● ఎగువ పంపుహౌస్‌లకు కొనసాగుతున్న ఎత్తిపోతలు
రామగుండం: పెద్దపల్లి జిల్లా ఎల్లంపల్లి శ్రీపాద ప్రాజెక్టులో నీటినిల్వలు సగానికిపైగా పడిపోయాయి. కాళేశ్వరం ఎత్తిపోతలు మూడేళ్లుగా నిలిచిపోవడంతో ఏటా మే చివరినాటికి ప్రాజెక్టులో నీటి మట్టం అడుగంటిపోతోంది. ఈసారి కూడా అదేపరిస్థితి పునరావృతమవుతోంది. అయితే, రెండేళ్లక్రితం ప్రాజెక్టు డెడ్ స్టోరేజీకి చేరుకోవడంతో అధికారులు ఆగమేఘాలపై ప్రత్యామ్నాయ చర్యలు తీసుకున్నారు. ఈసారి అలాంటి పరిస్థితి తలెత్తకుండా ముందస్తు చర్యలు తీసుకుంటున్నారు.
ప్రస్తుతం మెరుగైన పరిస్థితి
హైదరాబాద్ ప్రజల తాగునీటి అవరాల కోసం అంతర్గాం మండలం బ్రాహ్మణపల్లి పంపుహౌస్ నుంచి 6.6 కేవీ సామర్థ్య కలిగిన ఆరు విద్యుత్ మోటార్లతో ప్రతీరోజు 56 క్యూసెక్కులు(0.03 టీఎంసీ)లు తరలిస్తున్నారు. ప్రాజెక్టు పూర్తిస్థాయి నీటిమట్టం 148 మీటర్లు కాగా శుక్రవారం 144.50 మీటర్ల ఉంది. 11.65 టీఎంసీలు నీరునిల్వ ఉంది. గతేడాది ఇదేరోజు నీటిమట్టం 143.42 మీటర్లు, నీటినిల్వలు 9.67 టీఎంసీలు ఉన్నాయి. గతేడాదితో పోల్చితే రెండు టీఎంసీలు అధికంగా ఉండడం ఊరటనిచ్చే అంశం.
కొనసాగుతున్న ఎత్తిపోతలు
ఎల్లంపల్లి నుంచి ఎన్టీపీసీ 242 క్యూసెక్కులు, గూడెం పంపుహౌస్‌కు 290 క్యూసెక్కులు, హైదరాబాద్‌కు 300 క్యూసెక్కులు పంపింగ్ చేస్తున్నారు. ప్రాజెక్టులోకి 1,251 క్యూసెక్కులు ఇన్‌ఫ్లో ఉంది.
అధికారుల ప్రత్యేక దృష్టి
ఎల్లంపల్లిలో నీటినిల్వల లభ్యతపై హైదరాబాద్ మెట్రో అధికారులు ప్రత్యేక దృష్టి సారిస్తున్నారు. రెండేళ్ల క్రితం డ్యాంలో నీటినిల్వలు అడుగంటిపోయాయి. పంపుహౌస్‌లోని విద్యుత్ మోటార్లకు నీరు అందలేదు. లోతట్టులోని నీటి నిల్వల నుంచి ప్రత్యేక పైపులైన్ నిర్మించి మోటార్లకు అనుసంధానించారు. తద్వారా తాగునీటి పంపింగ్ సులువయ్యింది. ఈసారి ఆ పరిస్థితి తలెత్తకుండా అప్రమత్తంగా ఉన్నారు.


