‘మహా’ స్పీకర్‌గా నర్వేకర్‌.. అత్యంత పిన్నవయస్కుడిగా రికార్డు!

BJP Rahul Narvekar elected Maharashtra Assembly Speaker - Sakshi

బీజేపీ అభ్యర్థి విజయం 

ఆయనకు 164 ఓట్లు

ఎంవీఏ అభ్యర్థి రాజన్‌ సాల్వీకి 107 ఓట్లు  

వెంటనే రంగంలోకి స్పీకర్‌

ఎల్పీ నేతగా షిండే నియామకం

నేడు బలపరీక్షకు ముందు కీలక నిర్ణయం తీసుకున్న వైనం

ముంబై: మహారాష్ట్ర శాసనసభ ప్రత్యేక సమావేశాలు ఆదివారం ప్రారంభమయ్యాయి. తొలిరోజు సభాపతి ఎన్నిక నిర్వహించారు. నూతన స్పీకర్‌గా బీజేపీ అభ్యర్థి రాహుల్‌ నర్వేకర్‌(45) ఎన్నికయ్యారు. ఆయనకు 164 ఓట్లు రాగా, మహా వికాస్‌ అఘాడీ(ఎంవీఏ) అభ్యర్థి, శివసేన ఎమ్మెల్యే రాజన్‌ సాల్వీకి కేవలం 107 ఓట్లు పోలయ్యాయి. దేశంలో ఇప్పటిదాకా అత్యంత పిన్నవయస్కుడైన అసెంబ్లీ స్పీకర్‌గా రాహుల్‌ నర్వేకర్‌ రికార్డుకెక్కారని ఉప ముఖ్యమంత్రి దేవేంద్ర ఫడ్నవీస్‌ చెప్పారు.

రాహుల్‌ మామ, ఎన్సీపీ నేత రామ్‌రాజే నాయక్‌ మహారాష్ట్ర శాసనమండలి చైర్‌పర్సన్‌గా పనిచేస్తున్నారు. కొత్త స్పీకర్‌ వెంటనే రంగంలోకి దిగారు. శివసేన శాసనసభాపక్ష నేతగా అజయ్‌ చౌదరిని తొలగించారు. ఆ స్థానంలో సీఎం షిండేను నియమిస్తూ ఆదేశాలు జారీ చేశారు. తిరుగుబాటుకు ముందు షిండేనే ఎల్పీ నేతగా ఉన్న విషయం తెలిసిందే. 288 మంది సభ్యులున్న అసెంబ్లీలో ప్రస్తుతం ఒక స్థానం ఖాళీగా ఉంది. శివసేన సభ్యుడు రమేశ్‌ లాట్కే మరణంతో ఖాళీ ఏర్పడింది. డిప్యూటీ స్పీకర్, ఎన్సీపీ నేత నరహరి జిర్వాల్‌ ఓటు వేయలేదు.

కొందరు శివసేన ఎమ్మెల్యేలు పార్టీ విప్‌ను ధిక్కరించి, ప్రత్యర్థికి ఓటు వేశారని, వారిపై తగిన చర్యలు తీసుకుంటామని నరహరి జిర్వాల్‌ చెప్పారు. ప్రస్తుతం ఉన్న 287 మంది ఎమ్మెల్యేలకు గాను 271 మంది ఓటు వేశారు. వివిధ కారణాలతో పలువురు గైర్హాజరయ్యారు. పూర్తి పారదర్శకంగా స్పీకర్‌ ఎన్నిక జరిగిందని కాంగ్రెస్‌ సీనియర్‌ నేత, మాజీ మంత్రి బాలాసాహెబ్‌ థోరట్‌ ఒక ప్రకటనలో ప్రశంసించారు. శివసేన రెబల్‌ ఎమ్మెల్యేలు పటిష్టమైన భద్రత మధ్య సమీపంలోని హోటల్‌ నుంచి అసెంబ్లీకి చేరుకున్నారు. మహారాష్ట్ర నూతన సర్కారు బలపరీక్ష సోమవారం అసెంబ్లీలో జరుగనుంది.

శివసేన ఎమ్మెల్యేలకు రెండు విప్‌లు  
శివసేన రెండు వర్గాలు విడిపోయింది. స్పీకర్‌ ఎన్నికలో ముఖ్యమంత్రి ఏక్‌నాథ్‌ షిండే, మాజీ సీఎం ఉద్ధవ్‌ ఠాక్రే వర్గాలు పార్టీ ఎమ్మెల్యేలకు వేర్వేరు విప్‌ జారీ చేశాయి. షిండే వర్గం బీజేపీ అభ్యర్థి రాహుల్‌ నర్వేకర్‌గా అనుకూలంగా, ఠాక్రే వర్గం శివసేన అభ్యర్థి రాజన్‌ సాల్వీకి అనుకూలంగా ఓటు వేశాయి. పార్టీ విప్‌ను కొందరు సభ్యులు ఉల్లంఘించారని ఆరోపిస్తూ శివసేన చీఫ్‌ విప్‌ సునీల్‌ ప్రభు(ఠాక్రే వర్గం) డిప్యూటీ స్పీకర్‌కు ఓ లేఖ అందజేశారు. పార్టీ ఆదేశాలను 39 మంది ఎమ్మెల్యేలు ధిక్కరించారని సభలో సునీల్‌ ప్రభు చెప్పారు. తమ వర్గంలో లేని 16 మందికి కూడా విప్‌ జారీ చేశామని షిండే వర్గం ఎమ్మెల్యే దీపక్‌ చెప్పారు.  

సేన శాసనసభాపక్ష కార్యాలయానికి సీల్‌   
విధాన భవన్‌లో శివసేన శాసనసభాపక్ష కార్యాలయాన్ని ఏక్‌నాథ్‌ షిండే వర్గంఆదివారం మూసివేసింది. తలుపులు బిగించి, తెల్లకాగితం అతికించి, దానిపై టేప్‌ వేశారు. శివసేన శాసనసభా పక్షం ఆదేశాల మేరకు ఆఫీసును మూసివేస్తున్నట్లు  రాశారు.  

కసబ్‌కు కూడా ఇంత సెక్యూరిటీ లేదు: ఆదిత్య  
రెబల్‌ ఎమ్మెల్యేల కోసం ప్రభుత్వం పటిష్టమైన భద్రతా ఏర్పాట్లు చేయడం పట్ల శివసేన ఉద్ధవ్‌ ఠాక్రే కుమారుడు, మాజీ మంత్రి ఆదిత్య ఠాక్రే అసహనం వ్యక్తం చేశారు. ఉగ్రవాది కసబ్‌కు కూడా ఇంత సెక్యూరిటీ లేదని అన్నారు. ఇలాంటి పరిస్థితి ముంబైలో ఎప్పుడూ చూడలేదన్నారు. ‘‘ప్రభుత్వానికి భయమెందుకు? ఎవరైనా జారుకుంటారని భయపడుతున్నారా?’’ అని ఎద్దేవా చేశారు.

Read latest Politics News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top