
సాక్షి, హైదరాబాద్: తెలంగాణ మోడల్ పాలనే ఎజెండాగా మహారాష్ట్రలోని 288 నియోజకవర్గాల్లో బీఆర్‌ఎస్ విస్తరణ చేపట్టాలని పార్టీ అధినేత, సీఎం కేసీఆర్ ఆ పార్టీ నాయకులకు సూచించారు. ప్రతి గ్రామంలోనూ అన్ని వర్గాల ప్రజల భాగస్వామ్యంతో తొమ్మిది కమిటీలను ఏర్పాటు చేయాలని చెప్పారు. గురువారం మహారాష్ట్ర నుంచి వచ్చిన పలువురు కేసీఆర్ సమక్షంలో బీఆర్‌ఎస్‌లో చేరారు. వారందరికీ సీఎం గులాబీ కండువాలు కప్పి పార్టీలోకి ఆహ్వానించారు.
అనంతరం మాట్లాడుతూ.. తెలంగాణలో రైతులు సహా అన్ని వర్గాల ప్రజలకు అందిస్తున్న సంక్షేమ పాలన మోడల్‌పై కరపత్రాలు, బుక్‌లెట్స్, పోస్టర్స్, హోర్డింగ్స్, సోషల్‌మీడియా ద్వారా విస్తృత ప్రచారం చేయాలని సూచించారు. తెలంగాణలో ధరణి పోర్టల్ ఏర్పాటు, రైతుబంధు, రైతుబీమా పథకాల అమలు, 24 గంటల ఉచిత విద్యుత్తు వంటి పథకాలతో రైతులకు భరోసా కల్పిస్తున్నామని తెలిపారు.
మహారాష్ట్ర ప్రజలకూ తెలంగాణ పథకాలు అందించాలనే లక్ష్యంతో బీఆర్‌ఎస్ పనిచేస్తోందని, అక్కడి రైతులు సహా అన్ని వర్గాల ప్రజలు పార్టీని ఆదరిస్తున్న తీరు సంతోషకరమని కేసీఆర్ అన్నారు. కాగా సామాజిక కార్యకర్త డాక్టర్ సుభాష్ రాథోడ్, సేనా సంఘటన్ నుంచి ఉమేష్ చవాన్, బీజేపీకి చెందిన సివిల్ ఇంజనీర్ దీపక్‌పవార్, భారత్‌పవార్, అకోలా బజార్ ఉప సర్పంచ్ అశోక్‌రాథోడ్ తదితరులు బీఆర్‌ఎస్‌లో చేరారు. కార్యక్రమంలో మహారాష్ట్ర బీఆర్‌ఎస్ నాయకులు శంకరన్న దొండ్గే, మాణిక్ కదం, టీఎస్‌ఐడీసీ చైర్మన్ వేణుగోపాలచారి, హిమాన్షు తివారి పాల్గొన్నారు.
నాగ్‌పూర్‌లో బీఆర్‌ఎస్ కార్యాలయం
భారత్ రాష్ట్ర సమితి కార్యాలయాన్ని మహారాష్ట్రలోని నాగ్‌పూర్‌లో ఈనెల 15న ప్రారంభించేందుకు సన్నాహాలు జరుగుతున్నాయి. పార్టీ అధినేత, సీఎం కేసీఆర్ దీన్ని ప్రారంభిస్తారు. ఈ సందర్భంగా పార్టీ మహారాష్ట్ర శాఖకు చెందిన నేతలతో కేసీఆర్ సమావేశం కానున్నారు.
ఇప్పటికే మహారాష్ట్రలో బీఆర్‌ఎస్ రెండ్రోజుల శిక్షణ కార్యక్రమాన్ని కేసీఆర్ ప్రారంభించగా ప్రస్తుతం క్షేత్రస్థాయిలో 288 అసెంబ్లీ నియోజకవర్గాల పరిధిలో పార్టీ సంస్థాగత కమిటీల ఏర్పాటు, సభ్యత్వ నమోదు వంటి కార్యక్రమాలు జరుగుతున్నాయి. జూలై 8 నాటికి కమిటీల ఏర్పాటు పూర్తవుతుందని పార్టీ వర్గాలు వెల్లడించాయి. కాగా చేరికల వేగాన్ని బట్టి జూలైలో మధ్యప్రదేశ్‌లోనూ బహిరంగసభను నిర్వహించే యోచనలో కేసీఆర్ ఉన్నారు.