
మీడియాతో మాట్లాడుతున్న దీపేందర్ హుడా చిత్రంలో రేవంత్‌రెడ్డి, మధుయాష్కీ
సాక్షి, హైదరాబాద్: దేశంలో అత్యధికంగా వ్యాట్ విధిస్తున్న రాష్ట్రాలలో తెలంగాణ మూడోస్థానంలో ఉందని కాంగ్రెస్ పార్టీ ఎంపీ దీపేందర్ హుడా ధ్వజమెత్తారు. చమురుపై రూ.నాలుగు లక్షల కోట్లకుపైగా భారాన్ని ప్రజలపై మోపుతూ నడ్డి విరుస్తున్నారని ఆరోపించారు. గురువారం గాంధీభవన్‌లో పీసీసీ అధ్యక్షులు రేవంత్ రెడ్డి, ప్రచార కమిటీ చైర్మన్ మధుయాష్కీ, ఎన్నికల నిర్వాహక కమిటీ చైర్మన్ దామోదర్ రాజ నర్సింహ, కార్యనిర్వాహక అధ్యక్షులు గీతారెడ్డి, అంజన్ కుమార్ యాదవ్, అజారుద్దీన్, మహేశ్ కుమార్ గౌడ్, పార్టీ ఉపాధ్యక్షులు ఆర్.దామోదర్ రెడ్డి, మల్లు రవి, సీనియర్ నేతలు జాఫర్ జావిద్, సునీతారావ్, మాజీ ఎంపీ రాజయ్యలతో కలసి దీపేందర్ మీడియాతో మాట్లాడారు. పెట్రోల్, డీజిల్‌తోపాటు ఉప్పు, పప్పులు, నూనెల ధరలు రోజురోజుకూ పెరుగుతున్నాయని, కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు ప్రత్యక్ష, పరోక్ష పన్నులతో సామాన్యులపై మోయలేని భారం మోపాయని అన్నారు. వంటగ్యాస్ విషయంలో ప్రభుత్వ సబ్సిడీ దాదాపుగా ఎత్తేశాయని ఆరోపించారు. ధరల పెరుగుదలపై కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలపై సమరభేరి మోగిస్తామని హెచ్చరించారు. దేశ ఆర్థిక పరిస్థితి దారుణంగా ఉందని, అది సామాన్యులపై తీవ్ర ప్రభావం చూపుతోందని అన్నారు.
కేసీఆర్ రూ.36 లక్షల కోట్ల దోపిడీ: రేవంత్
పీసీసీ చీఫ్ రేవంత్‌రెడ్డి మాట్లాడుతూ నరేంద్ర మోదీ, కేసీఆర్ దోపిడీలకు దేశంలో అత్యంత ధనవంతుడు నుంచి పేదవాడి వరకు బలవుతున్నారని అన్నారు. ఏడేళ్లలో రూ.36 లక్షల కోట్లు దోచుకున్నారని, పెట్రోల్ వాస్తవ ధర రూ.40 మాత్రమేనని, రూ.32 కేసీఆర్, మరో రూ.33 మోదీ వసూలు చేస్తున్నారన్నారు. ధరలపై శుక్రవారం ‘చలో రాజభవన్’ నిర్వహిస్తున్నామని, ఇందిరాపార్క్ ధర్నాచౌక్ నుంచి రాజ్‌భవన్ వరకు ర్యాలీగా వెళ్లి గవర్నర్‌కు వినతిపత్రం ఇస్తామని తెలిపారు. ‘ప్రజలను దోచుకోవడానికి కోవిడ్ నిబంధనలు అడ్డురావు కానీ.. నిరసనకు అడ్డు వస్తాయా’అని ప్రశ్నించారు. నేటి నిరసన కార్యక్రమానికి కాంగ్రెస్ శ్రేణులు తరలిరావాలని, ర్యాలీ సందర్భంగా అరెస్టులు చేస్తే ఎలా ఎదుర్కోవాలో తమకు తెలుసని, అరెస్టులు చేస్తే.. జైల్ భరో నిర్వహిస్తామని పేర్కొన్నారు. అలాగే పోలీస్‌స్టేషన్ ముట్టడి చేస్తామని, అప్పుడు ఎంత మందిని అరెస్ట్ చేస్తారో చూస్తామని హెచ్చరించారు.