మా ఫోన్ల ట్యాపింగ్‌  | Chandrababu Writes Letter To PM Narendra Modi | Sakshi
Sakshi News home page

మా ఫోన్ల ట్యాపింగ్‌ 

Aug 18 2020 5:35 AM | Updated on Aug 18 2020 5:35 AM

Chandrababu Writes Letter To PM Narendra Modi - Sakshi

సాక్షి, హైదరాబాద్‌: ప్రతిపక్ష పార్టీల నాయకులు, న్యాయవాదులు, మీడియా, సామాజిక కార్యకర్తల ఫోన్లను రాష్ట్ర ప్రభుత్వం ట్యాపింగ్‌ చేస్తోందని ప్రతిపక్ష నేత చంద్రబాబు నాయుడు ఆరోపించారు. ఈ మేరకు సోమవారం ఆయన ప్రధాని మోదీకి లేఖ రాశారు. అందులోని వివరాలివీ..

► ఏపీలో రాజకీయ నాయకులు, ఇతరుల ఫోన్ల ట్యాపింగ్‌ రూపంలో వాటిల్లిన తీవ్రమైన ముప్పును మీ దృష్టికి తెస్తున్నా. వైఎస్సార్‌సీపీ పాలనలో రాష్ట్ర ప్రజలు తీవ్ర ముప్పును ఎదుర్కొంటున్నారు. గత ప్రభుత్వ పాలనలో వచ్చిన పెట్టుబడిదారులపై, విధానాలపై దాడి చేయడం ద్వారా పాలనా ప్రక్రియ పూర్తిగా పట్టాలు తప్పింది.  
► ప్రతిపక్ష పార్టీల నాయకులు, న్యాయవాదులు, మీడియా వ్యక్తులు, సామాజిక కార్యకర్తల ఫోన్లను చట్టవిరుద్ధంగా ట్యాపింగ్‌ చేయడం అధికార పార్టీ దినచర్యగా మారింది.

ప్రాథమిక హక్కులను హరిస్తున్నారు..
► వివిధ వర్గాల ప్రజల ఫోన్లను ట్యాప్‌ చేయడంలో చట్టబద్ధమైన ఎటువంటి విధానాన్ని రాష్ట్రప్రభుత్వం పాటించడంలేదు. ఇది రాజ్యాంగంలో పేర్కొన్న ఆర్టికల్‌ 19, 21లో హామీ ఇచ్చిన ప్రాథమిక హక్కులను ఉల్లంఘించడమే.
► ఏ కారణాలు లేకుండానే అధికారపార్టీ తన రాజకీయ లాభాలకోసం చట్టవిరుద్ధంగా ఫోన్లను ట్యాపింగ్‌ చేస్తోంది. ఇల్లీగల్‌ సాఫ్ట్‌వేర్‌ ద్వారా, చట్టవిరుద్ధంగా ఈ ట్యాపింగ్‌ జరుగుతోందని ఆందోళన చెందుతున్నాం.
► ఇటువంటి అధునాతన సాంకేతిక పరిజ్ఞానం దుండగుల చేతిలో ఉండడం వల్ల వ్యక్తుల గోప్యత హక్కును కాలరాయడమేగాక అత్యున్నత స్థానాల్లోని వ్యక్తులను తమ దారికి తెచ్చుకోడానికి బ్లాక్‌ మెయిలింగ్, బెదిరింపులకు గురిచేయడానికి దారితీస్తుంది.
► ఏ విధంగానైనా అధికారాన్ని నిలుపుకోవాలనే తపనతో అధికారపార్టీ దారుణంగా బెదిరిస్తోంది.
► తమ చర్యలకు అడ్డంకులు ఎదురవుతున్నాయనే ఉద్దేశంతో న్యాయవ్యవస్థను కూడా లక్ష్యంగా చేసుకున్నట్లు కనిపిస్తోంది.
► ప్రైవేటు వ్యక్తులు కూడా కటింగ్‌ ఎడ్జ్‌ టెక్నాలజీ, పరికరాలు వినియోగించి ఫోన్లను అక్రమంగా ట్యాపింగ్‌ చేస్తున్నట్లుగా తెలుస్తోంది. ఇలాంటి ఇల్లీగల్‌ ఫోన్‌ ట్యాపింగ్‌లకు అడ్డుకట్ట వేయకపోతే దేశ భద్రతకు, సార్వభౌమాధికారానికే పెనుముప్పుగా పరిణమించే ప్రమాదం ఉంది.
► ఏపీలో అధికారపార్టీ, ప్రైవేటు వ్యక్తులతో ఇలాంటి చట్టవిరుద్ద కార్యకలాపాలకు పాల్పడకుండా కఠిన చర్యలు తీసుకోవాలని కోరుతున్నాం. ఫోన్‌ ట్యాపింగ్‌లాంటి అక్రమాలు, చట్టవిరుద్ద చర్యలపై కేంద్ర ప్రభుత్వ దర్యాప్తు సంస్థల ద్వారా విచారణకు ఆదేశించాలని కోరుతున్నాను.

మీ దృష్టి నిశితం..
► లేఖలో చంద్రబాబు ప్రధానమంత్రిపై పొగడ్తలు కురిపించారు. ‘‘మీ(ప్రధాని మోదీ) సమర్ధ, శక్తివంతమైన నాయకత్వంలో దేశ భద్రత గణనీయంగా ఇనుమడించింది, మన సాయుధ దళాలు నూతన విశ్వాసాన్ని పొందాయి. అంతర్గతంగా, ఉగ్రవాద శక్తుల నుంచి ముప్పు తగ్గింది. సరిహద్దులు బలోపేతమయ్యాయి. మీ నిశిత దృష్టితో కొత్త పొత్తులు ఏర్పడ్డాయి’’ అని పేర్కొన్నారు. 
► కాగా, రమేష్‌ హాస్పిటల్స్‌ నిర్వహిస్తున్న కోవిడ్‌ కేంద్రంలో అగ్ని ప్రమాదానికి సంబంధించి సినీ నటుడు రామ్‌ ట్వీట్‌పై విజయవాడ పోలీసుల వ్యాఖ్యలను ఖండిస్తున్నట్లు చంద్రబాబు ఒక ప్రకటనలో పేర్కొన్నారు. భావ వ్యక్తీకరణ స్వేచ్ఛను కాలరాయడం ప్రజాస్వామ్యానికే మాయని మచ్చన్నారు. 

సీఎం జగన్‌కు బాబు లేఖ
► గోదావరి వరదల నేపథ్యంలో తక్షణ సహాయ పునరావాస చర్యలు తీసుకోవాలంటూ చంద్రబాబు హైదరాబాద్‌ నుంచి సీఎం జగన్‌కు లేఖ పంపారు. 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement