‘టీఆర్‌ఎస్‌ మంత్రుల గూండాయిజం’

Bandi Sanjay Fires On TRS Leaders - Sakshi

మంత్రులు, ఎమ్మెల్యేలు సీఎం కేసీఆర్‌ కంట్రోల్‌లో లేరు  

మంత్రి, సీఎంవో ఆదేశాలతోనే సాయి మరణ వాంగ్మూలం తీసుకోలేదు 

మంత్రి పువ్వాడ అజయ్‌కుమార్‌ను వదిలిపెట్టేది లేదు: బండి సంజయ్‌

ఖమ్మం మయూరిసెంటర్‌: రాష్ట్రంలో శాంతిభద్రతలు క్షీణించాయని, టీఆర్‌ఎస్‌ మంత్రులు, ఎమ్మెల్యేల గూండాయిజం, అరాచకాలను తట్టుకోలేక ప్రజలు ఆత్మహత్య చేసుకుంటున్నారని బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్‌ కుమార్‌ విమర్శించారు. ఇటీవల ఖమ్మంలో ఆత్మహత్య చేసుకున్న బీజేపీ కార్యకర్త సాయిగణేశ్‌ కుటుంబాన్ని ఆదివారం ఆయన పరామర్శించారు. సాయి చిత్రపటానికి పూలమాల వేసి నివాళులర్పించారు. సాయిది ఆత్మహత్య కాదని, మంత్రి పువ్వాడ చేసిన హత్య అని ఆరోపించారు. ఆస్పత్రిలో ఉన్న సమయంలో సాయిగణేశ్‌ నుంచి మరణ వాంగ్మూలం ఎందుకు తీసుకోలేదని పోలీసులను ప్రశ్నించారు. మంత్రి అజయ్‌ సూచనతోపాటు సీఎంవో నుంచి వచ్చిన ఆదేశాలకు అనుగుణంగానే స్థానిక పోలీసులు వ్యవహరించారని ఆరోపించారు.

ఇటీవల జరిగిన రామాయంపేట ఆత్మహత్యలు, నిర్మల్, కోదాడల్లో రేప్, వామన్‌రావు దంపతుల  హత్య, ఖమ్మంలో సాయిగణేష్‌ ఆత్మహత్య తదితర ఘటనలన్నీ టీఆర్‌ఎస్‌ మంత్రులు, ఎమ్మెల్యేలు, నేతలు ఎంఐఎం నేతలు చేయించినవేనని ఆరోపించారు. మంత్రులు, ఎమ్మెల్యేలు సీఎం కేసీఆర్‌ కంట్రోల్‌లో లేరని అన్నారు. తాము అధికారంలోకి రాగానే మంత్రి పువ్వాడ భూకబ్జాలను తోడుతామని, ఎవరినీ వదిలిపెట్టబోమని హెచ్చరించారు. సాయిగణేశ్‌ కుటుంబాన్ని ఆదుకునేందుకు బీజేపీ ముందుకొచ్చింది.

సాయి గణేశ్‌ అమ్మమ్మ సావిత్రమ్మ ప్రస్తుతం అద్దె ఇంట్లో నివాసం ఉంటుండగా, ఆ ప్రాంతంలోనే రూ.15 లక్షలతో ఇల్లు కొనుగోలు చేసి, పట్టా కాగితాలను బండి సంజయ్‌ చేతుల మీదుగా అందజేశారు. సాయి చెల్లెలు కావేరికి ఉద్యోగం ఇప్పిస్తామని హామీ ఇచ్చారు. సాయి గణేశ్‌తో నిశ్చితార్థం జరిగిన విజయతో సంజయ్‌ మాట్లాడారు. పార్టీ అండగా ఉంటుందని, విజయకు న్యాయం చేస్తామని భరోసా ఇచ్చారు.

అమిత్‌ షా రాకతో కార్యకర్తల్లో జోష్‌
బంజారాహిల్స్‌(హైదరాబాద్‌): మొదటివిడత ప్రజా సంగ్రామయాత్రతో ప్రజల్లో స్పష్టత వచ్చిందని బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు, ఎంపీ బండి సంజయ్‌ అన్నారు. ప్రజాసంగ్రామ యాత్ర విజయవంతమైన సందర్భంగా ఆదివారం ఆయన జూబ్లీహిల్స్‌ పెద్దమ్మతల్లిని దర్శించుకున్నారు. ఆయన మాట్లాడుతూ అమిత్‌ షా రాకతో ప్రతి కార్యకర్తలో జోష్‌ వచ్చిందని, ఆయన సందేశం కొన్ని రాజకీయ పార్టీలకు చెంపపెట్టు లాంటిదని అన్నారు. ఉచిత వైద్యం, విద్య అనే హామీకి కట్టుబడి ఉన్నామని చెప్పారు.

పేదరికంతో ఎంతోమంది గుడిసెల్లో జీవిస్తున్నారని, పేదలందరికీ ఇళ్లను నిర్మించి ఇస్తామన్నారు. దర్శనం అనంతరం సంజయ్‌కు కాంగ్రెస్‌ మాజీ ఎమ్మెల్యే పి.విష్ణువర్ధన్‌రెడ్డి సతీమణి లక్ష్మిశృతి పెద్దమ్మతల్లి చిత్రపటాన్ని బహూకరించారు.    

Read latest Politics News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top