
సాక్షి, హైదరాబాద్: లోక్‌సభ ఎన్నికల శంఖారావానికి బీజేపీ సిద్ధమైంది. కేంద్రంలో మూడోసారి బీజేపీ అధికారంలోకి రావాలని, తెలంగాణలో పది ఎంపీ సీట్లలో గెలుపే లక్ష్యంగా విజయ సంకల్ప రథయాత్రలకు ఆ పార్టీ శ్రీకారం చుడుతోంది. ఈ నెల 20 నుంచి నాలుగు చోట్ల నుంచి ఈ రథయాత్రల ద్వారా ఎన్నికల ప్రచారాన్ని ప్రారంభించనున్నారు. ఈ యాత్రలు మార్చి 1న ముగించేలా ఏర్పాట్లు చేశారు.
సోమవారం ఉదయం 9గంటలకు చార్మినార్ భాగ్యలక్ష్మి దేవాలయం వద్ద విజయ సంకల్పయాత్ర ప్రచార రథాలకు పూజా కార్యక్రమం నిర్వహించనున్నారు. ఈ కార్యక్రమంలో కేంద్ర మంత్రి, పార్టీ రాష్ట్ర అధ్యక్షుడు జి.కిషన్‌రెడ్డి, ఎంపీలు బండి సంజయ్, కె.లక్ష్మణ్‌తోపాటు ముఖ్యనేతలు ఈటల రాజేందర్, డీకే.అరుణ, పార్టీ ఎమ్మెల్యేలు పాల్గొంటారు. ఐదో రథయాత్ర మాత్రం ఈ నెల 25న మొదలవుతుంది.
హైదరాబాద్‌ను మినహాయించి 16 ఎంపీ స్థానాలను ఐదు క్లస్టర్లుగా విభజించిన విషయం తెలిసిందే. ఒక్కో క్లస్టర్ పరిధిలో మూడు నుంచి నాలుగు ఎంపీ సెగ్మెంట్లు ఉన్నాయి. ఐదు క్లస్టర్లకు చారిత్రక ప్రదేశాల పేర్లు పెట్టారు. కిషన్‌రెడ్డి సహా పార్టీ ఎంపీలు, ఎమ్మెల్యేలు, బీజేపీ పాలిత సీఎంలు, కేంద్రమంత్రులు, జాతీయపార్టీ ముఖ్యనేతలు యాత్రల్లో పాల్గొంటారు.
ఐదు యాత్రలు ఇలా...
► భాగ్యలక్ష్మి క్లస్టర్: ఈ నెల 20న భువనగిరిలో ప్రారంభమై, 3 ఎంపీ సెగ్మెంట్ల పరిధిలోని 21 అసెంబ్లీ నియోజకవర్గాలను కవర్ చేస్తూ హైదరాబాద్‌లో ముగిస్తుంది.
► కొమురం భీం క్లస్టర్: ఈ నెల 20వ తేదీనే ఆదిలాబాద్ జిల్లాలోని ముథోల్‌లో ప్రారంభవుతుంది. దీనికి ముఖ్యఅతిథిగా అస్సోం సీఎం హిమంతబిశ్వ శర్మ హాజరవుతున్నారు. అదే రోజు బహిరంగసభ కూడా ఉంటుంది. ఈ యాత్ర 21 అసెంబ్లీ నియోజకవర్గాల్లో సాగి నిజామాబాద్ జిల్లా బోధన్‌లో ముగుస్తుంది
►రాజరాజేశ్వరి క్లస్టర్: వికారాబాద్ జిల్లా తాండూరులో ఈ నెల 20న ప్రారంభమయ్యే యాత్ర ను గోవా సీఎం ప్రమోద్ సావంత్ ప్రారంభించి, అక్కడే ఏర్పాటు చేసిన బహిరంగసభలో పాల్గొంటారు. ఈ యాత్ర 4 ఎంపీ సెగ్మెంట్‌ల పరిధిలో ని 28 అసెంబ్లీ నియోజకవర్గాలను కవర్ చేస్తూ కరీంనగర్‌లో ముగుస్తుంది.
►కృష్ణమ్మ క్లస్టర్ : నారాయణపేట జిల్లా మక్తల్‌లో 20వ తేదీనే ఈ యాత్ర మొదలై 3 ఎంపీ సెగ్మెంట్ల పరిధిలోని 21 అసెంబ్లీ నియోజకవర్గాల్లో సాగి నల్లగొండలో ముగుస్తుంది
►కాకతీయ–భద్రకాళి యాత్ర : ఇది ఈ నెల 25వ తేదీన భద్రాచలంలో ప్రారంభమై 3 ఎంపీ సెగ్మెంట్ల పరిధిలోని సీట్లలోని 21 అసెంబ్లీ నియోజకవర్గాలను కవర్ చేస్తూ ములుగులో ముగుస్తుంది.