అంతా ఓకేనా..
నేడు ఎన్నికల ప్రచారం సమాప్తం
● ప్రచార సరళిపై అభ్యర్థుల సమీక్ష
● నేడు మున్సిపల్ ఎన్నికల ప్రచారానికి తెర
● చివరిరోజు ధూంధాం ప్రచారానికి నాయకుల ప్రణాళిక
సాక్షి పెద్దపల్లి: హోరాహోరీగా సాగుతున్న ఎన్నికల ప్రచా రానికి మరికొన్ని గంటల్లో తెరపడనుంది. ఈనెల 11న పోలింగ్ జరుగనుంది. నిబంధనల ప్రకారం పోలింగ్‌కు 48 గంటల ముందే ప్రచారం ముగించాల్సి ఉంటుంది. దీంతో సోమవారం సాయంత్రం 5 గంటల వరకే ప్రచారానికి గడువు ఉంది. ఈ సమయం చాలా విలువైనదిగా అభ్యర్థులు భావిస్తున్నారు. నిధుల కొరతను అధిగమిస్తూ వ్యాపారులు, ఇతర రంగాల వారి సాయం తీసుకుని ఖర్చులకు వెచ్చించేలా ఏర్పాట్లు చేసుకుంటున్నారు.
లోటుపాట్లు సర్దుకునే యత్నం
ప్రచారంలో చిన్నచిన్న లోటుపాట్లను సర్దుకునేందుకు అభ్యర్థులు ఆలోచిస్తున్నారు. అసంతృప్తులు చేజారకుండా నమ్మకస్తులకు బాధ్యతలు అప్పగిస్తున్నారు. స్వయంగా కలవని ఓటర్లను ఫోన్ ద్వారా పలకరించేందుకు సిద్ధమవుతున్నారు. దూరప్రాంతాల్లోని వారిని ఇక్కడకు రప్పించేందుకు రవాణా చార్జీలు భరిస్తామని, తమకు ఓటువేయాలని వేడుకుంటున్నారు. ఇలాంటి వారి జాబితా తయారుచేసుకొని వారితో మాట్లాడే బాధ్యతను అనుచరులకు అప్పగిస్తున్నారు. కులాల వారీగా సమీక్షిస్తున్నారు.
తటస్థ ఓటర్లు ఎటువైపు?
అభ్యర్థులు, ముఖ్యనేతలు జాబితా ఆధారంగా ఓట ర్ల వివరాలు తెలుసుకునేందుకు డివిజన్లలో జల్లెడ పడుతున్నారు. అనుకూలంగా ఓట్లు వేసే వారెంద రు? ప్రత్యర్థికి ఓట్లు వేసే వారెందరు? తటస్థులు ఎందరు? అనే వివరాలు సేకరిస్తున్నారు. దీనిద్వా రా చీలిపోయే ఓట్లు ఏ అభ్యర్థికి నష్టం కల్గిస్తాయి? అనే ప్రాథమిక అంచనాకు వస్తున్నారు. తమకు తప్పక ఓట్లు వేస్తారని భావిస్తున్న ఓటర్లను కాపాడుకోవడంతోపాటు వైరిపక్షానికి వెళ్తారని భావిస్తున్న ఓటర్లు, తటస్థులపై ప్రత్యేక దృష్టి పెడుతున్నారు. తమవైపు తిప్పుకోవడానికి యత్నిస్తున్నారు. కాలనీపెద్దలతో మమేకమవుతూ ఎవరు చెబితే వింటారో?వారితో ఫోన్లు చేయిస్తూ మద్దతు కూడగట్టే ప్రయత్నం చేస్తున్నారు. అయితే, బస్తీవాసులు ప్రస్తావిస్తున్న డిమాండ్లను నెరవేరుస్తామని హామీలిస్తున్నారు. ముఖ్యల ఇళ్లకు ప్రత్యర్థులు వెళ్లిరాగానే, ఇతర అభ్యర్థులు వెంటనే ఆ ఇళ్ల వద్దకు వెళ్లి తమకే మద్దతు ఇవ్వాలని వేడుకుంటున్నారు.
చివరిరోజు బలనిరూపణకు సన్నద్ధం
గెలుపు లక్ష్యంగా ప్రచారంలో చివరిరోజు ఇంటింటి ప్రచారంలో తమ వెనుక ఎక్కువ మంది ఉండేలా అభ్యర్థులు చాలాజాగ్రత్త తీసుకుంటున్నారు. ఇలాచేస్తే తమకే మద్దతు అధికంగా ఉందనే భావన ఓటర్లలో కలిగించవచ్చనే కోణంలో కొందరు వ్యూహాలు రచిస్తున్నారు. మరికొందరు బైక్‌ర్యాలీలు చేసేందుకు ప్రణాళిక సిద్ధం చేసుకుంటుండగా, నేతల వెనుక ఉండి జైకొట్టేవాళ్ల కొరత లేకుండా వైరిపక్షం కన్నా రూ.100 కూలి అధికంగా ఇచ్చేసైనా సరే బలప్రదర్శనతో ప్రచారాన్ని ఉత్సాహంగా ముగించే ఏర్పాట్లలో నిమగ్నమైంది.
‘సండే’ ఎఫెక్ట్
ప్రచారం చివరిదశకు చేరడం.. ఆదివారం కలిసిరావడంతో జిల్లాలోని 124 వార్డులు/డివిజన్లలో ప్రధాన పార్టీల అభ్యర్థులు ముందస్తు ప్రలోభాలకు తెరతీశారు. ఉదయం వేళ ఓటర్ల కుటుంబాల ఇళ్లకు చికెన్ పంపిణీ చేశారు. రోజూ చీఫ్ లిక్కర్ తాగేవాళ్లు కూడా బ్రాండ్ మారుస్తుండటంతో అభ్యర్థులు వారికి కాస్ట్‌లీ మద్యం పంపిణీ చేశారు. ఇది తెలిసిన మిగిలిన వార్డు ఓటర్లు కూడా తమకు చికెన్ కావాలంటూ అభ్యర్థులకు ఫోన్స్‌చేసి మరీ డిమాండ్ చేయడం చర్చనీయాంశంగా మారింది.
పెద్దపల్లి: మున్సిపల్ ఎన్నికల ప్రచారానికి సోమవారం సాయంత్రం 5 గంటలకు తెరపడనుంది. దీంతో ఆయా పార్టీల అభ్యర్థులు, స్వతంత్రులు ఎన్నికల ప్రచారం ఉధృతం చేశారు. అధికార కాంగ్రెస్, బీఆర్‌ఎస్, బీజేపీ నాయకులు ఈ ఎన్నికలను సవాల్‌గా తీసుకుని ప్రచారం ముమ్మరం చేశారు. మున్సిపల్‌పై జెండా ఎగురవేసేలా ప్రణాళిక సిద్ధం చేసుకుని ముందుకు వెళ్తున్నారు. కార్నర్ మీటింగ్‌లతో ఎమ్మెల్యే విజయరమణారావు పెద్దపల్లి, సుల్తానాబాద్ మున్సిపల్ పరిధిలో ఎన్నికల ప్రచారం చేశారు. మరోవైపు.. గోదావరిఖని వెళ్తూ కేంద్రమంత్రి కిషన్‌రెడ్డి పెద్దపల్లి, సుల్తానాబాద్‌లో రోడ్డుషో చేపట్టే అవకాశం ఉందని బీజేపీ జిల్లా అధ్యక్షుడు కర్రె సంజీవరెడ్డి తెలిపారు.
అంతా ఓకేనా..


