పంటల పరిరక్షణకు మల్లారం అన్నదాత వినూత్న ఆలోచన కోతులు, అడవిపందుల నుంచి పంటలు కాపాడుకునేందుకు తిప్పలు
మంథనిరూరల్: అడవిపందులు, కోతులు, పశువుల బారినుంచి పంటలను రక్షించుకునేందుకు అన్నదాతలు నానాతంటాలు పడుతున్నారు. సాగు చేసిన సమయం నుంచి పంట కోతకు వచ్చేవరకూ కాపలా ఉండాల్సిన పరిస్థితులు నెలకొన్నాయి. పంట చేతికందే సమయంలో అడవిపందులు, కోతులు పంటను నాశనం చేసిన సందర్బాలు అనేకం ఉన్నా యి. ఈ క్రమంలో మంథని మండలం మల్లారం గ్రామానికి చెందిన ఓ రైతు వినూత్న ఆలోచన చేశారు. అడవిపందులు, కోతులబారి నుంచి పంటలను కాపాడుకుంటున్నారు.
ఆరెకరాల్లో వరి సాగు
మల్లారం గ్రామానికి చెందిన జక్కుల రమేశ్ తనకున్న ఆరెకరాల్లో వరి సాగు చేశాడు. అంతకుముందు పత్తి సాగు చేయగా అడవిపందులు, కోతుల బెడత ఎక్కువ కావడంతో ప్రత్యామ్నాయంగా సాగు చేశాడు. అయినా వాటి బెడద తప్పలేదు. దీంతో సోలార్ కంచెతోపాటు రంగుల సీసాలు పెట్టి పంటను రక్షించుకుంటున్నాడు.
తగ్గిన బెడద..
వరి పొలం చుట్టూ సోలార్ విద్యుత్ కంచె ఏర్పాటు చేయడంతో అడవిపందుల బెడద కొంతమేర తగ్గిందని, కోతుల నుంచి పంటను రక్షించుకోవడానికి రంగుల సీసాలు ఏర్పాటు చేశానని రైతు తెలిపాడు. రంగు సీసాలను చూస్తే కోతులు బెదురుతాయని తెలుసుకుని అక్కడక్కడా ఏర్పాటు చేసినట్లు రమేశ్ తెలిపాడు. ఇంతచేసినా కొంతమేరకే వాటి బెడద తప్పుతోందని, అధికారులు చొరవ తీసుకుని వాటిబారి నుంచి పంటలను రక్షించేలా సంపూర్ణ చర్యలు తీసుకోవాలని రైతు కోరుతున్నాడు.


