా డ్యాన్సులు చేస్తూ జననేత రాకతో సంబరపడ్డారు. సంతగుడిపాడు, విప్లర్లలో బాణసంచా కాల్చడంతో తిరునాళ్లను తలపించింది. రొంపిచెర్ల, సంతగుడిపాడు రోడ్‌షో అంబరాన్ని తాకింది. సీఎం జగన్‌కు కంబలి కప్పి గొర్రె పిల్లను బహుమానంగా అందించారు.

విప్పర్లలో మహిళలు హారతిపట్టి బస్సు యాత్రను దీవించారు. వలంటీర్లు పెద్ద ఎత్తును తరలివచ్చి ప్రజలకు సంక్షేమాన్ని చేరువ చేయడంలో తమకూ భాగస్వామ్యం కల్పించిన సీఎం జగన్‌కు కృతజ్ఞతలు తెలిపారు. ఎప్పటికీ మీ వెంటే ఉంటామంటూ నినదించారు. రెండు నెలల్లో అధికారంలోకి వచ్చిన వెంటనే వలంటీర్ల వ్యవస్థను పునరుద్ధరిస్తామంటూ సీఎం జగన్‌ భరోసా ఇచ్చారు.

ఊరూరా అభిమానం
నెకరికల్లులో సీఎం జగన్‌పై అంతులేని అభిమానం బంతిపూల వర్షం కురిపించింది. సంక్షేమ ఫలాలను అందుకున్న మహిళలు భారీగా తరలివచ్చారు. దాదాపు మధ్యాహ్నం రెండు గంటలకు కూడా నెకరికల్లులోని నారెట్‌పల్లి– అద్దంకి జాతీయ రహదారి జనంతో కిక్కిరిసిపోయింది.  జనసంద్రంగా మారిన మార్గంలో బస్సు యాత్ర అనుకున్న షెడ్యూల్‌ కంటే ఆలస్యంగా చల్లంగుండ్లకు చేరుకుంది.

నెకరికల్లు, జంక్షన్, త్రిపురాపురం, నెమలిపురి మీదుగా సాగిన బస్సు యాత్ర 4 గంటల సమయంలో పెద్ద నెమలిపురం చేరుకుంది. దేవరంపాడు క్రాస్‌ వద్ద 4.20 గంటలకు సీఎం భోజన విరామం తీసుకున్నారు. సాయంత్రం ఐదు గంటల తర్వాత కొండమోడు, పిడుగురాళ్ల, బైపాస్‌ మీదుగా రోడ్‌షో నిర్వహిస్తూ అయ్యప్పనగర్‌ బైపాస్‌ సభా ప్రాంగణానికి చేరుకున్నారు. 

పిడుగురాళ్లలో పిడికిలి బిగించి..
పిడుగురాళ్ల బైపాస్‌లో రోడ్‌షో, బహిరంగ సభ సిద్ధం.. సిద్ధం’ నినాదాలతో మార్మోగింది. రోడ్లపై బారులు తీరిన ప్రజలు ఆద్యంతం సీఎం ప్రసంగాన్ని ఆలకించారు. ఏనోట విన్నా తమ ఇంటికి వచ్చిన సంక్షేమ పథకాల లిస్టు వినిపించింది. ఎన్నికల వేళ ప్రతిపక్షాల నుంచి అధికార పక్షంలోకి చేరికలు భవిష్యత్తు గెలుపునకు ముందస్తు సంకేతాలని, పిడుగురాళ్ల బహిరంగ సభలో రెంటచింతల వేడిని మించిన.. భీకరమైన గెలుపు పవనాలు వైఎస్సార్‌ సీపీకి కనిపించాయంటూ పరిశీలకులు చెబుతున్నారు.

తొలిసారిగా ఓటు వేస్తున్న యువత బహిరంగంగానే తమ ఓటు సీఎం జగన్‌కే అంటూ నినదించింది. 5.30 గంటలకు సీఎం జగన్‌ సభా ప్రాంగణానికి చేరుకున్నారు. 6.50 గంటల వరకు పార్టీ శ్రేణులు, లబ్ధిదారులను ఉద్దేశించి ప్రసంగించారు. బహిరంగ సభ అనంతరం 7 గంటలకు బయలు దేరిన సీఎం జగన్‌ కొండమోడు సర్కిల్‌ మీదుగా సత్తెనపల్లి నియోజకవర్గంలోకి ప్రవేశించారు.

రెడ్డిపాలెంలో రాత్రి 8.45 గంటలు అయినప్పటికీ పెద్ద సంఖ్యలో మహిళలు హారతులు, పూలతో ఘన స్వాగతం పలికారు. బస్సుపైకి ఎక్కి వారందరికీ సీఎం అభివాదం చేశారు. రాత్రి 9.08 గంటలకు ధూళిపాళ్లలో ఏర్పాటు చేసిన రాత్రి బస శిబిరానికి చేరుకున్నారు.  

మళ్లీ నువ్వే రావాలయ్యా 
సంతమాగులూరు మండలంలోని ఏల్చూరు పంచాయతీ పరిధిలోని రామిరెడ్డిపాలేనికి చెందిన వెంకాయమ్మ అనే మహిళ ‘మేమంతా సిద్ధం’ బస్సు యాత్రగా వస్తున్న వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డిని చూసేందుకు ఉదయం 9గంటలకే పుట్టావారిపాలెం అడ్డరోడ్డుకు వచ్చింది. తీరా ఆయన వచ్చే సమయానికి చెప్పులు  తెగిపోయాయి. అయినా ఆమె చలించలేదు. కాళ్లు మండుతున్నా లెక్క చేయకుండా జగన్‌ను చూసేందుకు బస్సు వద్దకు పరుగు పరుగున వచ్చి ఆయనను ఆత్మీయంగా పలకరించింది. భావోద్వేగానికి గురైంది. ‘అయ్యా.. నువ్వే రావాలయ్యా..’ అంటూ ఆకాంక్షించింది.   

Advertisement
 
Advertisement
 
Advertisement