14 లక్షల మంది విద్యార్థులకు రేవంత్‌ వెన్నుపోటు | BRS Leader KTR fires On CM Revanth Reddy | Sakshi
Sakshi News home page

14 లక్షల మంది విద్యార్థులకు రేవంత్‌ వెన్నుపోటు

May 4 2026 3:26 AM | Updated on May 4 2026 3:26 AM

BRS Leader KTR fires On CM Revanth Reddy

సాక్షి, హైదరాబాద్‌: రాష్ట్రంలోని 14 లక్షల మంది విద్యార్థులకు ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి వెన్నుపోటు పొడిచేందుకే ఫీజుల రీయింబర్స్‌మెంట్‌ పథకాన్ని రద్దుచేసేలా చీకటి జీఓ నం.7ను తెచ్చారని బీఆర్‌ఎస్‌ వర్కింగ్‌ ప్రెసిడెంట్‌ కేటీఆర్‌ ధ్వజమెత్తారు. విద్యను విధ్వంసం చేసేందుకే ఆ శాఖను నీ దగ్గర పెట్టుకున్నావా?.. కేసీఆర్‌ స్కీంలకే కాదు.. వైఎస్‌ఆర్‌ పథకాలకు పాతరేస్తావా..? అంటూ రేవంత్‌ను నిలదీశారు. ఈ మేరకు ముఖ్యమంత్రికి కేటీఆర్‌ ఆదివారం బహిరంగ లేఖ రాశారు. దుర్మార్గమైన జీఓను వెంటనే వెనక్కి తీసుకుని క్షమాపణ చెప్పాలని డిమాండ్‌ చేశారు. విద్యార్థి లోకం గర్జిస్తే రోడ్లపై తిరగలేరనే విషయాన్ని గుర్తుపెట్టుకోవాలని హెచ్చరించారు. రూ.10 వేల కోట్ల ఫీజు బకాయిలను తక్షణమే విడుదల చేయాలని డిమాండ్‌ చేశారు. జీఓ 7ను వెనక్కి తీసుకోకుంటే 14 లక్షల మంది బీసీ, ఎస్సీ, ఎస్టీ, మైనారిటీ పేద విద్యార్థులతో దండుకట్టి సర్కారుపై సమరశంఖం పూరిస్తామని హెచ్చరించారు.  

క్షమించరాని పాపం 
‘రెండున్నరేళ్ల అసమర్థ పాలనలో విద్యావ్యవస్థను కుప్పకూల్చి క్షమించరాని పాపాన్ని మూటగట్టుకున్నారు. ఇప్పుడు ఉన్నత చదువులకు నిరుపేదలను పూర్తిగా దూరం చేసేలా విద్యార్థులకు వెన్నుపోటు పొడుస్తారా? రాష్ట్రంలోని 14 లక్షల మంది బీసీ, ఎస్సీ, ఎస్టీ, మైనారిటీ విద్యార్థులకు కొండంత అండగా నిలిచే ఫీజు రీయింబర్స్‌మెంట్‌ పథకాన్ని రద్దుచేసేలా మీరు కుట్ర చేస్తున్నారు. జీఓ 7 ముమ్మాటికీ ఫీజుల పథకానికి పాతరేసేందుకు చేస్తున్న కుటిల ఎత్తుగడ అనే విషయం తెలంగాణ సమాజానికి అర్థమైపోయింది. పిల్లల భవిష్యత్తు కోసం కలలుగంటున్న తల్లిదండ్రుల ఆశలపై మీ ప్రభుత్వం నీళ్లు చల్లుతోంది. 

ఉమ్మడి రాష్ట్రంలో కాంగ్రెస్‌ సీఎం వైఎస్‌ రాజశేఖర్‌ రెడ్డి మంచి ఉద్దేశంతో ప్రవేశపెట్టిన ఫీజు రీయింబర్స్‌మెంట్‌ పథకాన్ని రాజకీయాలకతీతంగా కేసీఆర్‌ కూడా కొనసాగించారు. విద్యార్థుల ఉన్నత చదువులకు ఇబ్బందులు తలెత్తకుండా ఎప్పటికప్పుడు చర్యలు తీసుకున్నారు. కానీ మీరు అధికారంలోకి వచ్చిన నాటి నుంచి ఫీజు రీయింబర్స్‌మెంట్‌కు గ్రహణం పట్టింది. జీఓ 7 వెనక్కి తీసుకుని, విద్యార్థి లోకానికి క్షమాపణలు చెప్పాలని బీఆర్‌ఎస్‌ పక్షాన డిమాండ్‌ చేస్తున్నాను. గత 30 నెలల్లో మూడు పైసలు కూడా విడుదల చేయని మీ ప్రభుత్వం.. ఇప్పుడు విద్యార్థుల ఖాతాలో నేరుగా ఫీజులు జమవేస్తామంటే ఎవరు నమ్ముతారు’అని కేటీఆర్‌ తన లేఖలో పేర్కొన్నారు.   

Advertisement
 
Advertisement
Advertisement